Sakshi News home page

The Elephant Whisperers: డబ్బులు తిరిగి ఇవ్వలేదు.. తీవ్రంగా అవమానించారు: బొమ్మన్, బెల్లీ ఆవేదన

Published Sun, Aug 6 2023 9:22 PM

The Elephant Whisperers Couple Bomman Bellie Allegations On Director - Sakshi

'ది ఎలిఫెంట్ విస్పరర్స్' పేరు వినగానే గుర్తు పట్టేస్తారు. ఎందుకంటే ప్రతిష్ఠాత్మక ఆస్కార్ వేదికపై ఈ పేరు మార్మోగిపోయింది. డాక్యుమెంటరీ చిత్రం అయినప్పటికీ అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కించుకుంది. ఈ ఏడాది జరిగిన 95 ఆస్కార్ అవార్డ్స్ ఈవెంట్‌లో భారత్ నుంచి ఆర్ఆర్ఆర్ మూవీ నాటునాటు సాంగ్‌కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌ విభాగంలో అవార్డ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్‌తో పాటు బెస్ట్ షార్ట్ ఫిలిం కేటగిరీలో ఆస్కార్‌ను కైవసం చేసుకుంది 'ది ఎలిఫెంట్ విస్పరర్స్'. దిక్కులేని ఏనుగులను ఆదరించి.. వాటిని చూసుకునే ఓ దంపతుల ఇతివృత్తంగా తెరకెక్కించారు ది ఎలిఫెంట్ విస్పరర్స్.

(ఇది చదవండి: తమన్నా చేయి పట్టుకున్న అభిమాని.. హీరోయిన్ ఏం చేసిందంటే? )

డాక్యుమెంటరీలో అద్భుతంగా నటించి ప్రపంచవ్యాప్తంగా హృదయాలను గెలుచుకున్న గిరిజన జంట బొమ్మన్, బెల్లీ. అయితే తాజాగా ఈ జంట దర్శకుడు కార్తికి గోన్సాల్వేస్, చిత్ర నిర్మాణ సంస్థ సిఖ్యా ఎంటర్‌టైన్‌మెంట్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆగస్ట్ 4న ప్రముఖ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బొమ్మన్, బెల్లీ దంపతులు నిర్మాతలు వ్యవహరించిన తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు.  

'ది ఎలిఫెంట్ విస్పరర్స్' చిత్రీకరణ సమయంలో ఈ జంట.. దర్శకురాలు కార్తికి గోన్సాల్వ్స్‌తో స్నేహపూర్వక బంధాన్ని కొనసాగించారు. దీంతో బొమ్మన్, బెల్లీ సినిమా కోసం వివాహ సన్నివేశం కోసం లక్ష రూపాయలు తాము భరించామని తెలిపారు. ఆ డబ్బులను ఇప్పటివరకు తిరిగి ఇవ్వలేదని ఆరోపించారు. తన మనవరాలి చదువు కోసం దాచుకున్న రూ. 1 లక్ష ఖర్చు చేసినట్లు బెల్లీ వెల్లడించారు. డబ్బు తిరిగి చెల్లిస్తానని  హామీ ఇచ్చిన కార్తికి గోంజాల్వెస్‌ ఆ తర్వాత స్పందించలేదని వాపోయారు. ఆమెను కలిసేందుకు ప్రయత్నించగా ఎలాంటి స్పందన లేదన్నారు. తన ఫోన్‌ కూడా లిఫ్ట్ చేయడం లేదన్నారు.

 ఆస్కార్‌ను తాకడానికి ఒప్పుకోలేదు

'ది ఎలిఫెంట్ విస్పరర్స్' ఆస్కార్ అవార్డును గెలుచుకున్న తర్వాత సన్మాన కార్యక్రమంలో బొమ్మన్, బెల్లీ దంపతులు కనీసం అవార్డ్ తాకేందుకు అనుమతించలేదని అన్నారు. ముంబై తిరిగి నీలగిరి రావడానికి కనీసం డబ్బులు కుడా ఇవ్వలేదని వాపోయారు. ఆర్థిక సహాయం కోసం ఆమెను సంప్రదించగా నిరాకరించిందని తెలిపారు. తమకు రెమ్యునరేషన్ కేవలం రూ. 60 మాత్రమే చెల్లించారని తెలిపారు. 

స్పందించని మేకర్స్

గిరిజన దంపతుల ఆరోపణలపై సిఖ్యా ఎంటర్‌టైన్‌మెంట్ 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' ఉద్దేశంపై ఒక ప్రకటన విడుదల చేసింది. ఏనుగుల సంరక్షణపై అవగాహన పెంచడం, బొమ్మన్, బెల్లీతో సహా అటవీ శాఖల కృషిని గుర్తించడం తమ ప్రాథమిక లక్ష్యమని తెలిపింది. అంతే ఈ దంపతులు లేవనెత్తిన ఆరోపణలపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. 

(ఇది చదవండి: ఆస్కార్‌ అంటే ఏంటో తెలియదు: ది ఎలిఫెంట్ విస్పరర్స్ నటి)

అసలు కథేంటంటే.. 

తమిళనాడులోని ముదుమలై రిజర్వ్‌ ఫారెస్ట్‌లో మావటిగా పనిచేస్తున్న బెల్లీ, బొమ్మన్‌ దంపతుల నిజజీవిత ఆధారంగా తెరకెక్కించిన షార్ట్‌ ఫిలిం ది ఎలిఫెంట్‌ విష్పరర్స్‌. రఘు, అమ్ము అనే రెండు అనాథ ఏనుగు పిల్లలు. వాటిని ఆదరించిన ఈ దంపతులనే ప్రధాన పాత్రలుగా కథ రూపొందించారు. నిర్మాత గునీత్‌ మోగ్న ఆధ్వర్యంలో.. దర్శకురాలు కార్తికి గోంజాల్వెస్‌ ఈ కథను తెరకెక్కించారు. 

ఆస్కార్ అంటే ఏంటో తెలియదు: బెల్లీ

గతంలో ఆస్కార్ రావడం పట్ల బెల్లీ మాట్లాడుతూ.. 'ఏనుగులు అంటే మాకు పిల్లలతో సమానం. తల్లిని కోల్పోయిన పిల్లలకు సేవ చేయడాన్ని గొప్పగా భావిస్తాం. అలాంటి చాలా గున్న ఏనుగులను చేరదీశాం. వాటిని మా సొంత పిల్లల్లా చూసుకుంటాం. ఇది మా రక్తంలోనే ఉంది. మా పూర్వీకులు కూడా ఇదే పని చేసేవారు. కానీ నాకు ఆస్కార్‌ అంటే ఏంటో తెలియదు. అయినా అభినందనలు రావడం చాలా సంతోషంగా ఉంది.' అని అన్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement