కాంగ్రెస్‌ వస్తే కన్నీళ్లే.. | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ వస్తే కన్నీళ్లే..

Published Thu, Nov 16 2023 7:08 AM

- - Sakshi

ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్ల పరిశీలన

రేవంత్‌రెడ్డికి వ్యవసాయం తెలియదు

మంత్రి హరీశ్‌రావు

నర్సాపూర్‌: రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రైతులతో పాటు అన్నివర్గాల ప్రజలకు కన్నీళ్లే మిగులుతాయని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. గురువారం నర్సాపూర్‌లో జరగనున్న బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభకు ఏర్పాట్లను ఆయన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి సునీతారెడ్డితో కలిసి బుధవారం పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్‌ నాయకుడు రేవంత్‌రెడ్డిపై ధ్వజమెత్తారు. ఆయనకు వ్యవసాయం గురించి తెలియదన్నారు. 10 హెచ్‌పీ మోటార్లు మూడు గంటల పాటు నడిపితే మూడెకరాల వ్యవసాయం సాగు చేయెచ్చని రేవంత్‌రెడ్డి చెప్పడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. రేవంత్‌ ఒక తప్పును కప్పి పుచ్చుకునేందుకు మరో పది తప్పులు చేస్తున్నారని ఆరోపించారు. తమ పార్టీ మేనిఫెస్టో కాంగ్రెస్‌ నాయకులకు అర్థం కాలేదని; ఎస్సీ, ఎస్టీ, బీసీల వద్ద ఉన్న అసైన్డ్‌ భూములకు పూర్తి హక్కులు వారికే కల్పిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నామని; అది అర్థంకాక తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే కటిక చీకటి వస్తుందని, కర్ణాటకలో నాలుగు నెలల కాంగ్రెస్‌ పాలన కాలంలో 250 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని విమర్శించారు. మన సీఎం కేసీఆర్‌ వ్యవసాయం అభివృద్ధి కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారన్నారు. నిరంతరం ఉచిత విద్యుత్‌ అందిస్తున్నారని చెప్పారు. కష్టాలు కావాలో.. నిరంతర విద్యుత్‌ కావాలో.. ఆలోచించి ఓటు వేయాలని హరీశ్‌రావు అన్నారు. నర్సాపూర్‌ నియోజకవర్గంలోని గిరిజన తండాలలో సీసీ రోడ్లకు రూ.56 కోట్లు, బీటీ రోడ్ల ఏర్పాటుకు రూ.146 కోట్లు సీఎం కేసీఆర్‌ ప్రత్యేకంగా నిధులు మంజూరు చేశారని, గత పాలనలో గిరిజన తండాలు అభివృద్ధి చెందలేదని గుర్తుచేశారు. ప్రస్తుత ఎన్నికలలో గిరిజనులకు ఏడు స్థానాలు సీఎం కేటాయించారని హరీశ్‌రావు చెప్పారు. సేవాలాల్‌ జయంతిని అధికారికంగా చేపట్టడంతో పాటు సేవాలాల్‌ దేవాలయాలలో దూపదీప సేవచేసే వారికి ఆర్థిక సహాయం ప్రభుత్వం అందిస్తుందని గుర్తు చేశారు.

ఆడబిడ్డను ఆశీర్వదించాలి

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్న ఆడబిడ్డ సునీతారెడ్డిని ఆశీర్వదించాలని మంత్రి హరీశ్‌రావు ప్రజలను కోరారు. సునీతారెడ్డిని ఆశీర్వదించేందుకు గురువారం సీఎం వస్తున్నారని, సభను విజయవంతం చేయాలని నియోజకవర్గ ప్రజలు, నాయకులను కోరారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మంచి వారని, సునీతారెడ్డి ప్రజలకు సేవచేసే మంచి మనసున్న నాయకురాలని మంత్రి కొనియాడారు. ఆమెను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

ఆశీర్వాద సభలో భారీగా చేరికలు

బీఆర్‌ఎస్‌ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ఇతరపార్టీల నుంచి అధిక సంఖ్యలో నాయ కులు తమ పార్టీలో చేరుతున్నారని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. పీసీసీ ఉపాధ్యక్షుడు గాలి అనిల్‌కుమార్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు గురువారం సీఎం కేసీఆర్‌ సమక్షంలో తమ పార్టీలో చేరుతారని మంత్రి చెప్పారు. బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సింగాయిపల్లి గోపితో పాటు పలువురు కౌన్సిలర్లు, మండల నాయకులు పార్టీలో చేరుతారని హరీశ్‌రావు వివరించారు. ఆశీర్వాద సభ ఏర్పాట్లను, సీఎం దిగడానికి హెలీపాడ్‌ ఏర్పాట్లను ఆయన పరీశీలించి పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డి, కార్మిక బోర్డు చైర్మన్‌ దేవేందర్‌రెడ్డితో పాటు పలువురు నాయకులు ఉన్నారు. కాగా నర్సాపూర్‌ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌గుప్తా, కోశా ధికారి మల్లేశంగుప్తా బీఆర్‌ఎస్‌లో చేరగా వారికి మంత్రి హరీశ్‌రావు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

Advertisement
Advertisement