బాధపడ్డా.. కానీ పశ్చాత్తాపం లేదు: సోహైల్‌

9 Jan, 2021 10:30 IST|Sakshi

అప్పటిదాకా చిన్న చిన్న పాత్రల్లో నటించిన సయ్యద్‌ సోహైల్‌కు తెలుగు బిగ్‌బాస్‌-4 సీజన్‌తో ఒక్కసారిగా ఎనలేని గుర్తింపు వచ్చింది. ‘కథ వేరే ఉంటది’ అంటూ తనదైన మేనరిజమ్స్‌తో ఈ ‘సింగరేణి ముద్దుబిడ్డ’  ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక ఫినాలేలో అనూహ్య నిర్ణయంతో అతడు అందరినీ ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. అభిజిత్‌, అఖిల్‌తో పాటు టాప్‌-3లో నిలిచిన సోహైల్‌.. బిగ్‌బాస్‌ ఇచ్చిన రూ. 25 లక్షల డీల్‌కు అంగీకరించి ఇంటిని వీడాడు. అంతేగాక మెగాస్టార్‌ చిరంజీవి ప్రశంసలు అందుకోవడమే గాకుండా.. తన సినిమాలో అతిథి పాత్రలో కనిపిస్తానంటూ ఆయనే స్వయంగా చెప్పడంతో ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఈ క్రమంలో బిగ్‌బాస్‌ ముగిసిన తర్వాత వరుస అవకాశాలు దక్కించుకుంటున్న సోహైల్‌.. హీరోగా ఓ సినిమాలో నటించనున్నాడు.  ‘జార్జ్‌ రెడ్డి’, ‘ప్రెషర్‌ కుక్కర్‌’ చిత్రాల నిర్మాత అప్పిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అయితే ఏ నిర్ణయంతో అయితే సోహైల్‌ సీజన్‌ మొత్తానికి సెంటరాఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచాడో.. దాని కారణంగానే విమర్శలు కూడా మూటగట్టుకున్నాడు. ముఖ్యంగా ఫినాలేకు ముందు అతడి స్నేహితుడు, తోటి కంటెస్టెంటు మెహబూబ్‌ చేసిన పనితో ట్రోలింగ్‌కు గురయ్యాడు. మెహబూబ్‌ సైగల కారణంగానే తాను మూడోస్థానంలో ఉన్నానని తెలుసుకున్న సోహైల్‌.. డబ్బు తీసుకునేందుకు అంగీకరించాడని.. ఇలా మోసపూరితంగా ఆడటం సరికాదంటూ నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. (చదవండి: బంపరాఫర్‌ కొట్టేసిన అఖిల్‌..‌!)

ఈ విషయంపై ఇప్పటికే స్పష్టతనిచ్చిన సోహైల్‌ మరోసారి ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ఇలాంటి నిరాధార ఆరోపణలు, రాతల వల్ల నేనెంతో బాధపడ్డాను. నేను విజేతను కాదని తెలిసే రూ. 25 లక్షలు తీసుకున్నాననడం సరికాదు. అందులో ఎంతమాత్రం నిజం లేదు. 25 లక్షలు అంటే నాకు పెద్ద మొత్తం. ఆ డబ్బు తీసుకుని షో నుంచి బయటకు రావడం పట్ల నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు’’ అని చెప్పుకొచ్చాడు. ఇక బిగ్‌బాస్‌లో పాల్గొనడం తనకెన్నో మధుర జ్ఞాపకాలు మిగిల్చిందని, తన జీవితంలో ఇది భావోద్వేగపూరిత ప్రయాణం అని పేర్కొన్నాడు. తన పదేళ్ల కష్టానికి ఇప్పుడు ఫలితం దక్కిందని ఉద్వేగానికి లోనయ్యాడు.  

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు