కౌంటింగ్‌కు కట్టుదిట్టమైన చర్యలు | Sakshi
Sakshi News home page

కౌంటింగ్‌కు కట్టుదిట్టమైన చర్యలు

Published Sun, Dec 3 2023 4:48 AM

కౌంటింగ్‌ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లు - Sakshi

● వైపీఆర్‌ కళాశాలలో ఏర్పాట్లు ● ప్రశాంత వాతావరణంలో లెక్కింపు ● సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ ● కేంద్రం వద్ద సాయుధ బలగాల పహారా ● జిల్లా కలెక్టర్‌ రాజార్షిషా

హవేళిఘణాపూర్‌(మెదక్‌): పోలింగ్‌ అనంతరం కట్టుదిట్టమైన భద్రత నడుమ ఓటింగ్‌ యంత్రాలను స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్రప్రరిచామని జిల్లా ఎన్నికల అధికారి రాజర్షిషా తెలిపారు. ఆదివారం హవేళిఘణాపూర్‌ వైపీఆర్‌ కళాశాలలో జరుగుతున్న ఎన్నికల ఏర్పాట్లను శనివారం ఆయన పరిశీలించారు. మెదక్‌ నియోజకవర్గ పరిధిలోని కౌంటింగ్‌ ప్రక్రియ 274 పోలింగ్‌ కేంద్రాలకుగాను 14 టేబుల్స్‌ ఏర్పాటు చేసి 20 రౌండ్స్‌లలో ఓట్లు లెక్కించనున్నారు. ఆ ఫలితాలను రౌండ్‌ల వారీగా తెలియజేనున్నారు. అలాగే అదే భవనంలోని మరో హాలులో నర్సాపూర్‌ నియోజకవర్గానికి చెందిన 305 పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కోసం 14 టేబుళ్లను ఏర్పాటుచేసి 22 రౌండ్లలో పూర్తి చేయనున్నారు. ఆయా సెగ్మెంట్ల నుంచి ఓట్ల లెక్కింపు కేంద్రమైన వైపీఆర్‌ కళాశాలకు ఈవీఎంలను తరలించి నిబంధనలకు అనుగుణంగా స్ట్రాంగ్‌ రూమ్‌ లో అమర్చినట్లు ఆయన చెప్పారు. స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి, సాయుధ బలగాలతో పహారా ఏర్పాటు చేశారు. పరిసరాలను అనుక్షణం పరిశీలించేందుకు సీసీ కెమెరాలను అమర్చి, మానిటర్ల ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద శుక్రవారం సాయంత్రం ఐదు గంటల నుంచి సోమవారం ఉదయం 6.00 గంటల వరకు 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని చెప్పారు. కేంద్రాల్లోకి ఇతరులు వెళ్లకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టారు. ఆయన అన్ని ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అలాగే కౌంటింగ్‌ కేంద్రం వద్ద తాగునీరు, విద్యుత్‌ సరఫరా, కౌంటింగ్‌ టేబుల్స్‌, ఇతర ఏర్పాట్లను నిశితంగా పరిశీలించినట్టు చెప్పారు. ఆయన వెంట అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, రాజేశ్వర్‌, ఎన్నికల అధికారులు, సిబ్బంది ఉన్నారు.

సిబ్బందికి సూచనలిస్తున్న జిల్లా కలెక్టర్‌
1/1

సిబ్బందికి సూచనలిస్తున్న జిల్లా కలెక్టర్‌

Advertisement
Advertisement