Vijayakanth: విజయ్‌కాంత్‌ కన్నుమూత | DMDK President Vijayakanth Passed Away Due To Corona At Age 71 - Sakshi
Sakshi News home page

Actor Vijayakanth Death: డీఎండీకే అధినేత, నటుడు విజయకాంత్ కన్నుమూత

Published Thu, Dec 28 2023 9:02 AM

DMDK President Vijayakanth Passed Away Due To Corona - Sakshi

దక్షిణ చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. తమిళనాడు డీఎండీకే అధినేత, ప్రముఖ నటుడు విజయకాంత్‌(71) కన్నుమూశారు. చెన్నై మియోట్‌ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆయన గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. అటు ఆస్పత్రి వర్గాలు.. ఇటు తమిళనాడు ఆరోగ్య కార్యదర్శి విజయకాంత్‌ మృతిపై అధికారిక ప్రకటన చేశారు. 

విజయ్‌కాంత్‌ అసలు పేరు నారాయణన్‌ విజయరాజ్‌ అళగర్‌స్వామి. మధురైలో  1952 ఆగష్టు 25న జన్మించారు. విజయకాంత్‌గా పేరు మార్చుకుని 27 ఏళ్ల వయసులో.. ‘ఇనిక్కుం ఇలామై’తో నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తొలి చిత్రంలో ఆయన ప్రతినాయకుడి(విలన్‌)రోల్‌ చేశారు. కెరీర్‌ ఆరంభంలో కాస్త పరాజయాలు అందుకున్న విజయ్‌కాంత్‌.. ఎస్.ఎ. చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన ‘దూరతు ఇడి ముజక్కం’, ‘సత్తం ఓరు ఇరుత్తరై’లతో విజయాలు అందుకున్నారు. సుమారు 100కి పైగా చిత్రాల్లో ఆయన నటించి ఎన్నో ఏళ్లపాటు ప్రేక్షకుల్ని అలరించారు. దాదాపు 20కి పైగా పోలీస్‌ కథల్లోనే ఆయన నటించి మెప్పించారు. సోలో హీరోగా విరుధగిరి(2010) ఆయన చివరిచిత్రం. తనయుడు షణ్ముగ పాండియన్‌ హీరోగా నటించిన సగప్తం(2015)లో చివరిసారిగా ఓ అతిథి పాత్రలో తెరపై విజయ్‌కాంత్‌ కనిపించారు. 

విజయకాంత్‌ నటించిన 100వ చిత్రం ‘కెప్టెన్‌ ప్రభాకర్‌’ విజయం సాధించిన తర్వాత నుంచి అందరూ ఆయన్ని కెప్టెన్‌గా పిలుస్తున్నారు. ఇక, విజయ్‌కాంత్ నటించిన చాలా చిత్రాలు తెలుగులోనూ డబ్‌ కావడంతో ఇక్కడి వారికీ ఆయన సుపరిచితులే. ప్రజలకు సేవల చేయాలనే ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2005లో డీఎండీకే పార్టీని స్థాపించి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాజకీయాల్లోనూ సత్తా చాటినా ఆయన.. తమిళనాడు రాజకీయాల్లోనూ కీలకంగా వ్యవహరించారు.

👉: కెప్టెన్‌ ఓ సెన్సేషన్‌.. విజయకాంత్‌ అరుదైన చిత్రాలు

Advertisement

తప్పక చదవండి

Advertisement