ముగిసిన నామినేషన్లు | Sakshi
Sakshi News home page

ముగిసిన నామినేషన్లు

Published Sat, Nov 11 2023 4:26 AM

-

మెదక్‌: శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఈనెల 3వ తేదీ నుంచి శుక్రవారం వరకు మెదక్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి 18 మంది అభ్యర్థులు 29 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సిట్టింగ్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి 4 సెట్లు వేయగా, కాంగ్రెస్‌ అభ్యర్థి మైనంపల్లి రోహిత్‌రావు 3 సెట్లు వేశారు. అలాగే బీజేపీ అభ్యర్థి పంజావిజయ్‌ కుమార్‌ 2 సెట్ల చొప్పున నామినేషన్లు దాఖలు చేశారు. 13వ తేదీన నామినేషన్ల పరిశీలన, 15వ తేదీన ఉపసంహరణ, అభ్యర్థుల తుది జాబితా అదేరోజు వెలువడుతుందని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి తెలిపారు.

స్వతంత్ర అభ్యర్థిగా

మైనంపల్లి వాణి

మెదక్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా మైనంపల్లి రోహిత్‌రావు 3 సెట్లు నామినేషన్‌ దాఖలు చేయగా, ఆయన తల్లి మైనంపల్లి వాణి ఆఖరిరోజైనా శుక్రవారం స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. కుమారుడు ప్రధాన పార్టీ కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో ఉంటే, తల్లి ఎందుకు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేసిందని మెదక్‌లో చర్చనీయాంశమైంది. ఈ విషయంపై రోహిత్‌ను సంప్రదించేందుకు ప్రయత్నం చేయగా ఆయన అందుబాటులోకి రాలేదు.

నర్సాపూర్‌ నుంచి 16 మంది..

నర్సాపూర్‌: నర్సాపూర్‌ శాసనసభ నియోజక వర్గం నుంచి 16 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారని నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి శ్రీనివాసులు తెలిపారు. శుక్రవారం నాటికి 16 మంది అభ్యర్థులు 29 నామినేషన్లు దాఖలు చేశారని, కొందరు ఎక్కువ సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు చెప్పారు.

చివరి రోజు 11 మంది ..

అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల చివరి రోజైన శుక్రవారం 11 మంది 14 నామినేషన్లు దాఖలు చేసినారని నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి శ్రీనివాసులు తెలిపారు. బీజేపీ అభ్యర్థిగా మురళీధర్‌యాదవ్‌, కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఆవుల రాజిరెడ్డి, బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా వాకిటి సునీతారెడ్డి తమ నామినేషన్లు దాఖలు చేశారు. బీఎస్పీ అభ్యర్థిగా కుతాడి నర్సింహులు, యుగతులసి పార్టీ అభ్యర్థిగా పిట్ల నవీన్‌కుమార్‌, భారతీయ చైతన్య యువజన పార్టీ అభ్యర్థిగా ఆగమయ్య, స్వతంత్ర అభ్యర్థులు గా మాధవి, పిల్లుట్ల లక్ష్మి, లకావత్‌ రమేష్‌, బిడిమిట్ల లక్ష్మి నామినేషన్‌ దాఖలు చేశారు. కాగా గతంలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన గాలి అనిల్‌కుమార్‌ శుక్రవారం స్వతంత్ర అభ్యర్థిగా మరో నామినేషన్‌ దాఖలు చేయడం గమనార్హం.

మెదక్‌లో 18 మంది అభ్యర్థులు29 సెట్లు దాఖలు

పద్మాదేవేందర్‌రెడ్డి 4, రోహిత్‌ 3,పంజావిజయ్‌ 2 సెట్లు అందజేత

Advertisement
Advertisement