డ్రగ్స్‌ కేసులు..పబ్బు గొడవలు.. వివాదాలకు కేంద్ర బిందువుగా హీరో నవదీప్‌!

24 Sep, 2023 14:39 IST|Sakshi

నవదీప్‌.. తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరితమైన వ్యక్తి. జై సినిమాతో హీరోగా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన ఈ టాలెంటెడ్‌ నటుడు..  వరుస ప్రేమ కథా చిత్రాల్లో నటించి లవర్‌ బాయ్‌గా గుర్తింపు పొందాడు. అయితే సినిమాల కంటే ఎక్కువగా వివాదాలతోనే పాపులర్‌ అయ్యాడు నవదీప్‌. డ్రగ్స్‌ కేసులు..పబ్బు గొడవలు అంటూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. 

మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో ఏ-29గా నవదీప్‌
ఇటీవల హైదరాబాద్‌ మాదాపూర్‌లోని విఠల్‌నగర్‌ ఫ్రెష్‌ లివింగ్‌ అపార్ట్‌మెంట్‌లో డ్రగ్స్‌ వ్యవహారంతో మరోమారు నవదీప్‌ పేరు తెరపైకి వచ్చింది. ఈ కేసులో పట్టుబడిన రామ్‌చంద్‌ ఇచ్చిన సమాచారం మేరకే హీరో నవదీప్‌పై కేసు నమోదైంది. నవదీప్ కు డ్రగ్స్ ముఠా తో సంబంధం ఉందని, అతను సైతం ఈ కేసులో నిందితుడిగా ఉన్నట్లు సీపీ, టీఎస్‌ఎన్‌ఏబీ డైరెక్టర్‌ సీవీ ఆనంద్‌ ప్రకటించారు. రిమాండ్‌ రిపోర్ట్‌లో ఏ 29 గా నవదీప్‌ని చేర్చారు. నిన్న విచారణకు కూడా హాజరయ్యాడు. 

విచారణ కొత్తేమి కాదు
డ్రగ్స్‌ ఆరోపణలు ఎదుర్కోవడం నవదీప్‌కు కొత్తేమి కాదు. 2017లో టాలీవుడ్‌ను కుదిపేసిన డ్రగ్స్‌ వ్యవహారంలోనూ నవదీప్‌ విచారణ ఎదుర్కొన్నాడు. నవదీప్‌తో పాటు రవితేజ‌, ఛార్మీ, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, రానా, పూరి జ‌గ‌న్నాధ్‌, న‌వ‌దీప్, త‌రుణ్‌, త‌నీష్‌, సుబ్బ‌రాజు, ముమైత్ ఖాన్ సహా పలువురు సెలబ్రిటీలను అధికారులు విచారించారు. అప్పట్లో నవదీప్‌ పేరే అందరికంటే ఎక్కువగా వినిపించింది.

వివాదాలకు కేంద్రబిందువుగా నవదీప్‌
సినిమాల కంటే ఎక్కువగా వివాదాలతోనే వార్తల్లో నిలుస్తుంటాడు నవదీప్‌. డ్రగ్స్‌ ఆరోపణలే కాదు.. పబ్‌ గొడవలు.. విద్యార్థులపై దాడి..తదితర ఆరోపణలు కూడా నవదీప్‌పై ఉన్నాయి. 2011లో స్నేహితులతో కలిసి అనుమతి లేకుండా నాగార్జున సాగర్‌లో పడవ ప్రయాణం చేశాడు. ఈ విషయంపై అప్పట్లో నవదీప్‌పై కేసు కూడా నమోదైంది.

అదే ఏడాది హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్లో కొంతమంది ఇంజనీరింగ్‌ విద్యార్థులతో నవదీప్‌ గొడవపడ్డాడు. ఓ విద్యార్థిపై దాడి కూడా చేశాడు. ఈ గొడవ విషయంలోనూ మాదాపూర్‌ ఠాణాలో నవదీప్‌పై కేసు నమోదైంది. గతంలో బంజారాహిల్స్‌లో అతివేగంగా వాహనం నడుపుతూ పోలీసుకులకు పట్టుపట్టాడు. ఆ సమయంలో పోలీసులతో అనుచితంగా వ్యవహరించడంతో కేసు నమోదు చేశారు. ఇప్పుడు రెండోసారి డ్రగ్స్‌ కేసు విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. 

మరిన్ని వార్తలు