Anushka Shetty Latest Movie Update: అనుష్క- క్రిష్‌.. ఓ ఒడిశా అమ్మాయి!

13 Feb, 2024 09:55 IST|Sakshi

అమ్మాయికి జరిగిన అన్యాయంపై అనుష్క సినిమా?

సినిమా అనేది ఓ రంగుల ప్రపంచం. ఈ రంగంలో రాణించాలంటే.. ప్రతిభతో పాటు అదృష్టం కూడా ఉండాలి. ప్రస్తుతం ఆ అదృష్టానికి అనుష్క, క్రిష్‌ దూరమయ్యారు. ఇద్దరు మంచి ప్రతిభావంతులే. కానీ కాలం కలిసిరాకపోవడంతో కెరీర్‌ పరంగా కొంతవరకూ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఇటీవల అనుష్క నటించిన.. క్రిష్‌ దర్శకత్వం వహించిన చిత్రాలేవి ఆశించిన స్థాయిలో విజయం సాధించడం లేదు. దీంతో ఈ ఇద్దరు టాలెంటెడ్‌ వ్యక్తులు కలిని ఓ సినిమా చేయబోతున్నారు.ఎలాంటి గాసిప్‌ లేకుండా వీరిద్దరి సినిమా పట్టాలెక్కడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అనుష్కని మెయిన్‌ లీడ్‌లో పెట్టి ఏకంగా ఓ పాన్‌ ఇండియా సినిమానే తెరకెక్కిస్తున్నాడట క్రిష్‌. పడిపోయిన అనుష్క గ్రాఫ్‌ని లేపడానికి యూవీ క్రియేషన్స్‌ ఈ బాధ్యతలను తీసుకున్నట్లు తెలుస్తోంది. 

లేడి ఓరియెంటెండ్‌ చిత్రాలు అనుష్కకి కొత్తేమి కాదు. అరుధంతి, రుద్రమదేవి, బాహుబలి, భాగమతి లాంటి చిత్రాలెన్నో చేసింది. ఇవన్నీ కెరీర్‌ పరంగా అనుష్క స్థాయిని పెంచిన చిత్రాలే. అయితే చివరకు అలాంటి లేడి ఓరియెంటెండ్‌ చిత్రమే అనుష్క గ్రాఫ్‌ని పడిపోయేలా చేసింది. అదే జీరో సైజ్‌ మూవీ. ఈ మూవీ కోసం అధిక బరువు పెరిగింది ఈ యోగా టీచర్‌. ఆ తర్వాత బరువు తగ్గించుకోవడం కోసం నానాపాట్లు పడినా.. మళ్లీ మునుపటి అనుష్క మాత్రం తెరపై కనిపించలేదు. చాలా కాలం తర్వాత ఆ మధ్య మిస్‌ శెట్టి, మిస్టర్‌ పొలిశెట్టి సినిమాతో తెరపై కాస్త అందంగా కనిపించింది.

ఇక క్రిష్‌ సంగతి కూడా అంతే.. గమ్యం, వేదం, కంచె లాంటి సినిమాలతో టాలెంటెండ్‌ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2017లో వచ్చిన గౌతమీపుత్ర శాతకర్ణ వరకు క్రిష్‌కి మంచి గుర్తింపు ఉంది. ఆ తర్వాత ఎన్టీఆర్‌ బయోపిక్స్‌ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు క్రిష్‌ గ్రాఫ్‌ని కిందకు దించాయి. దీనికి తోడు మణికర్ణిక సినిమా విషయంలో కంగనా రనౌత్‌తో జరిగిన గొడవ క్రిష్‌కి మైనస్‌ అయింది. ఆ గొడవ వల్ల క్రిష్‌ బాలీవుడ్‌కి దూరమయ్యాయి. 2021లో కొండపొలం అనే సినిమా వచ్చేవరకు క్రిష్‌ పేరు ఎక్కడా వినిపించలేదు. అయితే కొండపొలం కూడా డిజాస్టర్‌ కావడంతో క్రిష్‌ ఢీలా పడ్డాడు. హరిహర వీరమల్లు చిత్రంతో గ్రాండ్‌ రీఎంట్రీ ఇద్దామనుకున్నాడు. కానీ ఆ చిత్రం మూడేళ్లుగా షూటింగ్‌ జరుపుకుంటునే ఉంది. 

ఇలా కెరీర్‌ పరంగా ఢీలా పడ్డ ఇద్దరు మోస్ట్ టాలెంటెడ్ వ్యక్తులు కలిసి ఓ పవర్‌ఫుల్‌ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఒడిశాలో ఓ అమ్మాయి జీవితంలో చోటు చేసుకున్న యధార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతున్నట్లు సమాచారం. తనకు జరిగిన ఓ అన్యాయంపై ఓ ఒడిశా అమ్మాయి ఎలా పోరాటం చేసిందనే నేపథ్యంలో ఈ కథ సాగుతుందట. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ ఒడిశాలో జరుగుతుంది. అక్కడ అనుష్కపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట. ఒడిశాకి చెందిన అమ్మాయి కథే కాబట్టి అక్కడ షూటింగ్‌ చేస్తున్నారని అంటున్నారు. మహిళా లోకం మొత్తం ఆలోచింపజేసేలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడట క్రిష్‌. మరి ఈ చిత్రంతో కెరీర్‌ పరంగా ఇద్దరు సక్సెస్‌ బాట పడతారో లేదో చూడాలి. 

whatsapp channel

మరిన్ని వార్తలు