ఆ కోరిక తీరకముందే కన్ను మూసిన ఆత్రేయ!

7 May, 2021 09:18 IST|Sakshi

సినీ కవి ఆత్రేయ శత జయంతి ప్రత్యేకం

తెలుగునేలలో ఆత్రేయ పేరు తెలియని పద్యం, నాటకం, సినిమా రచన ఉండవు. ఈ మూడు ప్రక్రియలలోనూ ఆత్రేయ కలం కదం తొక్కినా ఆయన సినీ కవిగానే ఎక్కువమందికి తెలుసు. ఆత్రేయ అసలు పేరు కిళాంబి వేంకట నరసింహాచార్యులు. పేరులోని ఆచార్యను, గోత్రనామమైన ఆత్రేయ సను కలుపుకొని ‘ఆచార్య ఆత్రేయ’ కలం పేరుతో ఆయన సుప్రసిద్ధులయ్యారు.

7.5.1921న నెల్లూరు జిల్లా, సూళ్లూరుపేట తాలూకాలోని మంగళంపాడులో ఆయన జన్మించారు. 1951లో సినీరంగ ప్రవేశం చేసిన ఆత్రేయ రచయితగా కొంతకాలం సినీరంగాన్ని ఏలారు. తన రాతతో ప్రేక్షకులను, రాయక నిర్మాతలను ఏడిపిస్తారని పేరుపడ్డారు. అంతటి ఆత్రేయ ఎన్ని సినిమాలకు ఎన్ని పాటలు రాశారో చివరి వరకూ ఎప్పుడూ లెక్కవేసుకోలేదు.

కానీ 69 ఏళ్ల వయస్సులో (1989) ఆకస్మికంగా ఆయనకో కోరిక కలిగింది. ‘నా పాట నీ నోట పలకాలి’ అనే మకుటంతో అసంఖ్యాకమైన తన సినిమా పాటల్లో కొన్నింటిని పుస్తక రూపంలో వెలువరించాలని. ఆ మనోవాంఛను మద్రాసు విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ పట్టా కోసం పరిశోధన చెయ్యడానికి వెళ్లిన నా దగ్గర ఆత్రేయ వెలిబుచ్చారు. పుస్తక ప్రచురణకు ఆర్థికంగా తోడ్పడటానికి ముందుకొచ్చే తన నిర్మాతలు ఇద్దరు ముగ్గురున్నా, వాళ్లు తనను నమ్మడం లేదని వాపోయారు. ఆ సందర్భంగా చిత్రసీమకు సంబం ధించిన ఆయన ఆత్మీయ మిత్రులలో ఆ కోరికను నెరవేర్చడానికి సమర్థులుగా డాక్టర్‌ కొంగర జగ్గయ్య పేరును నేను సూచించాను. ఆ సూచనను ఆత్రేయ కూడా ఆమోదిం చడంతో వెంటనే అన్నానగర్‌లో ఉంటున్న జగ్గయ్య గారిం టికి వెళ్లాం.

ఆత్రేయ సినిమా పాటలలో కొన్నింటిని మాత్రమే కాదు– అంతవరకు ఆ ప్రక్రియలో వచ్చిన అన్నింటినీ అచ్చు వేద్దామని జగ్గయ్యగారు ప్రతిపాదించి పాటలు సేకరణ బాధ్యతను మాత్రం నామీద పెట్టారు. తను ఆశించిన దాని కంటే విస్తృత స్థాయిలో తన కోరిక నెరవేరుతున్నందుకు బ్రహ్మానందభరితులైన ఆత్రేయ ఆ ప్రతిపాదన వెంటనే కార్యరూపం ధరించాలని, అందుకు నెల్లాళ్ల వ్యవధిలో తిరిగి కలుద్దామని జగ్గయ్యగారిని కోరారు. కానీ దురదృష్టవశాత్తు అలా కలవాలనుకున్న రోజునే అకస్మాత్తుగా ఆత్రేయ తనువు చాలించారు (13.9.89). ఆత్రేయ సంస్మరణ సభలో జగ్గయ్య ఆత్రేయ కడపటి కోరికను వెల్లడించి, ఆయన సమగ్ర రచనల ముద్రణ కోసం ముందుకు రావాలని పరిశ్రమలోని పెద్దలకు పిలుపునిచ్చారు. ఆ సూచనకు పరిశ్రమ నుండి సానుకూలమైన స్పందన లభించింది.

జగ్గయ్య జాప్యం చేయకుండా కార్యరంగంలోకి దూకి తను మేనేజింగ్‌ ట్రస్టీగా మరో 8 మంది ప్రముఖులు ట్రస్టీలుగా ‘మనస్విని’ పేరుతో ఒక పబ్లిక్‌ చారిటబుల్‌ ట్రస్టీని నెలకొల్పారు. దాని తరఫున ఆత్రేయ లభ్య సమగ్ర సాహి త్యాన్ని 7 సంపుటాలుగా ప్రచురించారు. ఆత్రేయ సాహితికి జగ్గయ్య సంపాదకులు కాగా, నేను సహ సంపాదకుణ్ని. ఆత్రేయ సాహితిలో మూడు సంపుటాలు నాటక సాహి త్యానికి, మూడు సంపుటాలు సినిమా పాటలకు, ఏడవ సంపుటి ఆత్మకథ మొదలైన ఇతర రచనలకు కేటాయించాం. ఆత్రేయ సాహితి ఆవిష్కరణ 7.5.1990న మద్రాసులోని దక్షిణ భారత చలనచిత్ర సంఘం థియేటర్‌లో ఘనంగా జరి గింది. ఆత్రేయ సాహితికి పాఠకలోకం నుంచి అనూహ్యమైన ఆదరణ లభించింది.

ఆత్రేయ సాహితి ప్రతులు స్వల్పకాలంలోనే చెల్లిపోవడంతో ఆత్రేయ అభిమానులు పునర్ముద్రణ కోసం అడుగుతూనే ఉన్నారు. ప్రథమ ముద్రణలో మాకు కూడా కొన్ని లోటుపాట్లు కనిపించి ఆ దిశగా ప్రయత్నం చెయ్యాలను కున్నా, జగ్గయ్యగారి హఠాన్మరణం (5.3.2004)తో మన స్విని మూలబడి ఆత్రేయ సాహితి తిరిగి వెలుగుచూడ్డం సాధ్యం కాలేదు. కానీ అనుకోకుండా 25.2.2017న నేను అతిథిగా హాజరయిన ‘పాడుతా తీయగా’ రికార్డింగ్‌ కార్యక్రమంలో మాన్య మిత్రులు డాక్టర్‌ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆత్రేయ సాహితి పునర్ముద్రణ ప్రసక్తి తెచ్చి, ఆ అక్కరను, దాని ఆసరాకు తన సంసిద్ధతను వ్యక్తం చేశారు. ఆ మనస్వి ప్రతిపాదన నాకు ఆనందం కలిగించినా, ఆ అంశం మీద చర్చించి నాటక సాహిత్యానికి అంతగా ఆదరణ లేకపోవడం వల్ల పరిష్కృత ముద్రణను పాటలకు మాత్రం పరిమితం చెయ్యాలని నిర్ణయించాం.

ఈ బృహత్కార్యంలో తన ఆత్మీయ మిత్రులు, సాహితీ ప్రియులు అయిన డా. కె. ఇ. వరప్రసాద్‌ రెడ్డి (శాంతా బయోటెక్నిక్స్‌ అధినేత) భాగస్వామిని చెయ్యాలని ఎస్బీబీ సంకల్పించారు. రెడ్డిగారు సంతోషంగా అంగీకరించారు. కానీ, ఆ గాన గంధర్వుని పూనిక సాకారం కాకుండానే ఆ దుర్విధి ఆయనను మనకు దూరం చేసింది. అనంతరం బాలు వాగ్దానానికి భంగం కలుగకుండా ఆ ప్రాణమిత్రుడు తలపెట్టిన యజ్ఞాన్ని పూర్తి చేయడానికి డా. వరప్రసాద్‌ రెడ్డి సహృదయతతో ముందుకొచ్చారు.

ఆత్రేయ సాహితి (1990)లోని మూడు సినిమా సంపుటాలతో కలిపి అప్పట్లో వివిధ కారణాలవల్ల 1092 పాటల్ని మాత్రమే ప్రచురింపగలిగాం. ఇప్పుడు ఆ లోటును సరిదిద్దు కోవడానికి అవకాశం రావడంతో ఆత్రేయ అక్షర సేద్యానికి, బాలు పవిత్ర సంకల్పానికి న్యాయం చేయాలనే దృఢ సంకల్పంతో ఆత్రేయ సాహితి పేరుతో ఆత్రేయ సినీ గేయ సర్వస్వాన్ని విస్తృత పరిశోధనతో రెండు భాగాలుగా (ఒకే సెట్‌) అందిస్తున్నాం. డబ్బింగ్‌ చిత్రాలతో సహా 477 చిత్రాల నుంచి ఆత్రేయ మొత్తం పాటల్ని (1636) సేకరించి ప్రచురి స్తున్న ఈ సంపుటాలలో ఆత్రేయ పాట ఒక్కటి కూడా మిగలకుండా, ఆత్రేయది కాని పాట ఒక్కటీ చొరబడకుండా మా పరిధి మేరకు ప్రయత్నించాం. ఆత్రేయ అభిమానులు, సహృదయ విమర్శకులు మా శ్రమను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను.

‘అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని’ అని ఆత్రేయే అన్నట్టు ఆత్రేయ సాహితి ఇంత సమగ్రంగా ఈ స్థాయిలో వెలువడ్డం ఆత్రేయ అనుకోనిది, అనుకోని ‘నిధి’. ఆత్రేయ సాహితి ఆవిష్కరణ సందర్భంగా ఆత్రేయ, బాలుగార్లకు అంజలి ఘటిస్తున్నాను.
– డాక్టర్‌ పైడిపాల, వ్యాసకర్త సినీ గేయ సాహిత్య విమర్శకులు, ‘ఆత్రేయ సాహితి’ సంపాదకులు 
మొబైల్‌ : 99891 06162

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు