Kiran Korrapati Talk About Varun Tej Ghani Movie Deets Here - Sakshi
Sakshi News home page

Ghani Director: అందుకు నిర్మాతలు ఒప్పుకోలేదు: కిరణ్‌ కొర్రపాటి

Published Tue, Apr 5 2022 8:35 AM

Kiran Korrapati Talk About Varun Tej Ghani Movie - Sakshi

‘‘ప్రజలపై సినిమాల ప్రభావం ఉంటుందని నమ్ముతాను. అందుకే నేను డైరెక్షన్‌ చేసే సినిమాల్లో సామాజిక అంశాలను ప్రస్తావిస్తాను. ‘గని’లో కూడా కొన్ని అంశాలను చూపించే ప్రయత్నం చేశాను’’ అని కిరణ్‌ కొర్రపాటి అన్నారు. వరుణ్‌ తేజ్‌ హీరోగా రూపొందిన ‘గని’ చిత్రంతో కిరణ్‌ కొర్రపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అల్లు అరవింద్‌ సమర్పణలో అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 8న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు కిరణ్‌ చెప్పిన విశేషాలు. 

∙చెన్నైలో మా నాన్నగారు (సీనియర్‌ జర్నలిస్ట్‌ కె. వెంకటేశ్వర రావు)తో కలిసి సినిమా ప్రివ్యూ షోస్‌కి వెళ్లేవాడిని. అక్కడి వాతవారణం, సినిమాలు నాకు బాగా నచ్చేవి. సినిమాల పట్ల నాకు ఉన్న ఆసక్తిని గమనించి నాన్నగారు ప్రోత్సహించారు. చెన్నై నుంచి హైదరాబాద్‌ వచ్చిన తర్వాత దర్శకుడిగా కెరీర్‌ను స్టార్ట్‌ చేయాలనుకున్నాను. దర్శకులు వీవీ వినాయక్,  శ్రీను వైట్ల, హరీష్‌ శంకర్, వెంకీ అట్లూరి దగ్గర దర్శకత్వ శాఖలో చేశాను. అలాగే రవితేజగారు హీరోగా నటించిన ఓ నాలుగు చిత్రాలకు దర్శకత్వ శాఖలో చేశాను. ‘మిస్టర్‌’ (వరుణ్‌ తేజ్‌ హీరోగా నటించిన చిత్రం) సినిమాకు వర్క్‌ చేసిన సమయంలో వరుణ్‌ తేజ్‌కు ‘గని’ కథ చెప్పాను. ఆ తర్వాత ‘తొలిప్రేమ’ షూటింగ్‌ చివరి రోజు కిరణ్‌తో సినిమా చేస్తున్నట్లుగా చెప్పారట వరుణ్‌. అలా ‘గని’ సినిమా సెట్‌ అయ్యింది. 

జీరో టు హీరో 
సాధారణంగా స్పోర్ట్స్‌ డ్రామా సినిమాల్లో జీరోలో ఉన్న ఓ వ్యక్తి హీరో కావడం అన్నట్లుగా కథ ఉంటుంది. ‘గని’ చిత్రంలోనూ ఇదే పాయింట్‌. కానీ ‘గని’ క్యారెక్టర్‌ ఏంటి? అతని ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు? అనే అంశాలు ఆసక్తికరంగా ఉంటాయి. మదర్‌ సెంటిమెంట్‌ బాగుంటుంది. ‘గని’లో మంచి లవ్‌ ట్రాక్‌ కూడా ఉంది.

నిర్మాతలు ఒప్పుకోలేదు
స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌ మూవీ అంటే హీరో సిక్స్‌ప్యాక్‌తో ఉండాలి. ఈ సిక్స్‌ప్యాక్‌ బాడీ షేప్‌ను హీరో ఆరు నెలలు మెయిన్‌టైన్‌ చేస్తే చాలు. కానీ కరోనా వల్ల ‘గని’ షూటింగ్‌ చాలాసార్లు వాయిదా పడటంతో దాదాపు మూడేళ్లు ఒకే ఫిజిక్‌ను వరుణ్‌ మెయిన్‌టైన్‌ చేయాల్సి వచ్చింది. ఇది చాలా కష్టం. ఇక బాక్సింగ్‌ ఎపిపోడ్స్‌ చిత్రీకరణ సమయంలో సెట్స్‌లో దాదాపు 500 మందిని మేనేజ్‌ చేయడం ఓ పెద్ద టాస్క్‌. అలాగే కమర్షియల్‌ అంశాలను జోడిస్తూ బాక్సింగ్‌ నేపథ్యానికి ఆడియన్స్‌ను కనెక్ట్‌ చేసేలా కథను రెడీ చేయడం కోసం నన్ను నేను చాలెంజ్‌ చేసుకున్నాను. అవుట్‌పుట్‌ బాగా వచ్చింది. ‘గని’ రిలీజ్‌ దాదాపు ఏడుసార్లు వాయిదా పడింది. దీంతో గత ఏడాది నవంబరులో సినిమాను ఓటీటీకి ఇస్తే నాకు ఏ ప్రాబ్లమ్‌ లేదని చెప్పాను. కానీ ఇందుకు నిర్మాతలు ఒప్పుకోలేదు. వరుణ్‌ తేజ్, అల్లు బాబీ, సిద్ధు ముద్దగార్లు చాలా సపోర్ట్‌ చేశారు.  

తర్వాతి సినిమాలు
నిర్మాతగా వరుణ్‌ తేజ్‌ నాకు అడ్వాన్స్‌ ఇచ్చారు. పుల్లారావు, భగవాన్‌ బేనర్లో, చెరుకూరి సుధాకర్‌ బ్యానర్లలో సినిమాలు కమిటయ్యాను.  

Advertisement
Advertisement