ప్రతి భారతీయుడు కనెక్ట్‌ అయ్యే సినిమా ఇది  | Sakshi
Sakshi News home page

ప్రతి భారతీయుడు కనెక్ట్‌ అయ్యే సినిమా ఇది 

Published Wed, Feb 28 2024 12:01 AM

Interview of Varun Tej about Operation Valentine - Sakshi

వరుణ్‌ తేజ్‌

‘‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ షూటింగ్‌లో ఒక ఫ్లైట్‌ సిమ్యులేటర్‌లో నన్ను కూర్చోబెట్టి రియల్‌ లైఫ్‌ప్రోజెక్షన్‌ అనుభూతిని ఇచ్చేలా చేశారు. అందులో కూర్చుంటే నిజంగా విమానం నడిపినట్లే ఉంటుంది. ముఖానికి ఆక్సిజన్‌ మాస్క్, తలకు హెల్మెట్‌ ఉండటంతో కళ్లతోనే భావోద్వేగాలు పలికించాలి. ఇలాంటి పాత్రలు చేయడం ఒక సవాల్‌గా అనిపించింది’’ అన్నారు వరుణ్‌ తేజ్‌.

శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడా దర్శకత్వంలో వరుణ్‌ తేజ్‌ హీరోగా నటించిన చిత్రం ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’. సోనీ పిక్చర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రోడక్షన్స్, సందీప్‌ ముద్దా రినైసన్స్‌ పిక్చర్స్‌పై ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమా మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా వరుణ్‌ తేజ్‌ చెప్పిన విశేషాలు. 

► ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ చిత్రకథని శక్తి ప్రతాప్‌ సింగ్‌ 2020లో చెప్పాడు.. వినగానే నచ్చింది. శక్తి హిందీ అబ్బాయి అయినప్పటికీ ఈ సినిమాని తెలుగులోనే చేయాలని అనుకున్నాడు. నేను సోనీ పిక్చర్స్‌ వారితో ఓ సినిమా చేయాల్సి ఉండటంతో ఈ చిత్రకథను వారికి పంపించాను. నేషనల్‌ అప్పీల్‌ కంటెంట్‌ ఉన్న ఈ కథ సోనీ పిక్చర్స్‌ వారికి కూడా బాగా నచ్చడంతో హిందీలో కూడా చేయాలని నిర్ణయించాం. ద్విభాషా చిత్రంగా రూపొందిన ఈ మూవీలోని ప్రతి సీన్‌ని తెలుగు, హిందీ భాషల్లో చిత్రీకరించాం.

► ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ చిత్రంలో రుద్ర పాత్రలో కనిపిస్తాను. కొందరు రియల్‌ ఎయిర్‌ ఫైటర్స్‌ స్ఫూర్తితో నా పాత్రని చాలా అద్భుతంగా డిజైన్‌ చేశాడు శక్తి ప్రతాప్‌. నా పాత్రతో అందరూ చాలా ఎమోషనల్‌గా కనెక్ట్‌ అవుతారు. ఈ సినిమా కోసం శక్తి చాలా పరిశోధన చేశాడు. తనకి వీఎఫ్‌ఎక్స్‌పై కూడా మంచి పట్టు ఉంది.

► 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఉగ్ర దాడిలో 40మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు వీర మరణం పొందారు. దానికి కారణమైన వారిపై ప్రతీకారం తీర్చుకునేందుకు భారత వైమానిక దళం ఓ ఆపరేషన్‌ నిర్వహించి, శత్రువులకు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇచ్చింది. ఫిబ్రవరి 14న ప్రపంచమంతా వాలెంటైన్స్‌ డే జరుపుకుంటుంది. అయితే ఫిబ్రవరి 14న ఈ ఘటన జరిగింది కాబట్టి మా సినిమాకి ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ టైటిల్‌ పెట్టాం. ఈ సినిమాలో వాలెంటైన్‌ అంటే ప్రతి ఒక్కరికీ దేశం మీద ఉన్న ప్రేమ అని అర్థం. మా సినిమా చూసిన ఎయిర్‌ఫోర్స్‌ అధికారులు పుల్వామా ఘటనపై ఇప్పటి వరకూ వచ్చిన సినిమాల్లో ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ ది బెస్ట్‌ అని ప్రశంసించారు. ప్రతి భారతీయుడు ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయ్యే సినిమా ఇది.

► ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ని తెలుగు, హిందీ భాషల్లో చేశాం. హిందీలో డైలాగులు చెప్పేందుకు రెండు నెలలు క్లాసులు తీసుకున్నాను. హిందీలో నా పాత్రకి నేనే డబ్బింగ్‌ చెప్పాను. ఇక ప్రస్తుతం ‘మట్కా’ సినిమా చేస్తున్నాను. 

‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ చిత్రీకరణ అక్టోబర్‌లో పూర్తయింది. ఆ తర్వాత బ్రేక్‌ తీసుకుని నవంబరులో లావణ్యా త్రిపాఠిని పెళ్లి చేసుకున్నాను. ఈ సినిమా కోసం హిందీ డైలాగులు నేర్చుకుంటున్నప్పుడు తను కూడా సాయం చేసింది. మా ఇద్దరికీ సరిపడే పాత్రలు ఉంటే కచ్చితంగా మళ్లీ జోడీగా నటిస్తాం (గతంలో ‘మిస్టర్‌’, ‘అంతరిక్షం’ సినిమాలు చేశారు).. అంతేకానీ, ఏదో మేమిద్దరం కలిసి చేసేయాలనే ఉద్దేశంతో మాత్రం చేయం.

Advertisement
Advertisement