సినీ నటి జీవిత టార్గెట్‌గా.. జియో పేరుతో టోకరా! 

23 Nov, 2022 07:24 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సినీ నటి జీవితను టార్గెట్‌గా చేసుకుని, ఆమె మేనేజర్‌ను మోసం చేసిన చెన్నై వాసిని హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. జీవితకు కొన్నాళ్ల క్రితం ఓ గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్‌ వచ్చింది. ఫారూఖ్‌ అంటూ పరిచయం చేసుకున్న అతగాడు మీకు ఇంటర్‌నెట్‌ కనెక్షన్‌ ఇచ్చింది నేనే అని మొదలెట్టాడు. ఆ సమయంలో బిజీగా ఉన్న జీవిత అదే విషయం చెప్పి తన మేనేజర్‌తో మాట్లాడమని సూచించారు. దీంతో అతడితో మాట్లాడిన దుండగుడు తనకు పదోన్నతి వచ్చిన నేపథ్యంలో ఓ బంపర్‌ ఆఫర్‌ విషయం చెప్తున్నానన్నాడు.

జియో సంబంధిత సంస్థల్లో విక్రయించే వస్తువులు మీకు మాత్రమే 50 శాతం డిస్కౌంట్‌లో వస్తాయని నమ్మబలికాడు. దానికి సంబంధించి కొన్ని స్క్రీన్‌ షాట్లను వాట్సాప్‌ ద్వారా షేర్‌ చేశాడు. వాటిలో రూ.2.5 లక్షలు ఖరీదైన ఎలక్ట్రానిక్‌ వస్తువులు రూ. 1.25 లక్షలే వస్తున్నట్లు ఉంది. నిజమని నమ్మిన ఆయన రూ.1.25 లక్షలను ఫారూఖ్‌గా చెప్పుకున్న వ్యక్తిని ఆన్‌లైన్‌లో పంపారు. ఆపై అతడి నుంచి స్పందన లేకపోవడంతో పాటు ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా స్విచ్ఛాఫ్‌ రావడంతో తాను మోసపోయానని గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో కేసు నమోదైంది.

చదవండి: (ప్రేమ పెళ్లి చేసుకున్న యువతి ఆత్మహత్య)

నిందితుడు వాడిన ఫోన్‌ నెంబర్, నగదు బదిలీ అయిన బ్యాంకు ఖాతాలు తదితరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు. చెన్నైకి చెందిన టి.నాగేంద్ర బాబే నిందితుడని గుర్తించారు. అక్కడకు వెళ్లిన ప్రత్యేక బృందం అతడిని అరెస్టు చేసి మంగళవారం సిటీకి తరలించింది. ఇతడు నేరచరితుడని పోలీసులు చెప్తున్నారు. గతంలో సినిమా పరిశ్రమలో పనిచేస్తున్న వారికి ఫోన్లు చేసి ఆఫర్ల పేరుతో మోసాలు చేసినట్లు గుర్తించారు. సినీ నిర్మాతలకు అవార్డులు ఇప్పిస్తానంటూ నమ్మించి వారి నుంచీ డబ్బులు వసూలు చేశాడు. నగరంతో పాటు సైబరాబాద్‌లోనూ కేసులు నమోదు కావడంతో గతంలోనూ జైలుకు వెళ్లాడు. గతంలో చెన్నైలోని ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో చెఫ్‌గానూ పని చేశాడు.

మరిన్ని వార్తలు