లక్ష ఎకరాలకు కాళేశ్వరం జలాలు | Sakshi
Sakshi News home page

లక్ష ఎకరాలకు కాళేశ్వరం జలాలు

Published Fri, Nov 24 2023 4:38 AM

పటాన్‌చెరులో సభకు హాజరైన ప్రజలు  - Sakshi

● సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్టుల ద్వారా సాగునీరు ● పటాన్‌చెరులో ఐటీ పార్క్‌ ఏర్పాటు ● ఇస్నాపూర్‌ వరకు మెట్రో ● కాలుష్య రహిత పరిశ్రమలకు కృషి ● మాణిక్‌రావు, మహిపాల్‌రెడ్డిలను భారీ మెజార్టీతో గెలిపించండి ● జహీరాబాద్‌, పటాన్‌చెరు ఆశీర్వాద సభల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌

జహీరాబాద్‌లో ప్రజా ఆశీర్వాద సభకు హాజరైన ప్రజలు

జహీరాబాద్‌/పటాన్‌చెరు: కాళేశ్వరాన్ని సింగూరుతో లింకు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. సింగూరు బ్యాక్‌ వాటర్‌ నుంచి జహీరాబాద్‌ సంగమేశ్వర లిఫ్ట్‌ ద్వారా, నారాయణఖేడ్‌ ప్రాంతానికి బసవేశ్వర లిఫ్ట్‌ ద్వారా సాగు నీటిని అందించనున్నామని తెలిపారు. గురువారం జహీరాబాద్‌, సంగారెడ్డిలో జరిగిన ఆశీర్వాద సభల్లో ఆయన ప్రసంగించారు. జహీరాబాద్‌ నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీటిని అందిస్తామని హామీ ఇచ్చారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు ఏడాకుల పల్లి ప్రాజెక్టును కట్టించినట్లు తెలిపారు. జహీరాబాద్‌లోని నారింజ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

వికారాబాద్‌లో చెల్లని రూపాయి

ఇక్కడ చెల్లుతుందా?

కాంగ్రెస్‌ పార్టీకి స్థానికంగా లీడర్లు లేకపోవడంతో వికారాబాద్‌ నుంచి దిగుమతి చేసుకొని అభ్యర్థిని పెట్టిందని కేసీఆర్‌ ఎద్దేవా చేశారు. వికారాబాద్‌లో చెల్లని రూపాయి జహీరాబాద్‌లో ఎలా చెల్లుతుందన్నారు. మన లోకల్‌ లీడర్‌ మాణిక్‌రావు కావాలా, వికారాబాద్‌ ఆయన కావాలా అనేది జహీరాబాద్‌ ప్రజల ఆత్మగౌరవ పరీక్ష అన్నారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, ఎమ్మెల్యే కె.మాణిక్‌రావు సౌమ్యుడు అని, అభ్యర్థుల గుణగణాలను, వారి వెనుక ఉన్న పార్టీల గత చరిత్రను చూసి ఓటేయాలన్నారు. వ్యవసాయ రంగానికి 24 గంటలపాటు ఉచిత విద్యుత్‌ కావాలంటే మాణిక్‌రావును గెలిపించాలని కోరారు. మాణిక్‌రావు సౌమ్యుడు, ఉత్తముడు, చదువుకున్న వాడు, ఎవరికీ నష్టపెట్టడడని పేర్కొన్నారు. హైదరాబాద్‌కు పోయి ఉండకుండా ఇక్కడే అందుబాటులో ఉంటాడన్నారు. ప్రజల్లో ఉండే వ్యక్తినే గెలిపించుకోవాలని సీఎం కోరారు.

కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు, ఎంపీ బీబీ పాటిల్‌, ఎమ్మెల్యే కె.మాణిక్‌రావు, ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ వై.నరోత్తం, ఐడీసీ చైర్మన్‌ ఎండీ తన్వీర్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌ ఎం.శివకుమార్‌, డీఆర్‌యూసీసీ సభ్యుడు షేక్‌ ఫరీద్‌, బేవరేజెస్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ దేవిప్రసాద్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌ సభ్యుడు శంకర్‌ నాయక్‌, సీడీసీ చైర్మన్‌ ఉమాకాంత్‌ పాటిల్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు ఉమాకాంత్‌ పాటిల్‌, స్రవంతిరెడ్డి, శంకర్‌నాయర్‌, జి.గుండప్ప, వినీల నరేశ్‌, స్వప్నభాస్కర్‌, విజయ్‌మోహన్‌రెడ్డి, ఎం.సుభాస్‌రెడ్డి, నర్సింహులు, సుధీర్‌కుమార్‌, షిలా రమేశ్‌, మంజుల, మాణిక్యమ్మ, సరస్వతి, భాస్కర్‌, నరేశ్‌, వెంకటేశం, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.

ప్రజల మనిషి మహిపాల్‌ రెడ్డి

పటాన్‌చెరు బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మహిపాల్‌రెడ్డి ప్రజల మనిషి అని, పొద్దున లేస్తే ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటాడని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. పటాన్‌చెరులో కాలుష్యం ఎక్కువగా ఉందని, అందుకే రానున్న రోజుల్లో కాలుష్య రహిత పరిశ్రమలను నెలకొల్పడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పటాన్‌చెరులో ఐటీ పార్క్‌ ఏర్పాటు చేయనున్నామని, త్వరలో ఐటీ పరిశ్రమలు కూడా వస్తాయన్నారు. ఔటర్‌ రింగ్‌రోడ్డుకు మెట్రో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. ఇస్నాపూర్‌ వరకు మెట్రో సౌకర్యం వస్తుందన్నారు. ఎమ్మెల్యే విజ్ఞప్తులను పరిష్కరిస్తామన్నారు. అవేమీ గొంతెమ్మ కోరికలు కావని కేసీఆర్‌ వ్యాఖ్యా నించారు. కాలుష్య నియంత్రణ కోసం పాశమైలారం పారిశ్రామికవాడలో సీఈటీపీ నిర్మాణం చేస్తున్నామని తెలిపారు. అమీన్‌పూర్‌లో గతంలో 10 నుంచి 20 కాలనీలు ఉండేవని, కానీ ఇప్పుడు 300 కాలనీలు ఉన్నాయన్నారు. పటాన్‌చెరులో మళ్లీ గూడెం మహిపాల్‌ రెడ్డిను గెలిపించాలని కేసీఆర్‌ కోరారు. సభకు హాజరైన వారిలో కొందరు ఉత్తర భారతదేశానికి చెందిన ప్రజలు ఉన్నారని గమ నించిన కేసీఆర్‌ వారి కోసం హిందీలో ప్రసంగిస్తూ కరోనా కాలంలో కేంద్రం చేతులెత్తేస్తే ఇతర రాష్ట్ర ప్రజలను వారి సొంత ఊర్లకు తరలించామని సీఎం కేసీఆర్‌ గుర్తు చేశారు.

1/1

Advertisement
Advertisement