లెక్క అర్థమైపోయింది

10 Apr, 2021 03:30 IST|Sakshi

ఎన్నో ఆశలతో కెరీర్‌ ఆరంభించి, టేకాఫ్‌ సరిగ్గా లేకపోతే నిరుత్సాహపడిపోతాం. నటి కియారా అద్వానీకి ఇలానే జరిగింది. హిట్, బ్రేక్‌ రావడానికి ఆమెకు కాస్త టైమ్‌ పట్టింది. ఈ విషయం గురించి కియారా అద్వానీ మాట్లాడుతూ – ‘‘కష్టకాలం అంటారు కదా! కెరీర్‌ మొదట్లో నాకు అలాగే అనిపించింది. తరువాత ఏమిటనేది ఆలోచించుకోలేని, తెలుసుకోలేని పరిస్థితి అది. బాగా ఆలోచించిన మీదట ‘ఒక్క సినిమా’తోనే కెరీర్‌ అయిపోదని అర్థమైంది.

సినిమాలు రిలీజయ్యే ప్రతి శుక్రవారం ముఖ్యం అనే లెక్క అర్థమైపోయింది. ఇక అప్పటి నుంచి ఒక్క సినిమా ఫ్లాప్‌ అయితే ఏదో జరిగిపోయిందన్నట్లుగా కాకుండా ‘బోలెడన్ని సినిమాలున్నాయి కదా’ అనేది మనసులో పెట్టుకున్నాను. నాకు నేను ధైర్యం చెప్పుకున్నాను. నన్ను నేను నమ్మాను. మన కాళ్ల మీద మనం నిలబడగలమనే ధైర్యం వచ్చింది. వచ్చిన ప్రతి అవకాశాన్నీ శక్తివంచన లేకుండా సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. అలాగే పని చేస్తున్నాను. అది వర్కవుట్‌ అయింది.

ఇవాళ ఏదైనా కొత్త సినిమా ప్లాన్‌ చేస్తున్నారంటే ఏ హీరోయిన్‌ని తీసుకుందాం అనే లిస్ట్‌లో దర్శక – నిర్మాతలు నా పేరు కూడా పరిశీలిస్తున్నారు. నేను కూడా ప్రతి పాత్రనూ కొత్తగా చేయడానికి ప్రయత్నిస్తున్నా. ఉదాహరణకు, ఒక సినిమాలో ఒకలా ఏడ్చాననుకోండి.. ఇంకో సినిమాలో వేరే రకంగా ప్రయత్నిస్తున్నాను. ఏడుపు అనే కాదు.. నవ్వడం, బాడీ లాంగ్వేజ్‌.. ఇలా అన్నీ డిఫరెంట్‌గా ఉండేలా చూసుకుంటున్నాను’’ అన్నారు. తెలుగులో ‘భరత్‌ అనే నేను’తో హిట్‌ అందుకున్న కియారా ఆ తర్వాత ఇక్కడ అవకాశాలు దక్కించుకోగలుగుతున్నారు. ‘అర్జున్‌రెడ్డి’ హిందీ రీమేక్‌ ‘కబీర్‌సింగ్‌’తో అక్కడా హిట్‌ సాధించారు. ఇక ఓటీటీలో ‘లస్ట్‌ స్టోరీస్‌’లో బోల్డ్‌క్యారెక్టర్‌తో భేష్‌ అనిపించుకున్నారు కియారా. ప్రస్తుతం హిందీలో ‘భూల్‌ భులయ్యా 2’, ‘జగ్‌ జగ్‌ జీయో’, ‘మిస్టర్‌ లేలే’ చిత్రాల్లో నటిస్తున్నారామె.

మరిన్ని వార్తలు