‘గాడ్‌ ఫాదర్‌’ విజయంపై నాగబాబు స్పందన.. కోహినూర్‌ వ్యాల్యూ తగ్గదని ట్వీట్‌

7 Oct, 2022 14:13 IST|Sakshi

ఎట్టకేలకు మెగాస్టార్‌ చిరంజీవి హిట్‌ కొట్టాడు.  తమ అభిమాన హీరో సినిమా బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షాన్ని కురిపించాలని చాలా కాలంగా మెగాస్టార్‌ అభిమానులు కోరుకుంటున్నారు.  చిరు టైటిల్‌ పాత్రలో నటించిన సైరా, ఆచార్య చిత్రాలు ఆశించిన స్థాయిల్లో విజయాన్ని అందుకోలేకపోయాయి. దీంతో మెగా అభిమానులు కాస్త నిరాశ చెందారు. ముఖ్యంగా ఆచార్య ఫలితాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఇలాంటి తరుణంలో ‘గాడ్‌ ఫాదర్‌’తో భారీ హిట్‌ ఇచ్చాడు ‘అన్నయ్య’. ప్రస్తుతం ఈ చిత్రం బాక్సాఫీస్‌ దూసుకెళ్తోంది.

దసరా సందర్భంగా అక్టోబర్‌ 5న విడుదలైన ఈ చిత్రం.. తొలిరోజే రూ. 38 కోట్లు కలెక్ట్‌ చేసింది. రెండు రోజుల్లో రూ.69 కోట్ల గ్రాస్‌ వసూళ్లను రాబట్టి మెగాస్టార్‌ సత్తా ఏంటో మరోసారి ప్రపంచానికి తెలియజేసింది. చాలా కాలం తర్వాత చిరంజీవి భారీ విజయం సాధించడంతో మెగా అభిమానులతో పాటు మెగా బ్రదర్‌ నాగబాబు కూడా ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. ట్విటర్‌ వేదికగా ‘గాడ్‌ ఫాదర్‌’ విజయంపై స్పందిస్తూ చింజీవిని కొహినూర్‌ డైమాండ్‌తో పోల్చాడు. 

(చదవండి: బాక్సాఫీస్‌పై ‘గాడ్‌ ఫాదర్‌’ దండయాత్ర..రెండో రోజూ భారీ కలెక్షన్స్‌)

‘కోహినూర్ డైమండ్ కూడా కొన్నిసార్లు పాలీష్‌ తగ్గితే మెరుపు తగ్గొచ్చు కానీ దాని వాల్యూ ఎప్పుడు తగ్గదు .సరైన పాలీష్‌ (గాడ్ ఫాదర్ )పడితే కోహినూర్ డైమండ్ మిరుమిట్లు కొలిపే వెలుగు ని తట్టుకోవటం కష్టం’అంటూ నాగబాబు ట్వీట్‌ చేశాడు. 

మలయాళ మూవీ ’లూసీఫర్’కు తెలుగు రీమేకే ‘గాడ్‌ ఫాదర్‌’. మోహన్‌ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సల్మాన్‌ ఖాన్, నయనతార, సత్యదేవ్‌ ఇతర కీలక పాత్రల్లో నటించారు. కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్‌బీ చౌదరి, ఎన్‌వీ ప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందించారు. 

మరిన్ని వార్తలు