Enforcement Directorate (ED) Gets Complaint Against Trinamool MP Nusrat Jahan - Sakshi
Sakshi News home page

Nusrat Jahan: సినీ నటి నుస్రత్ జహాన్‌పై ఈడీకి ఫిర్యాదు.. !

Published Tue, Aug 1 2023 8:05 PM

ED gets complaint against Trinamool MP Nusrat Jahan - Sakshi

తృణమూల్ ఎంపీ, నటి నుస్రత్ జహాన్‌ తాజాగా వివాదంలో చిక్కుకుంది. పశ్చిమ బెంగాల్‌లోని 24 పరగణాలు జిల్లాలో ఆమె మోసానికి పాల్పడిందంటూ ఈడీకి ఫిర్యాదు చేశారు. గతంలో ఆమె కేవలం రూ.6 లక్షలకే త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్‌ ఇస్తామని డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపించారు. అయితే ఆమె ప్రకటించిన ఐదేళ్లు పూర్తయినా ఇప్పటివరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. 

(ఇది చదవండి: అతడితో డేటింగ్ వల్ల బరువు తగ్గాను: రాశీఖన్నా)

తమకు త్రిబుల్ బెడ్ రూమ్‌ ఫ్లాట్స్ తక్కువ ధరకే అందిస్తామని మోసం చేశారంటూ సాల్ట్ లేక్ ఈడీ కార్యాలయంలో బాధితులు ఫిర్యాదు చేశారు. సెవెన్ సెన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్‌ పేరుతో మోసాలకు పాల్పడ్డారని వారు ఆరోపించారు. ప్రస్తుతం ఎంపీగా ఉన్న నుస్రత్ జహాన్ దాదాపు రూ.24 కోట్ల మోసాలకు పాల్పడినట్లు తెలుస్తోంది.

కాగా.. ఇప్పటికే ఈ వ్యవహారంపై గతంలో కోర్టులో కేసు దాఖలైంది. ఈ కేసులో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ నుస్రత్ జహాన్ కోర్టుకు హాజరు కాలేదని బాధితులు తెలిపారు. దీంతో చివరికీ ఈడీని ఆశ్రయించామని తెలిపారు. అయితే ఈ విషయంలో జహాన్ ఇప్పటివరకు స్పందించలేదు. కాగా.. నుస్ర‌త్ జ‌హాన్‌ బెంగాలీ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటి. ఆమె 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున బసిర్‌హాట్‌ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎంపీగా గెలిచింది. 

కాగా.. గతంలో ఫిబ్రవరి 2012లో పార్క్ స్ట్రీట్‌లో ఆంగ్లో-ఇండియన్ మహిళపై జరిగిన సామూహిక అత్యాచారం తర్వాత జహాన్ వివాదంలో చిక్కుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఖాదర్ ఖాన్‌కు ఆశ్రయం కల్పించినట్లు జహాన్‌పై ఆరోపణలు ఉన్నాయి. మార్చి 2015లో అత్యాచార బాధితురాలు మరణించింది. నిందితుడు ఖాదర్‌ ఖాన్ ఇంకా పరారీలో ఉన్నాడు.

(ఇది చదవండి: 'మేడ్ ఇన్ హెవెన్' లో ట్రాన్స్‌ వుమెన్.. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా?)

Advertisement
Advertisement