అరచేతిలో ప్రచార జోరు | Sakshi
Sakshi News home page

అరచేతిలో ప్రచార జోరు

Published Mon, Nov 20 2023 4:30 AM

- - Sakshi

నారాయణఖేడ్‌: శాసనసభ ఎన్నికల ప్రచారం జిల్లాలో ఊపందుకుంది. అభ్యర్థులు విజయం కోసం ఊరూవాడా తిరుగుతూ ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. అంతేకాకుండా సోషల్‌మీడియాలో కూడా జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా మనుషులను నియమించు కుంటున్నారు. ఎప్పటికప్పుడు ప్రచార ఫొటోలు, వీడియోలు, తాజా అంశాల సమాచారం సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేయిస్తున్నారు. ప్రచారంలో మాట్లాడిన అంశాలను టెక్ట్స్‌ మెసేజ్‌లు పోస్ట్‌ చేస్తున్నారు. గతంలో సోషల్‌మీడియా గ్రూ్‌పులలో సభ్యుల పరిమితి సంఖ్య కేవలం 250 మాత్రమే ఉండేది. ప్రస్తుతం ఆ సంఖ్య 1,200 వరకు చేర్చుకునే వెసులుబాటు ఉంది. ఇలా అనేక గ్రూపులను క్రియేట్‌ చేస్తూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. చేరికల విషయాన్ని బిగ్‌ బ్రేకింగ్‌ న్యూస్‌ అంటూ ఫొటోలు, వీడియోలు, మ్యాటర్‌ ఆకట్టుకునే విధంగా గ్రూపుల్లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. ఇలా నిత్యం సెల్‌ఫోన్లలో అభ్యర్థుల ప్రచారం ఊపందుకుంటోంది.

క్షణాల్లో సమాచారం

గతంలో నాయకులు ఎక్కడైనా ప్రచారం చేస్తే మరుసటి రోజు పత్రికలు, టీవీల్లో కనిపించేది. ఇప్పుడు సోషల్‌ మీడియాను ప్రచారాస్త్రంగా వాడుకుంటున్నారు. తమ నేతలు ఎక్కడికి వెళితే అక్కడి నుంచే లైవ్‌ ద్వారా చూపిస్తున్నారు. హార్డ్‌ వర్క్‌ కన్నా స్మార్ట్‌వర్క్‌ చేస్తే తక్కువ సమయంలో ఎక్కువ ఫలితం సాధించ వచ్చన్న నానుడి ఎన్నికల సమయంలో సోషల్‌ మీడియా ద్వారా రుజువు అవుతుంది.

నెట్‌ డాటా.. చార్జింగ్‌ ఢమాల్‌..

ఉదయం కోడి కూత కూయక ముందే సెల్‌ఫోన్‌లోని గ్రూపుల్లో వచ్చే మెస్సేజ్‌ చప్పుళ్ళతో నిద్రలేవాల్సి వస్తుంది. ఆయా గ్రూపుల్లో వందలాది పోస్టులు వస్తున్నాయి. ఓ పక్క నెట్‌ డాటా ఖర్చు కావడంతోపాటు మరో పక్క చార్జింగ్‌ ఉండడంలేదని జనాలు వాపోతున్నారు. గ్రూపుల్లో ఒకే అంశంపై పదుల సంఖ్యలో ఫొటోలు పెట్టడం, వాటినే మరొకరు ఫార్వర్డ్‌ చేస్తుండడంతో విసుగు తెప్పిస్తుందని పేర్కొంటున్నారు. ఎంత విసుగు వచ్చినా ఏదైనా కామెంట్‌ చేస్తే ఎక్కడ ఏ నాయకుడు ఏమనుకుంటాడో అని సదరు వ్యక్తులు గమ్మున ఉంటూ భరిస్తున్నారు.

జర జాగ్రత్త

సోషల్‌ మీడియాపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక నిఘా ఉంచింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి లోబడే పోస్టులు పెట్టాలని స్పష్టం చేసింది. ఇందుకు స్వచ్ఛంద నైతిక నియమావళి రూపొందించారు. ఇష్టమొచ్చినట్లు రాతలు రాసి ఫొటోలు పెడితే ఎవరైనా అభ్యంతరం చెబితే ఇరుక్కునే ప్రమాదం ఉంది. ప్రత్యర్థులపై నిరాధారమైన ఆరోపణలు చేయడం అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అభ్యర్థులు, వారి అనుచరులు నియమావళిని ఉల్లంఘించిన వీడియోలు, ఫొటోలను పౌరులు ఎవరైనా ఎన్నికల సంఘానికి పంపించొచ్చు. సి–విజిల్‌ యాప్‌లో నమోదు చేయవచ్చు. పోస్టులు పెట్టేవారు సంయమనం పాటిస్తూ ఒకటికి రెండు సార్లు చెక్‌ చేసుకొని అభ్యంతరకరం లేనివాటినే పోస్టు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. వ్యక్తిగతంగా కించపరిచే పోస్టులకు దూరంగా ఉండాలి. ప్రత్యర్థి పార్టీల నేతలపై దూషణలకు దిగడం చట్టరీత్యా నేరం. తన పరువుకు భంగం కలిగినప్పుడు అవతలి వ్యక్తి పరువు నష్టం దావా వేసే అవకాశం ఉంది. రుజువైతే జరిమానాతోపాటు జైలు శిక్ష తప్పదు.

సోషల్‌ మీడియాలో అభ్యర్థుల

ఎలక్షన్‌ వార్‌

తెలవారక ముందు నుంచే మెసేజ్‌లు,

ఫొటోలు, వీడియోలు

అన్ని పార్టీలది ఇదే దారి..

ప్రతీ అభ్యర్థికి ప్రత్యేక బృందాలు

సోషల్‌ మీడియాలో అభ్యర్థుల

ఎలక్షన్‌ వార్‌

తెల్లవారక ముందే మెసేజ్‌లు,

ఫొటోలు, వీడియోలు

అన్ని పార్టీలది ఇదే దారి..

ప్రతీ అభ్యర్థికి ప్రత్యేక బృందాలు

Advertisement
Advertisement