రంగంలోకి ‘ఆర్జీవీ’, వణికిపోయిన హౌస్‌మేట్స్‌

26 Nov, 2020 23:24 IST|Sakshi

నిన్నటి ఎపిసోడ్‌లో దెయ్యం మాటల్ని లెక్క చేయలేదు ఇంటి సభ్యులు. పైగా దెయ్యంపైనే జోకులు వేస్తూ పగలబడి నవ్వారు. దీంతో ఎలాగైనా ఈ రోజు ఇంటి సభ్యులను భయపెట్టాలని ఫిక్స్‌ అయింది దెయ్యం జలజ.  కంటెస్టెంట్స్‌ని భయపెట్టడం తన వల్ల కావడంలేదని చివరికి తన గురువు ఆర్జీవీ సహాయం తీసుకుంది. అసలు దెయ్యానికి ఆర్జీవీ ఎలా సహాయం చేశాడు. అసలు బిగ్‌బాస్‌కి ఆర్జీవీ సంబంధం ఏంటి?  దెయ్యం చేసిన ప్రయత్నం ఏమేరకు సఫలమైందో చదివేద్దాం.

బుధవారం ఎపిసోడ్‌లో అభిజిత్‌ ఎమోషనల్‌ గురించి హారికతో మోనాల్‌ చర్చించింది. అతను ప్రతిసారి ఫ్రెండ్‌ కాదని ముఖం మీదే చెప్పేస్తాడని, ఈ రోజు కూడా అలానే అన్నాడని హారికతో చెప్పింది. జోక్‌ చేస్తే చాలు నువ్వు నా  ఫ్రెండ్‌ కాదు.. జోకులు వేయకు అంటాడు. బిగ్‌బాస్‌లో ఉన్నంత వరకు కలిసి ఉండాలి. బయటకు వెళ్లాక ఆయన ఇష్టం. కలిస్తే కలవని లేదంటే లేదు. కానీ ప్రతిసారి ఫ్రెండ్‌ కాదని స్టేట్‌మెంట్‌ ఇవ్వడం నాకు బాధ కలిగింది’ అని మోనాల్‌ చక్కగా వివరించింది. ఇక దెయ్యం జలజ ఇచ్చిన టాస్క్‌ ప్రకారం.. పాట రాగానే సోహైల్‌ షర్ట్‌ విప్పి డాన్స్‌ చేశాడు.
 
స్మశానంలో అవినాష్‌ జాగారం
ఇక దెయ్యం టాస్క్‌లో భాగంగా హౌస్‌లో ఉన్న జలజ దెయ్యం ఇంట్లో ఉన్న ప్లేట్స్ మొత్తం దాచేసింది. అరటిఆకులు మాత్రమే ఇచ్చింది. ఇక ఇంటి సభ్యుల్ని మరింత ఇబ్బంది పెట్టడంలో భాగంగా కష్టమైన టాస్కులు ఇచ్చింది. ఇంట్లో ఏ క్షణమైనా లైట్స్‌ ఆఫ్‌ చేస్తానని.. ఆ టైమ్‌లో ఇంటి సభ్యులంతా చప్పట్లు కొడుతూ నవ్వాలని చెప్పింది. ఆ తర్వాత ఇంటి సభ్యుల్లో ఒకర్ని ఎంచుకుని ఆ వ్యక్తి లాంతరు పట్టుకుని గార్డెన్ ఏరియాలో రాత్రి అంతా ఒంటరిగా నవ్వుతూ కూర్చోవాలని టాస్క్ ఇచ్చారు. ఇక ఇంటి సభ్యులంతా అవినాష్‌ని ఎంచుకొని శ్మశానానికి(గార్డెన్‌ ఏరియా) పంపారు. ఇక అక్కడ అవినాష్‌ తనదైన శైలీలో దెయ్యంపై పంచ్‌ల వర్షం కురిపించాడు. లాంతరు పట్టుకొని కెమెరా ముందుకు వచ్చి.. జలజా ఏం చేస్తున్నావ్.. రాత్రంతా నన్ను ఇక్కడే ఉండమన్నావ్.. నువ్వేం చేస్తున్నావ్ పడుకున్నావా జలజా అంటూ దెయ్యం మీదే జోకులు వేశాడు. ఇక అవినాష్‌తో పాటు ఇంటి సభ్యులను కూడా నిద్ర పోకుండా చేసింది జలజ. ఉదయం 5 గంటలకు కూడా ఇంటి సభ్యులను లేపి చప్పట్లు కొట్టేలా చేసింది.

అఖిల్‌ ఎమోషనల్‌
ఈవారం నామినేషన్స్‌లో ఉన్న అఖిల్ ఒంటరిగా కూర్చొని ఏడ్చాడు. అవినాష్‌, అరియానా వెళ్లి ఓదార్చారు. ఆ తర్వాత సోహైల్‌ కూడా వచ్చి అఖిల్‌ని కూల్‌ చేశాడు. అంతకు ముందు అఖిల్‌, మోనాల్‌ మనసు విప్పి మాట్లాడుకున్నారు. గేమ్‌ గేమ్‌లా ఆడుదామని మోనాల్‌ చెప్పగా.. నువ్వు ఎప్పటి నుంచో అదేగా చేస్తున్నావ్‌ అని అఖిల్‌ కౌంటర్‌ ఇచ్చాడు. ఇక అఖిల్‌ దగ్గర ప్రామిస్‌ తీసుకొని సోహైల్‌ గురించి కొన్ని విషయాలు బయటపెట్టింది. తాను చాలా తెలివిగా గేమ్‌ ఆడుతున్నాడని,  ఎవరితో ఎలా మాట్లాడితే మంచి పేరు వస్తుందో అలా మాట్లాడుతాడని చెప్పింది. అఖిల్‌ ఈ విషయాలను చాలా లైట్‌గా తీసుకున్నాడు. వాడు గేమ్‌ ఎలాగైనా ఆడని, నాతో మంచిగా ఉంటున్నాడు. వాడితో నాకు మంచి రిలేషన్‌ ఉంది. మా ఇద్దరి మధ్య ఏదైనా మనస్పర్థలు వస్తే డైరెక్ట్‌గా సోహైల్‌ని అడిగే చనువు ఉంది అంటూ చెప్పుకొచ్చాడు.

తలకిందులుగా వేలాడిన అభి
స్టార్టింగ్ నుంచి నిన్ను చూస్తూ ఉన్నా.. నీ బిహేవియర్ చాలా బాగా నచ్చిందిని అభిజిత్‌తో అరియానా చెప్పింది. అభిజిత్ కూడా స్టార్టింగ్‌లో నీకు నాకు సెట్‌ కాదనుకున్నా.. మధ్యలో కలిశాం..మళ్లీ విడిపోయాం అని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో అభిజిత్‌ ఇంగ్లీష్‌లో మాట్లాడాడు. దీంతో ఇంటి నియామాలు ఉల్లంఘించడం నాకు నచ్చదని ముందే చెప్పిన జలజ.. అభికి శిక్ష విధించింది.  తల కిందకి కాళ్లు పైకి పెట్టి ఉండాలని ఆదేశించింది. అభిజిత్ తలకిందులుగా ఉండి.. తెలుగు వర్ణమాల మొత్తం చెప్పి శిక్షను కంప్లీట్‌ చేశాడు.

ఆ ముగ్గురిని ఆవహించిన దెయ్యం
అరియానా, అవినాష్‌, హారికలను దెయ్యం ఆవహించింది. ఈ ముగ్గురు దెయ్యంలా బిహేవ్‌ చేయాలి. మిగిలిన వారు ఇంట్లో ఉన్న మూడు బొమ్మలను వెతికి స్విమింగ్‌ పూల్‌లో వేయాలి. ఒక్కో బొమ్మ వేసినప్పుడల్లా.. ఒకరిని మనిషిగా మార్చొచ్చు అని బిగ్‌బాస్‌ టాస్క్‌ ఇచ్చాడు. ఈ టాస్క్‌లో అఖిల్‌ తెలివిగా అన్ని బొమ్మల్ని స్విమ్మింగ్‌పూల్‌లో వేసి మనుషుల టీమ్‌ను గెలిపించాడు. 

బిగ్ బాస్ హౌస్‌లో వర్మ సినిమా 
బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న ఇంటి సభ్యులకు జలజ దెయ్యం రామ్ గోపాల్ వర్మ ‘12వ అంతస్తు’ సినిమా చూపిస్తూ.. మధ్య మధ్యలో సినిమా ఆపి.. ఒక్కో ఇంటి సభ్యుడ్ని కన్ఫెషన్ రూమ్‌కి పిలిచి.. అక్కడ ఉన్న స్పూన్‌ని వెతికి తేవాలని టాస్క్ ఇచ్చింది.

గజగజ వణికిన అరియానా
మొదటగా కన్ఫెషన్‌ రూమ్‌కి అరియానా, అవినాష్‌లను పంపింది. రూమ్‌ మొత్తం దెయ్యాల కొంపగా మార్చి, లైట్స్‌ లేకుండా చేశారు. ఇక చీకట్లో ఇంట్లోకి వెళ్లడానికి అరియానా గజగజ వణికింది. అవినాష్‌ మాత్రం భయంలేకుండా వెళ్లాడు. ఒక పక్క అరియానా భయంతో వణికిపోతుంటే.. బయట సోహైల్‌, హారికలు మాత్రం చిందులేశారు. చివరికి స్పూన్‌ని వెతికి పట్టుకొని బయటపడ్డారు. 

దెయ్యాన్నే ఇరిటేట్‌ చేసిన మోనాల్‌
ఇక రెండోసారి మోనాల్‌ ఒక్కదానినే కన్పెషన్‌ రూమ్‌కి రావాల్సిందిగా జలజ ఆదేశించింది. దీంతో మోనాల్‌ ఏమాత్రం భయం లేకుండా రూమ్‌లోకి వెళ్లింది. అనంతరం లైట్‌ వేస్తే స్పూన్‌ తీసుకెళ్తానని ఫిటింగ్‌ పెట్టింది. దెయ్యం బిగ్గరగా అరిచినప్పటికీ..  లైట్ లేకుండా స్పూన్‌ని ఎలా వెతకాలి అని తిరిగి దెయ్యాన్నే ప్రశ్నించింది. ఒకనొక దశలో మోనాల్‌ను చూసి దెయ్యమే ఇరిటేట్‌ అయి గట్టిగా అరిచింది. చివరికి ఆ చీకట్లోనే భయపడకుండా స్పూన్‌ని వెతికిపట్టుకొచ్చింది మోనాల్‌. 

 ఆ వీడియోలు వేసి ఇజ్జత్‌ తీయకండి బిగ్‌బాస్‌: అఖిల్‌, సోహైల్‌
అనంతరం సొహైల్, అఖిల్‌లను కన్ఫెషన్ రూమ్‌కి రావాలని జలజ ఆదేశించింది. దీంతో సోహైల్‌ కథ వేరే ఉంటుందని పెద్ద పెద్ద గప్పాలు కొడుతూ కన్ఫెషన్‌ రూమ్‌కి వెళ్లారు. కానీ అక్కడి వెళ్లాక మాత్రం అరియానా కంటే ఎక్కువ భయపడ్డారు. పైకి గంభీరంగా ఉంటునే.. సోహైల్‌ మాత్రం వణికిపోయాడు. ఇక అందరి కంటే ఎక్కువ సేపు వీరిద్దరిని ఆటపట్టించింది జలజ. పెద్ద పెద్దగా అరుస్తూ ఇద్దరికి ముచ్చెముటలు పట్టించింది.  వీళ్ల అరుపులు చూసి భయట మోనాల్ ‘కథ వేరే ఉంటుందా.. కథ వేరే ఉంటుందా’?? అంటూ చిందులు వేసింది. హారిక కూడా అరేయ్ ఏమైందిరా సొహైల్.. పీకుతా పొడుస్తా అన్నావ్ అంటూ ఇజ్జత్‌ తీసింది. ఇక భయపడుతూనే స్పూన్‌లు వెతికిన సోహైల్‌, అఖిల్‌.. బయటకు వచ్చి మాత్రం ధైర్యంగా ఉన్నట్లు నటించారు. ‌ బిగ్‌బాస్‌ కెమెరా ముందుకు వెళ్లి ఈ వీడియోను ప్లే చేయకండని వేడుకున్నారు. ‘గజ్జుమనిపించిడ్రు. బై మిస్టేక్‌ కూడా ఈ వీడియోలు ఎక్కడా వేయకండి. మా ఇజ్జత్‌ పోతది. చూడడానికి కండలు తిరిగి ఉన్నాం. కానీ భయంతో వణికిపోయాం’ అంటూ కెమెరా ముందకు వచ్చి బిగ్‌బాస్‌కు రిక్వెస్ట్‌ చేశారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు