1,05,901 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించాం | Sakshi
Sakshi News home page

1,05,901 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించాం

Published Sun, May 21 2023 4:28 AM

తూప్రాన్‌లో రైతులతో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ రమేశ్‌ - Sakshi

అదనపు కలెక్టర్‌ రమేశ్‌

తూప్రాన్‌: జిల్లాలో 407 కొనుగోలు కేంద్రాల ద్వారా 25,319 మంది రైతుల నుంచి 1,05,901 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి ఇప్పటివరకు రూ. 77.21 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని అదనపు కలెక్టర్‌ రమేశ్‌ పేర్కొన్నారు. శనివారం మండలంలోని కొనుగోలు కేంద్రాలు, రైస్‌ మిల్లులను జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్‌తో కలిసి ఆకస్మికంగా సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హమాలీలను అధిక సంఖ్యలో పెట్టుకొని ధాన్యం వచ్చిన 24 గంటల్లోగా దించుకొని ట్రక్‌ షీట్‌ అందజేయాలని రైస్‌ మిల్లర్లకు సూచించారు. అకాల వర్షాలతో ధాన్యం సేకరణలో కాస్త ఇబ్బందులు ఎదురైనా ప్రస్తుతం వాతావరణం అనుకూలంగా ఉందన్నారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూం ద్వారా ప్రతి రోజు ధాన్యం సేకరణ ప్రక్రియపై మానిటరింగ్‌ చేస్తున్నామని స్పష్టం చేశారు. గోనె సంచులు, లారీల సమస్యలు ఉత్పన్నం కాకుండా పర్యవేక్షిస్తున్నామని వివరించారు. తూకంలో ఎలాంటి తేడాలు గమనించిన కంట్రోల్‌ రూం 08452–223360 నెంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ జ్ఞానజ్యోతి, తదితరులు పాల్గొన్నారు.

తరుగుపై ఫిర్యాదులు..

రామాయంపేట(మెదక్‌): కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తరుగు తీస్తున్న విషయమై చాలా ఫిర్యాదులు వస్తున్నాయని.. ఈవిషయమై చర్యలు తీసుకుంటున్నామని అదనపు కలెక్టర్‌ రమేశ్‌ పేర్కొన్నారు. నార్సింగి మండల కేంద్రంలో శనివారం పలు రైస్‌ మిల్లులను జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్‌తో కలిసి తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తరుగు విషయమై తూనికలు, కొలతల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. వారి వెంట నార్సింగి తహసీల్దార్‌ సత్యనారాయణ ఉన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement