Actor Prashanth: Bio Graphy, Film Career and Family - Sakshi
Sakshi News home page

జీన్స్‌,జోడీ చిత్రాలతో మెప్పించిన ప్రశాంత్‌ లైఫ్‌లో ఎవరూ ఊహించని ఘటన

Published Sun, Aug 13 2023 4:26 PM

Actor Prashanth Career Drop Reason His Wife - Sakshi

ఒకప్పుడు సౌత్‌ ఇండియా స్టార్‌ నటుడిగా ప్రశాంత్‌ గుర్తింపు పొందాడు. ఎక్కువగా తమిళ సినిమాల్లోనే నటించినా  తెలుగు, మలయాళ, హిందీ సినిమాల్లో కూడా మెప్పించాడు. ప్రశాంత్ ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు అయిన త్యాగరాజన్ కుమారుడు. 17 సంవత్సరాల వయసులోనే ప్రశాంత్ 'వైగాసి పోరంతచ్చు' అనే తమిళ సినిమాతో నటుడిగా తన కెరీర్‌ను ప్రారంభించాడు. తమిళంలో ఒకప్పుడు అగ్ర కథానాయకుడిగా ఓ వెలుగు వెలిగిన స్టార్‌ ప్రశాంత్‌. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన జీన్స్ సినిమా ఆయన కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

అజిత్, విజయ్ తదితరులు కెరీర్‌లో గుర్తింపు పొందుతున్న సమయంలో ప్రశాంత్‌కు వారికి మించిన గుర్తింపు ఉండేది. సినీ కెరియర్‌ భారీ విజయాలతో దూసుకుపోతున్న సమయంలో తన భార్యతో వివాదాలు. ఆపై  పదే పదే సినిమా పరాజయాలతో స్టార్ డమ్ కోల్పోయాడు. విడాకుల సమయంలో వచ్చిన వివాదాల వల్ల ప్రశాంత్ కెరీర్ పాతాళానికి పడిపోయింది. తెలుగులో వినయ విధేయ రామ చిత్రంలో రామ్‌ చరణ్‌కు అన్నగా, కలెక్టర్‌ పాత్రలో ప్రశాంత్‌ కనిపించాడు.

తాజాగ తమిళ ప్రముఖ రాజకీయ, సినీ విశ్లేషకుడు కాంతరాజ్ ప్రశాంత్ గురించి పలు విషయాలు వెల్లడించారు. 'సినీ ఇండస్ట్రీలో ప్రతి పదేళ్లకు ఒకసారి మార్పులు వస్తూనే ఉంటాయి. కొంతమంది నటీనటులు మాత్రమే కాలంతో ముందుకు సాగగలుగుతున్నారు. నటనలో ప్రశాంత్‌కు ప్రత్యేకంగా చేయాల్సిన పనిలేదు. ప్రశాంత్‌ తన తండ్రి త్యాగరాజ్ డైరెక్షన్‌లో 'అంధాగన్‌' సినిమా తీస్తున్నారు. ఇంతటితో ఆయన సినిమాలు చేయకపోవడమే మంచిది.

(ఇదీ చదవండి: చిరు కొత్త సినిమా ప్రకటన.. సూపర్‌ హిట్‌ డైరెక్టర్‌కు ఛాన్స్‌)

అతను వేరే ఉద్యోగం చూసుకోవడం మంచిది. నేడు సినిమాలు మారిపోయాయి. అతనిలో గతంలో ఉన్న హీరోయిజం లేదు. ఇప్పుడు సినిమా బాగుంటేనే చూస్తారు. అంతేకాకుండా ప్రశాంత్ వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు వచ్చాయి. అది ప్రశాంత్‌ సినీ కెరీర్‌పై భారీ ప్రభావం చూపాయి.  వాటి తర్వాత ప్రశాంత్ సినిమాల నుంచి తప్పుకున్నాడు.' అని కాంతరాజ్ పేర్కొన్నాడు.

భార్యతో గొడవలు
ప్రశాంత్‌కి 2005లో వ్యాపారవేత్త కుమార్తె గృహలక్ష్మితో పెళ్లయింది. వారిద్దరికి ఒక కుమారుడు కూడా జన్మించాడు. అయితే కొద్దిరోజుల్లోనే వారిద్దరి మధ్య సమస్యలు తలెత్తాయి. పెళ్లయిన మూడేళ్ల తర్వాత ఇద్దరూ విడిపోయారు. వీరిద్దరి మధ్య పెద్ద గొడవలు జరిగినట్లు సమాచారం. తర్వాత గృహలక్ష్మి తన పుట్టింటికి వెళ్లి బిడ్డకు జన్మనిచ్చింది. పాపను చూసేందుకు వారి ఇంటికి వెళ్లినా ప్రశాంత్‌ను అనుమతించలేదు. తన భార్యను తిరిగి పొందేందుకు ఆయన కోర్టును ఆశ్రయించాడు. అలా వారిద్దరి మధ్య అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. అయితే ఇంతలోనే మరో అనుకోని సంఘటన జరిగింది.

ప్రశాంత్‌ జీవితంలో ఊహించని ఘటన
నారాయణన్ అనే వ్యక్తి వారి గొడవలోకి ఎంట్రీ ఇచ్చాడు.  ప్రశాంత్ కంటే ముందే గృహలక్ష్మిని పెళ్లి చేసుకున్నానని రంగంలోకి దిగాడు. గృహలక్ష్మి తనను 1998లోనే పెళ్లాడిందన్నది అతని వాదన. దీంతో విడాకుల కోసం హీరో ప్రశాంత్ దరఖాస్తు చేసుకున్నాడు. కొద్దిరోజుల తర్వాత కోర్టు విడాకులు మంజూరు చేసిందని సమాచారం. తన కూతురుని తన దగ్గర వదిలేయాలని ప్రశాంత్ కోరగా కోర్టు అంగీకరించలేదు. విడాకుల సమయంలో వచ్చిన ఆరోపణలు, ప్రత్యారోపణలు ప్రశాంత్ ఇమేజ్‌ను భారీగా దెబ్బతీశాయి. ఇలా వెండితెర లైమ్‌లైట్‌లో కనిపించకుండా పోయాడు. ఆయనతో పాటు వచ్చిన అజిత్, విజయ్ లాంటి స్టార్లందరూ సూపర్ స్టార్ స్థాయికి ఎదిగారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement