Salman Khan: బాలీవుడ్ స్టార్‌ సల్మాన్‌ ఖాన్ భద్రత కట్టుదిట్టం.. అదే కారణం..!

1 Nov, 2022 17:37 IST|Sakshi

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌కు పోలీసుల భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. తాజాగా ఆయనకు వై+ కేటగిరీలో ముంబై పోలీసులు భద్రత కల్పించారు. గతంలో సల్మాన్‌ ఖాన్‌కు ప్రముఖ పంజాబీ సింగర్ సిద్ధూ మూసే వాలా హత్య కేసులో ప్రధాన నిందితుడైన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపు లేఖ రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో సల్మాన్ భద్రతను మరింత పటిష్ఠం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. 

(చదవండి: జెనీలియా మూవీపై దర్శకుడు సంచలన ఆరోపణలు.. !)

సిద్ధూ మూసేవాలా హత్య కేసులో లారెన్స్‌ బిష్ణోయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. కృష్ణజింకల కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న సల్మాన్‌ఖాన్‌ని హత్య చేస్తానంటూ 2018లో కోర్టు ఆవరణలోనే ఈ గ్యాంగ్‌స్టర్ ప్రకటించాడు. గతంలో సల్మాన్‌ హత్యకు కుట్ర పన్నారని  వార్తలు కూడా వచ్చాయి. సింగర్ సిద్ధూ హత్య తర్వాత కొందరు దుండగులు సల్మాన్‌ ఖాన్‌తోపాటు ఆయన తండ్రి సలీం ఖాన్‌ను చంపేస్తామని లేఖ ద్వారా బెదిరించారు. లేఖను సీరియస్‌గా తీసుకున్న ముంబై పోలీసులు ఆయనకు భద్రతను మరింత పెంచారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు సల్మాన్‌ ఇంటి వద్ద అదనపు సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తలు