అందుకే తెలుగు సినిమాలంటే ఇష్టం 

16 Feb, 2023 01:42 IST|Sakshi

‘‘మంచి కంటెంట్‌కు కమర్షియల్‌ అంశాలు జోడించి, తెలుగు సినిమాలు తీస్తుంటారు. అందుకే తెలుగు సినిమాలంటే నాకు ఇష్టం. ఇలాంటి తరహా సినిమాలు తీయడం రిస్క్‌ అయినప్పటికీ చాలెంజింగ్‌గా తీసుకుని ఇక్కడ తెరకెక్కిస్తారు. అయితే మా (మరాఠీ) సినిమాలు కమర్షియల్‌గా కాకుండా ఎక్కువగా రియలిస్టిక్‌గా ఉంటాయి’’ అని అన్నారు కశ్మీరా పరదేశి. కిరణ్‌ అబ్బవరం, కశ్మీరా పరదేశి జంటగా మురళీ కిషోర్‌ దర్శకత్వంలో రూపొం దిన చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’. అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది.

ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో కశ్మీరా మాట్లాడుతూ– ‘‘తిరుపతి నేపథ్యంలో వస్తున్న సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’. తిరుపతిలో షూటింగ్‌ చేయడం వల్ల పాజిటివ్‌ వైబ్రేషన్స్‌ కలిగాయి. ఈ చిత్రంలో నటనకు స్కోప్‌ ఉన్న దర్శన పాత్ర చేశాను.  గీతా ఆర్ట్స్‌ వంటి బ్యానర్‌లో సినిమా చేయడం కంఫర్ట్‌గా అనిపించింది. ప్రస్తుతం తమిళంలో ఓ సినిమా, హిందీలో ఓ సినిమా చేస్తున్నాను. తెలుగులో చర్చలు జరుగుతున్నాయి’’ అన్నారు.

మరిన్ని వార్తలు