Actor Mahesh Babu Birthday Special Story: Interesting And Rare Unknown Facts In Telugu - Sakshi
Sakshi News home page

Mahesh Babu Birthday Story: మహేశ్ పుట్టినరోజు.. పలు ఇంట్రెస్టింగ్ విషయాలు!

Published Wed, Aug 9 2023 8:34 AM

Actor Mahesh Babu Birthday Special Interesting Details - Sakshi

'పోకిరి'తో ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాసి.. 'భరత్ అనే నేను' మూవీతో నాన్ బాహుబలి రికార్డులు సృష్టించి.. 'సర్కారు వారి పాట'తో ఓపెనింగ్స్‌లో సరికొత్త చరిత్ర సృష్టించి.. తరతరాల నిశీధి దాటే చిరువేకువ జాడతడు. పెను తుపాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడు. అతడే ప్రిన్స్‌ మహేశ్‌ బాబు. ఈరోజు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన గురించి చాలామందికి తెలియని విషయాలే ఈ స్టోరీ.

తెలియకుండానే సినిమాల్లోకి
మహేశ్.. 1975 ఆగస్టు 9న మద్రాసులో జన్మించాడు. ఇతడు పుట్టే నాటికే తండ్రి కృష్ణ 100 సినిమాలకు పైగా పూర్తి చేసి, ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్ హీరోగా కొనసాగుతున్నారు. ఆరేళ్ల వయసులో మహేశ్‌ తన అన్నయ్య అయిన రమేశ్‌తో కలిసి విజయవాడ వెళ్లారు. అప్పట్లో దాసరి దర్శకత్వంలో 'నీడ' సినిమా రమేశ్‌ చేస్తున్నారు. అందులో ఓ కీలక పాత్రని మహేశ్‌కి తెలియకుండానే ఆయనపై తీశారు దాసరి. అలా బాల నటుడిగా మహేశ్‌ తెరంగేట్రం ఆయనకు తెలియకుండానే జరిగిపోయింది. తర్వాత నాన్న కృష్ణతో 'పోరాటం' సినిమాలో మహేశ్‌ నటించి, మెప్పించారు.

(ఇదీ చదవండి: 'గుంటూరు కారం' కొత్త పోస్టర్.. ఫ్యాన్స్ డిసప్పాయింట్!?)

చదువుకు బ్రేక్‌
స్కూల్‌ హాలీడేస్‌ రాగానే షూటింగ్స్‌లో మహేశ్‌ పాల్గొనేవాడు. అలా బజార్‌ రౌడీ, ముగ్గురు కొడుకులు, గూఢచారి 117, కొడుకు దిద్దిన కాపురం  సినిమాలు చేశాడు. తర్వాత మహేశ్‌ స్కూల్‌కు వెళ్లడం తగ్గించాడు. సినిమాల వల్ల కొడుకు చదువు ఎక్కడ పాడైపోతుందో అనే భయంతో ఇకపై సినిమాలు వద్దని, బుద్ధిగా చదువుకోవాలని ప్రిన్స్‌కు కృష్ణ చెప్పడంతో మళ్లీ చదువుపై ఫోకస్ పెట్టాడు. పదో తరగతిలో అనుకునన్ని మార్కులు రాకపోవటంతో తనకెంతో ఇష్టమైన లయోలా కాలేజీలో ఇంటర్ చదివేందుకు అడ్మిషన్ రాలేదు. 

కనీసం డిగ్రీలో అయినా అక్కడ సీటు సంపాదించాలని ఇంటర్‌లో కష్టపడి చదివి ఆపై  మంచి మార్కులు సాధించి అనుకున్నట్లే లయోలా డిగ్రీ కాలేజీలో  బీకామ్‌ సీటు సాధించాడు. అక్కడ చదువుతున్న టైంలో మళ్లీ సినిమాలవైపు మనసు లాగింది. ఇంకేముంది ఇదే విషయాన్ని తన తండ్రితో చెప్పడం. దానికి కృష్ణ ఓకే అనడం జరిగిపోయాయి. అప్పుడు దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాత అశ్వినీదత్‌.. 'రాజకుమారుడు' సినిమాతో మహేశ్‌ను హీరోగా పరిచయం చేశారు.

వాటికి మాత్రం నో 
తెలుగులో ఇప్పటివరకూ ఒక్క రీమేక్‌ సినిమాలో నటించని హీరో మహేశ్‌. బాలీవుడ్‌ నుంచి ఎన్ని ఆఫర్లు ఇచ్చినా 'తెలుగు' చిత్రాల్లోనే నటిస్తానని వాటిని తిరస్కరిస్తూ వచ్చారు. మహేశ్‌లో నిర్మాత కూడా ఉన్నాడు. అడివి శేష్‌ తో 'మేజర్‌' సినిమా తీసి, హిట్‌ కొట్టాడు. మహేశ్‌కు చాలా ఇష్టమైన దర్శకుడు మణిరత్నం. గతంలో ఓసారి ఇదే చెప్పారు. ఆయనతో ఒక సినిమా చేయాలనే కోరిక ఉందని అన్నాడు. ఈ ఇద్దరి కాంబోలో సినిమా వస్తే బాగుంటుందని ఫ్యాన్స్‌ కూడా ఆశపడుతున్నారు.

(ఇదీ చదవండి: మహేశ్‌ - నమ్రత లవ్ మ్యారేజ్.. మొదట ప్రపోజ్‌ చేసింది ఎవరంటే..!)
 
తండ్రిని మించినోడు
కొన్ని విషయాల్లో తండ్రి సూపర్‌ స్టార్‌ కృష్ణను అనుసరించిన మహేశ్, మరికొన్ని చోట్ల తండ్రిని మించిన కొడుకు అనిపించుకున్నాడు. కృష్ణ కెరీర్‌లో 350కి పైగా సినిమాల్లో నటించినా ఉత్తమ నటునిగా ఒక్క నంది అవార్డు రాలేదు. మహేశ్‌ మాత్రం కేవలం 27 సినిమాలకే 8 నంది అవార్డులు అందుకున్నాడు. 'రాజకుమారుడు'తో తొలిసారి ఉత్తమ నటునిగా నందిని అందుకున్న మహేశ్.. నిజం, అతడు, దూకుడు, శ్రీమంతుడు, మురారి, టక్కరి దొంగ, అర్జున్ చిత్రాల ద్వారా కూడా నంది అవార్డుకు ఎంపికయ్యారు. 

కృష్ణ నట జీవితంలో మొత్తం 350పైగా చిత్రాల్లో కేవలం రెండు జూబ్లీస్ ఉన్నాయి. అవి పండంటి కాపురం, అల్లూరి సీతారామరాజు. ఈ రెండు చిత్రాలు కూడా కృష్ణ సొంత చిత్రాలు కావడం విశేషం. మహేశ్ కెరీర్‌లో నాలుగు చిత్రాలు డైరెక్ట్‌గా నాలుగు ఆటలతో సిల్వర్ జూబ్లీ జరుపుకున్నాయి. అవి మురారి, ఒక్కడు, అతడు, పోకిరి సినిమాలు. ఈ నాలుగు చిత్రాలు హైదరాబాద్ లోని సుదర్శన్ 35MMలో సిల్వర్ జూబ్లీ జరుపుకొని ఓ చెరిగిపోని రికార్డును మహేశ్ సొంతం చేశాయి. ఆ తరువాత కూడా మహేశ్‌కు దూకుడు, శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు, సర్కారువారిపాట వంటి సూపర్ హిట్స్ దక్కాయి. 

తొలిసారిగా కొన్న ఫోన్‌
మహేశ్‌కు ఎలక్ట్రికల్‌ గాడ్జెట్స్‌ అంటే చాలా ఇష్టమట. కానీ సోషల్‌ మీడియాకు ఆయన దూరంగానే ఉంటారు.  తొలిసారిగా ఆయన ఎంతో ఇష్టంగా నోకియా క్లాసికల్‌ మోడల్‌ (కీ ప్యాడ్‌) కొన్నారు. ఇప్పటికీ ఆయన తరచూ ఫోన్లను మారుస్తూ ఉంటారు. ముఖ్యంగా తన తండ్రి కృష్ణతో మాత్రమే సెల్ఫీ దిగేందుకు ప్రిన్స్‌ ఇష్టపడతారు. స్వతహాగా దాతృత్వం చాటుకోవడంలో మహేశ్‌ 'శ్రీమంతుడు'.  తండ్రిపై ప్రేమతో  కృష్ణ సొంతూరు ఆంధ్రప్రదేశ్‌లోని బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. తెలంగాణలో కూడా సిద్ధాపురం గ్రామాన్ని కూడా ఆయన దత్తత తీసుకున్నారు. ఆ రెండు గ్రామాల్ని ఆయన భారీగా అభివృద్ధి చేశారు. అలాంటి మహేశ్‌బాబు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ 'హ్యాపీబర్త్‌డే ప్రిన్స్‌ మహేశ్‌'..!

(ఇదీ చదవండి: సౌత్‌ నుంచి ఒకేఒక్కడు.. ఏ హీరో టచ్‌ చేయలేని రికార్డ్‌ మహేష్‌ సొంతం)

Advertisement
Advertisement