Jogi Naidu Talk About His First Marriage With Anchor Jhansi - Sakshi
Sakshi News home page

Jogi Naidu: ఝాన్సీని, నన్ను కలిపేందుకు చిరంజీవి, బ్రహ్మానందం ఎంతో ట్రై చేశారు

Published Sun, May 7 2023 7:19 PM

Jogi Naidu About His First Marriage with Anchor Jhansi - Sakshi

టీవీ యాంకర్‌గా కెరీర్‌ ప్రారంభించిన జోగి నాయుడు తర్వాతి కాలంలో నటుడిగానూ మారారు. స్వామి రారా, దృశ్యం, కుమారి 21 ఎఫ్‌, నువ్వలా నేనిలా, గుంటూరు టాకీస్‌ వంటి పలు చిత్రాల్లో నటించారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం ఆయన్ను ఏపీ క్రియేటివిటీ అండ్‌ కల్చర్‌ కమిషన్‌ క్రియేటివ్‌ హెడ్‌గా నియమించింది. జోగి నాయుడు జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. యాంకర్‌ ఝాన్సీని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆయన కూతురు పుట్టాక ఆమెతో విడిపోయారు. తనతో ఉండటానికి ఎంతగానో ప్రయత్నించినప్పటికీ ఝాన్సీ ఒప్పుకోకపోవడంతో విడాకులు ఇచ్చేశారు. తర్వాత రెండో పెళ్లి చేసుకున్నారు. తాజాగా తన మొదటి పెళ్లి గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు జోగి నాయుడు.

కెరీర్‌ పీక్స్‌లో ఉన్నప్పుడు..
'1995లో ఝాన్సీ నాకు తొలిసారి పరిచయమైంది. అప్పుడామె ఇంటర్‌ చదువుతోంది. జీకే మోహన్‌ తీసిన ఓ సినిమాలో తను నటించింది. అప్పుడు నేను జీకే మోహన్‌ దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేస్తున్నా. ఆ సమయంలోనే మా ప్రేమ చిగురించింది. మేము కలిసున్న జ్ఞాపకాలను ఇప్పటికీ గుర్తు చేసుకుని సంతోషపడుతూ ఉంటాను. నేను అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా, తను యాంకర్‌గా కెరీర్‌ ప్రారంభించింది. చిన్న స్థాయి నుంచి పైకి ఎదుగుతూ వచ్చాం. దాదాపు తొమ్మిదేళ్లపాటు మేమిద్దరం కలిసే ఉన్నాం. కానీ ఇద్దరం మంచి స్టేజీకి వచ్చిన తర్వాత సమస్యలు మొదలయ్యాయి. ఏడాదిలోనే విడిపోవాల్సి వచ్చింది. అప్పటికి మాకు ధన్య అనే కూతురు ఉంది.

బ్రహ్మానందం, చిరు మమ్మల్ని కలపాలనుకున్నారు
కలిసుండాలని నేను ఎంతో ప్రయత్నించాను, కానీ అది జరగలేదు. మా బంధం ఇంతవరకే అని రాసిపెట్టుందేమో, దాన్నెవరు ఆపగలరు? కానీ నాకున్న ఎమోషన్స్‌ వల్ల ఏడెనిమిది సంవత్సరాలు ఆ బాధలో నుంచి బయటపడలేకపోయాను. బ్రహ్మానందం ఒక తండ్రి స్థానంలో నిలబడి మమ్మల్ని కలిపేందుకు చాలా ప్రయత్నించారు. చిరంజీవి కూడా మమ్మల్ని కూర్చోబెట్టి రెండు,మూడు గంటలపాటు మాట్లాడారు. కానీ వర్కవుట్‌ కాలేదు. తనతో నడిచిన ప్రయాణంలో జీవితకాలం సరిపడా జ్ఞాపకాలు పోగేసుకున్నాను.

వారానికోసారి పాపను చూసేదాన్ని
ఆ తర్వాత మేమిక కలవడం జరగని పని అని అర్థమయ్యాక అమ్మానాన్న చెప్పిన మాట విని రెండో పెళ్లి చేసుకున్నాను. కానీ నా కూతురు దూరమైపోయిందన్న బాధ మాత్రం అలాగే ఉంది. తను నాకు దూరంగా సంతోషంగా ఉంది. కానీ తనను చూడలేకపోతున్నాను నా తమ్ముడు చనిపోయాడు. వాడిని ఎప్పటికీ చూడలేను. వీళ్లిద్దరి విషయంలో ఒకలాగే ఫీలవుతాను. ఇద్దరూ ఎక్కడో ఉన్నారు. కానీ మాట్లాడలేకపోతున్నా. ఝాన్సీతో విడాకులు తీసుకున్న తర్వాత నా కూతురు చిన్నప్పుడు తల్లి దగ్గర పెద్దయ్యాక తండ్రి దగ్గర ఉండాలని కోర్టు చెప్పింది. అందుకే తల్లి దగ్గరే పెరిగింది. వారానికోసారి పంపించేది. పేగు బంధాన్ని చుట్టపుచూపుగా తీసుకువస్తే అన్యాయం అనిపించింది.

గంట కోసం దెబ్బలాడేవాడిని
మా మామయ్య తనను తీసుకువచ్చినప్పుడు టైం చూసుకుని గంట అయిపోయింది అనేవారు. అరగంట, గంట కోసం దెబ్బలాడేవాడిని. నా కూతురిని పంపించనని అనేవాడిని. అది చూసి నా చిట్టితల్లి కన్నీళ్లుపెట్టుకునేది. అలా ఎన్నోసార్లు ఏడుస్తూ వాళ్లతో వెళ్లిపోయింది. నా బిడ్డ నలిగిపోతుందని అర్థమై ఇక మీదట పంపించొద్దన్నాను. కానీ తను స్కూల్‌కు వెళ్లేటప్పుడు, ఆడుకునేటప్పుడు చూడాలని వాళ్లుండే కాలనీలోనే ఇల్లు తీసుకున్నాను. అందరూ డిస్టర్బ్‌ అవుతుండటంతో నేనే దూరంగా వచ్చేశా. నా కూతురు ఎప్పటికైనా నా దగ్గరకు వస్తుందిలే అనుకున్నాను. అది జరగలేదు. అందుకే దేవుడు కరుణించి నాకు కొత్త జీవితం ఇచ్చి ఇద్దరు ఆడపిల్లల్ని ఇచ్చాడు. వాళ్లలోనే నా ధన్యను చూసుకుంటున్నాను' అని ఎమోషనల్‌ అయ్యారు జోగి నాయుడు.

చదవండి: కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న కేరళ స్టోరీ

Advertisement

తప్పక చదవండి

Advertisement