Tollywood Top 4 Upcoming Movies RRR, Acharya, F3, And Sarkaru Vaari Paata New Release Dates - Sakshi
Sakshi News home page

Tollywood Upcoming Movies: తీపి కబురు.. పెద్ద సినిమాల కొత్త రిలీజ్‌ డేట్స్‌ ఇవే!

Published Tue, Feb 1 2022 8:52 AM

New Release Dates of RRR, Acharya, F3, Sarkaru Vaari Paata - Sakshi

మంచిది.. ఇలా కదా చేయాల్సింది.. మంచిది... ఇది కదా జరగాల్సింది. మంచిది... ఇంత ఫ్రెండ్లీగా కదా ఉండాల్సింది. సోమవారం కొన్ని మంచి విషయాలను మోసుకొచ్చింది. టాలీవుడ్‌ పెద్ద నిర్మాతలందరూ మంచి నిర్ణయం తీసుకున్న కబురు తెచ్చింది. పెద్ద సినిమాలు క్లాష్‌ కాకుండా.. నిర్మాతలు సినిమాల రిలీజ్‌ డేట్స్‌ని డిసైడ్‌ చేశారు. సోమవారం ముందు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రిలీజ్‌ డేట్‌ ప్రకటన వచ్చింది. ఆ తర్వాత మిగతా సినిమాల రిలీజ్‌ డేట్స్‌ వచ్చాయి. నిర్మాతలు డిసైడ్‌ అయి, ఇలా విడుదల తేదీలు చెప్పడంతో ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. ఇక రిలీజ్‌ ‘డేట్‌ లాక్‌’ చేసుకున్న సినిమాల డేటా తెలుసుకుందాం.

ప్రపంచవ్యాప్తంగా ‘రౌద్రం.. రుధిరం.. రణం’ (ఆర్‌ఆర్‌ఆర్‌) సినిమా గురించి సినీ లవర్స్‌ ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పలుమార్లు రిలీజ్‌ వాయిదా పడిన ఈ భారీ పాన్‌ ఇండియా చిత్రాన్ని మార్చి 18 లేదా ఏప్రిల్‌ 28న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఇటీవల ప్రకటించింది. కానీ జనవరి 31 (సోమవారం) ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కొత్త రిలీజ్‌ డేట్‌ను ప్రకటించి, స్వీట్‌ షాక్‌ ఇచ్చింది. ఈ సినిమాను మార్చి 25న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ‘బాహుబలి’ వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీ తర్వాత రాజమౌళి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఇందులో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలు. 

స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీమ్‌ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్‌ నటించారు. కొన్ని కల్పిత అంశాలకు స్నేహం, భావోద్వేగాలను మిళితం చేసి ఈ చిత్రాన్ని రూపొందించినట్లు ఇటీవల రాజమౌళి చెప్పారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా దాదాపు పద్నాలుగు భాషల్లో (విదేశీ భాషలతో కలిపి) విడుదల కానుంది. ఇక ధర్మస్థలి పోరాటాన్ని వెండితెరపై చూసే సమయం ఎప్పుడో తెలిసిపోయింది. చిరంజీవి హీరోగా, రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘ఆచార్య’ చిత్రం ధర్మస్థలి అనే విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. చిరంజీవి సరసన కాజల్‌ అగర్వాల్, చరణ్‌కు జోడీగా పూజా హెగ్డే కనిపిస్తారు. ఏప్రిల్‌ 29న ‘ఆచార్య’ను విడుదల చేస్తున్నట్లుగా చిత్రబృందం సోమవారం ప్రకటించింది. రామ్‌చరణ్, నిరంజన్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.

మరోవైపు 2022లో ముందుగానే రిలీజ్‌ డేట్‌ను ప్రకటించిన చిత్రాల జాబితాలో మహేశ్‌బాబు ‘సర్కారువారి పాట’ ముందు వరుసలో ఉంది. ఈ సినిమాను ఈ ఏడాది జనవరి 13న రిలీజ్‌ చేయాలనుకున్నారు. కానీ కుదర్లేదు (అప్పుడు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విడుదల జనవరి 7కి షెడ్యూలైన కారణంగా ‘సర్కారువారి పాట’ చిత్రాన్ని ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ కోరిన మేరకు వాయిదా వేసుకున్నారు). ఆ తర్వాత ఏప్రిల్‌ 1న ‘సర్కారువారి పాట’ను రిలీజ్‌ చేయనున్నట్లు ఈ చిత్రనిర్మాతలు నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్, గోపీ ఆచంట, రామ్‌ ఆచంట తెలిపారు. అయితే ఏప్రిల్‌ 1కి షెడ్యూల్‌ అయిన ఈ చిత్రం ఆ తేదీకి రావడంలేదు. మే 12న  విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు తాజాగా ప్రకటించారు. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేశ్‌ కథానాయిక.

ఇటు మేం ఎప్పుడు వస్తే అప్పుడే నవ్వుల పండగ అని ‘ఎఫ్‌ 3’ టీమ్‌ చెబుతూనే ఉంది. ఏప్రిల్‌ 28న ప్రేక్షకులను నవ్వించాలని ఈ సినిమా టీమ్‌ ఇటీవల డిసైడ్‌ అయింది. అయితే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘ఆచార్య’ వంటి సినిమాల కొత్త విడుదల తేదీలు తెరపైకి వచ్చిన నేపథ్యంలో ‘ఎఫ్‌ 3’ సినిమా విడుదలలో ఏమైనా మార్పు ఉంటుందా? అనే అనుమానాలను పటాపంచలు చేస్తూ ఈ సినిమాను ఏప్రిల్‌ 28నే విడుదల చేయనున్నట్లు అనౌన్స్‌ చేశారు. వెంకటేశ్, వరుణ్‌ తేజ్, తమన్నా, మెహరీన్‌ హీరో హీరోయిన్లుగా, రాజేంద్రప్రసాద్‌ ఓ కీలక పాత్రలో అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్‌ 2’ మంచి విజయాన్ని సాధించింది. ‘దిల్‌’ రాజు నిర్మించారు. ఇక ‘ఎఫ్‌ 3’ గ్యాంగ్‌లో సునీల్, సోనాలీ చౌహాన్‌ కూడా చేరారు. ‘దిల్‌’ రాజు సమర్పణలో శిరీష్‌ ‘ఎఫ్‌ 3’ సినిమాను నిర్మించారు.

మరోవైపు పవన్‌ కల్యాణ్, రానా హీరోలుగా రూపొందుతున్న చిత్రం ‘భీమ్లానాయక్‌’. సాగర్‌ కె. చంద్ర దర్శకుడు. ఈ ఏడాది జనవరి 12న విడుదల కావాల్సిన ఈ చిత్రం ఫిబ్రవరి 25కి వాయిదా పడింది. అయితే సోమవారం కొన్ని చిత్రాల రిలీజ్‌ డేట్స్‌ ప్రకటనలు వచ్చిన నేపథ్యంలో తమ సినిమా రిలీజ్‌ను కూడా ‘భీమ్లానాయక్‌’ టీమ్‌ ప్రకటించింది. ‘‘మా చిత్రాన్ని ఫిబ్రవరి 25న రిలీజ్‌ చేస్తాం.. ఒకవేళ పరిస్థితులు సహకరించకపోతే ఏప్రిల్‌ 1న చిత్రం థియేటర్స్‌కు వస్తుంది’’ అని చిత్రనిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు. కోవిడ్‌ సృష్టించిన అయోమయ పరిస్థితుల కారణంగా సినిమాల విడుదలలు  వాయిదా పడుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇలా ఒకేసారి పెద్ద చిత్రాల విడుదల తేదీలు ఖరారు కావడం సినిమాని నమ్ముకున్న అందరికీ తీపి కబురులాంటిది.

విడుదల తేదీలు
ఆర్‌ఆర్‌ఆర్‌ – మార్చి 25
ఆచార్య – ఏప్రిల్‌ 29 
ఎఫ్‌ 3 – ఏప్రిల్‌ 28 
సర్కారువారి పాట – మే 12
భీమ్లా నాయక్‌ – ఫిబ్రవరి 25 
లేదా ఏప్రిల్‌ 1

డేట్‌ డిబేట్‌
ఇక మరికొన్ని పెద్ద సినిమాల రిలీజ్‌ డేట్స్‌ గురించి డిబేట్స్‌ (చర్చలు) జరుగుతున్నాయని తెలిసింది. ఈ జనవరి 14న విడుదల కావాల్సిన ప్రభాస్‌ ‘రాధేశ్యామ్‌’ థియేటర్స్‌కు రాలేదు. మార్చి 11న ఈ చిత్రం విడుదల కానుందన్నది లేటెస్ట్‌ టాక్‌. రాధాకృష్ణకుమార్‌ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్, ప్రసీద ఈ చిత్రాన్ని నిర్మించారు. అలాగే వరుణ్‌ తేజ్‌ చేసిన ‘గని’ని మార్చి 18న విడుదల చేయనున్నట్లు ఇటీవల ప్రకటించారు. అయితే అనుకున్న సమయానికంటే ముందుగానే అంటే ఫిబ్రవరిలోనే విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారట చిత్రనిర్మాతలు అల్లు బాబీ, సిద్ధు ముద్ద.

అలాగే శర్వానంద్‌ ‘ఆడవాళ్ళు మీకు జోహోర్లు’ను ఫిబ్రవరి 25న రిలీజ్‌ చేయనున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఆ తేదీకి ‘భీమ్లా నాయక్‌’ వస్తే, ‘ఆడవాళ్ళు...’ సినిమా రిలీజ్‌ డేట్‌ మారొచ్చు. అలాగే ఏప్రిల్‌ 29న నితిన్‌ ‘మాచర్ల నియోజకవర్గం’ విడుదల కావాల్సింది. కానీ తాజా విడుదల తేదీల ఖరారు దృష్ట్యా ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ (‘ఆచార్య’, ‘ఎఫ్‌ 3’ రిలీజ్‌ కారణంగా) మారే చాన్స్‌ ఉంది. అలాగే మరికొన్ని సినిమాల రిలీజ్‌ డేట్స్‌పై నిర్మాతల మధ్య సానుకూల వాతావరణంలో డేట్‌ డిబేట్‌ జరుగుతోంది.

Advertisement
Advertisement