Ankusam Rami Reddy Turned Actor Unrecognisable in His Last Days - Sakshi
Sakshi News home page

Ankusam Rami Reddy: చిత్తూరు నుంచి బాలీవుడ్‌నే ఏలిన నటుడు రామిరెడ్డి.. చివరి రోజుల్లో ఎలా మరణించారంటే

Published Thu, Jul 27 2023 8:16 PM

Ankusam Rami Reddy Turned Actor Unrecognisable In His Last Days - Sakshi

అంకుశం రామిరెడ్డి 1990 కాలం నాటి సినిమాలతో పరిచయం ఉన్న వారికి ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతని పూర్తి పేరు గంగసాని రామిరెడ్డి, చిత్తూరు జిల్లాకు  చెందిన వాయల్పాడు నుంచి సినీ పరిశ్రమపై ఎలాంటి అవగాహన లేకుండానే ఆయన ప్రస్థానం మొదలైంది. తెలుగులో అంకుశం చిత్రం ద్వారా నట జీవితాన్ని ప్రారంభించిన ఆయన తన పేరును అంకుశం రామిరెడ్డిగా మార్చుకున్నారు.

అతని విలనిజం ఏ రేంజ్‌లో ఉంటుందంటే ‘అంకుశం’ సినిమా చూస్తే చాలు చెబుతుంది. ఆ సినిమాలో స్పాట్‌ పెడుతా అనే ఒకే ఒక  డైలాగ్‌తో ప్రేక్షకుల మదిలో భయాన్ని నింపాడు. అంత భయానకమైన ఆన్ స్క్రీన్ వ్యక్తి రామి రెడ్డి. భారత దేశంలోని అన్ని భాషల్లో ఆయన నటించారు. బాలీవుడ్‌లో అమ్రిష్ పూరి, అమ్జాద్ ఖాన్, డానీ డెంజోంగ్పా, గుల్షన్ గ్రోవర్, ప్రేమ్ చోప్రా లాంటి విలన్‌లకు ఏ మాత్రం తీసిపోడు. అలాంటి అరుదైన నటుడి జీవితం సగంలోనే ముగిసిపోయింది. ఆయన  చివరి రోజుల్లో అనుభవించిన అనారోగ్య సమస్యలు మరింత బాధాకరం.

రామి రెడ్డి తొలిరోజులు
జనవరి 1, 1959న జన్మించిన రామిరెడ్డి. తన కెరియర్‌ ప్రారంభంలో  సినిమా వైపు మొగ్గు చూపలేదు. అతను జర్నలిస్ట్ కావాలనుకున్నాడు. అందుకే హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో మాస్ మీడియా (జర్నలిజం)లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. గ్రాడ్యుయేషన్ పూర్తయిన వెంటనే ఆయన ఒక వార్తాపత్రికలో జర్నలిస్ట్‌గా పనిచేయడం ప్రారంభించారు. అందులో ఆయన  సినీ ప్రముఖుల ఇంటర్వ్యూలను తీసుకునేవారు. అలా అతని జీవితం కొనసాగింది.

సినిమాల్లో రామిరెడ్డికి బిగ్ బ్రేక్
ఒకరోజు ప్రముఖ తెలుగు దర్శకుడు కోడి రామకృష్ణ ఇంటర్వ్యూ తీసుకోవడానికి రామిరెడ్డి వెళ్లారు. ఆ సమయంలో రామి రెడ్డి టాలెంట్‌ను చూసిన ఆయన ముగ్ధుడయ్యాడు. తనలో సినిమాకు కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయిని గుర్తించి తన రాబోయే చిత్రంలో రామి రెడ్డికి విలన్‌ పాత్ర అందించాడు. అందుకు రామి రెడ్డి కూడా అంగీకరించారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమానే 1990లో వచ్చిన అంకుశం. ఆ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అదే ఆయన  కెరీర్‌ని మలుపు తిప్పింది. ఇదే అంకుశం సినిమాను హిందీలో ప్రతిబంధ్‌ పేరుతో మెగాస్టార్‌ చిరంజీవి రీమేక్‌ చేశారు. ఇందులో  కూడా అతను తన పాత్రను తిరిగి పోషించాడు. అక్కడ కూడా  ప్రతిబంద్ సూపర్‌ హిట్‌ అయింది. ఈ సినిమాతో చిరు కంటే రామి రెడ్డి నటనకు బాలీవుడ్‌ ఫిదా అయింది. దీంతో అక్కడ ఆయనకు భారీగానే అవకాశాలు వచ్చాయి.

రామి రెడ్డి- 90లలో బాలీవుడ్‌కి ఇష్టమైన విలన్ 
ప్రతిబంధ్ తర్వాత, రామి రెడ్డి వివిధ భాషలలో పనిచేశాడు. కానీ అతను బాలీవుడ్‌లో కూడా తన పాపులారిటీని కొనసాగించాడు. గుండా (1998), ఖుద్దార్ (1994), శపత్ (1997), వక్త్ హుమారా హై (1994) వంటి చిత్రాలలో అతని నటనకు హీంది ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి-నటించిన వక్త్ హుమారా హైలోని కల్నల్ చికారా పాత్ర కల్ట్ హోదాను పొందింది. రామి రెడ్డి తన కెరీర్‌లో పలు భాషల్లో 250కి పైగా సినిమాలు చేశారు. 90వ దశకంలో, రామి రెడ్డి బాలీవుడ్‌లో పాపులర్ ఫేస్‌గా మారారు. అతని ఆకట్టుకునే ఫిల్మోగ్రఫీలో ఆందోళన్ (1995), దిల్‌వాలే (1994), అంగ్రాక్షక్ (1995), ఎలాన్ (1994) వంటి ప్రముఖ చలనచిత్రాలు ఉన్నాయి.

రామి రెడ్డి ఎలా చనిపోయారంటే
తన చివరి శ్వాస వరకు ప్రేక్షకులను అలరించాలని రామిరెడ్డి ఆకాంక్షించారు. కానీ దురదృష్టవశాత్తు, 2010లో రామి రెడ్డి ఆరోగ్యం క్షీణించడం ప్రారంభించింది. అతను కాలేయ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడని డాక్టర్లు గుర్తించి అతనికి తెలిపారు. క్యాన్సర్‌ ప్రభావం మూత్రపిండాలపై చూపడంతో మరింత ఇబ్బందులకు గురయ్యాడు. రోజురోజుకు  అతని ఆరోగ్యం మరింత దిగజారింది.  అతని చివరి రోజుల్లో అతను గుర్తుపట్టలేనంతగా మారిపోయారు.  ధైర్యంగా తన సంకల్ప శక్తితో క్యాన్సర్‌తో పోరాడారు. కానీ ఫలితం లేకుండా పోయింది.  ఏప్రిల్ 14, 2011 న హైదరాబాద్‌లో రామి రెడ్డి (52) మరణించారు.

మరోక భాదకరమైన విషయం ఏమిటంటే కొద్దిరోజుల్లో చనిపోతున్నావని డాక్టర్ల నుంచి ముందే ఆయనకు సమాచారం అందింది. దాంతో అయన మరింత కుంగిపోయాడు. ఒకవైపు భార్య,పిల్లలు ఏమవుతారనే ఆలోచనతో నిత్యం నరకం అనుభవించారని ఆయన సన్నిహితులు ఇప్పటికి కూడా చెబుతుంటారు. అతనికి భార్యతో పాటు, ఒక కుమారుడు,ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రస్తుతం ఆయన కుమారుడు రామిరెడ్డి అనే పేరుతో ఒక స్వీట్‌ షాప్‌ నిర్వహిస్తూ జీవనం కొనసాగిస్తున్నారని సమచారం.

Advertisement
Advertisement