సీఎస్‌ఆర్‌ @ 99 | Sakshi
Sakshi News home page

సీఎస్‌ఆర్‌ @ 99

Published Sun, Dec 24 2023 4:26 AM

విద్యుత్‌ అలంకరణలో జిగేల్‌ మంటున్న మెదక్‌ చర్చి   - Sakshi

1924లో చర్చి నిర్మాణం
● ఈనెల 25వ తేదీ నాటికి 98 ఏళ్లు పూర్తి ● ప్రపంచంలోనే రెండో అతిపెద్ద చర్చిగా ఖ్యాతి ● మెతకుసీమలో పనికి ఆహారానికి చిహ్నం ● ఆహ్లాద వాతావరణానికి కేరాఫ్‌ అడ్రస్‌గా గుర్తింపు

చారిత్రక కట్టడానికి పునాది

మెతుకుసీమ ప్రజల దయనీయ పరిస్థితిని చూసి చలించిపోయాడు చార్లెస్‌ వాకర్‌ ఫాస్నెట్‌. ఈ మహనీయుడి బృహత్తర ఆలోచనకు నిలువెత్తు నిదర్శనమే ఈ చారిత్రాత్మక కట్టడం. 1914లో పనికి ఆహారం పథకం పేరుతో ఆకలి చావులతో మెతుకుసీమ అల్లాడుతోంది. వాటిని ఆపడానికి గానూ యుద్ధ ప్రాతిపదికన ప్రజలకు ఉపాధి కల్పించే క్రమంలో భాగంగా ఈ చర్చి నిర్మాణానికి పునాది పడింది. సుమారు 10 ఏళ్లపాటు నిర్విరామంగా చర్చి నిర్మాణం సాగింది. 1924 డిసెంబర్‌ 25న క్రిస్మస్‌ రోజున ప్రారంభించబడింది. దీని నిర్మాణం వ్యయం అప్పట్లో సుమారు రూ.14 లక్షలు ఖర్చు జరిగినట్లు అంచనా.

మెదక్‌ సీఎస్‌ఆర్‌ (చర్చ్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియా) ప్రపంచ ప్రఖ్యాతిని గాంచింది. చార్లెస్‌ వాకర్‌ ఫాస్నెట్‌ దీనిని నిర్మించారు. ఈ చర్చి నిర్మాణ సమయంలో మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా మెదక్‌లో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. పనికి ఆహారం పథకాన్ని ప్రవేశపెట్టి చర్చి నిర్మాణంలో పాలుపంచుకున్న వారికి భోజన ఏర్పాట్లు చేశారు. అలా పదేళ్ల పాటు సాగి 1924 డిసెంబర్‌ 25న పూర్తయింది. ఈ 2023 డిసెంబర్‌ 25న 99వ యేడులోకి అడుగుపెడుతోంది. ఈ క్రిస్మస్‌ పండగకు ముస్తాబు అవుతోంది. ఇది వాటికన్‌ సిటీ తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద చర్చిగా ప్రత్యేక గుర్తింపు పొందింది. దీనిపై కథనం..

మెదక్‌: ప్రపంచ ప్రఖ్యాతి గావించిన మెదక్‌ సీఎస్‌ఐ చర్చి పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నది. ఈ అద్భుత కట్టడాలను కనులారా చూసి తరించాల్సిందే. రోజ్‌వుడ్‌ కలప, స్పెయిన్‌ గ్లాస్‌పై కరుణాయముడి జీవన వృత్తాంతం, అద్భుతమైన రాతికట్టడమే ఈ కోవెల ప్రత్యేకం. ఇలా అన్నీ అద్భుతాలే. ఈ అందాల కోవెలను చూసి తనివితీరాల్సిందే.

ఆకలితీర్చిన ఆలయం

అది మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయం. అగ్రరాజ్యాల ఆధిపత్య పోరులో సమిధలైన జనం అనేకం. అప్పుడు మన దేశంలోనూ దుర్భర పరిస్థితులున్నాయి. పనిలేక బతుకుదెరువు కరువై ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ పక్కటెముకలు కనిపించేలా ఘోర కరువు రక్కసి కోరలకు చిక్కి ప్రజలు విలవిలలాడారు. ఆదుకునే వారు ఎవరైన రాకపోతారా? అని కోటి ఆశలతో ఎదురు చూస్తున్న వేళ.. తమ ముందే ఎంతో మంది ఆకలి చావులతో మరణిస్తుంటే.. ఏడ్చే ఓపిక కూడా లేక ఆపన్న హస్తం కోసం ఆకాశానికేసి చూడటం తప్పితే, మరేమీ తెలియని దయనీయ స్థితిలో ఉన్న తరుణమది.

అపురూపం ఈ సుందర కట్టడం

ఈ చారిత్రక కట్టడానికి సంబంధించిన చర్చి గోపురం ఎత్తు 175 అడుగులు. పొడువు 200 అడుగులు, వెడల్పు 100 అడుగులు. మూడు గవాక్షములు, పలు రంగుటద్దాలతో ప్రతిష్టింపజేశారు. తూర్పున ఏసుక్రీస్తు జన్మ వృత్తాంతం. పడమర క్రీస్తును శిలువేసిన దృశ్యం. ఉత్తరాన ఆయన చనిపోయి 3వ రోజు సజీవుడై ఆరోహనమైన దృశ్యాలు కనిపిస్తాయి. వాటిని సిద్ధం చేసిన చిత్రకారులు ఇంగ్లాండ్‌ దేశానికి చెందిన ఫ్రాంకోఓ, సాలిస్‌బరి. పై మూడు దృశ్యాలు పగలు మాత్రమే కనిపించడం ఒక ప్రత్యేకత. కేవలం సూర్యకాంతితోనే ఈ మూడు దృశ్యాలు కనిపిస్తా యి. వీటికోసం ప్రత్యేకంగా ప్రతి అద్దానికి మధ్యలో తగరాన్ని ఘనస్థితి నుంచి ద్రవస్థితిలోకి తీసుకొచ్చి, గ్లాస్‌కు మధ్యలో అమర్చి ఉంచారు. దీనిని బట్టే తెలుస్తుంది ఈ మహనీయుల కృషి. దేవాలయ పైకప్పు లోపలి భాగం ప్రతిష్టించిన మూడేళ్ల వరకు ప్రతిధ్వనించేదని చెబుతుంటారు. ఈ మహాదేవాలయం ప్రతిధ్వనించకుండా 1927లో గోళాకారంలో ఉన్న లోపలిభాగాన్ని రబ్బర్‌, కాటన్‌, మరికొన్ని రసాయానాలను ఉపయోగించి చర్చి ప్రతిధ్వనించకుండా చేశారు ఇంగ్లాండ్‌ ఇంజీనీర్లు బాడ్‌షా, గ్యాస్‌హోప్‌. ఈ చారిత్రాత్మక కట్టడం ఆసియా ఖండంలోనే విస్తీర్ణంలో పెద్దది. కాగా దేవాలయ వ్యవస్థాపకుడు ఇంగ్లాండ్‌కు చెందిన రన్‌కోన్‌ పట్టణ వాసి రెవరెండ్‌ చార్లెస్‌ వాకర్‌ ఫాస్నెట్‌. చారిత్రక కట్టడాల్లో సుందర కట్టడంగా పేరొందిన మెదక్‌ కెథడ్రల్‌ చర్చి ఎందరో మహానుభావుల అర్కెటిక్‌ పనితనంతో ఇంకా నిత్య నూతనంగా విరాజిల్లుతోంది. ప్రత్యేకంగా క్రిస్మస్‌ పండగ సందర్భంగా చేసే అలంకరణతో దేదీప్యమానంగా వెలిగిపోనుంది.

Advertisement
Advertisement