Payal Ghosh: తారక్‌ గురించి అప్పుడే చెప్పా, టాలీవుడ్‌ బాలీవుడ్‌ను బీట్‌ చేయడం ఖాయం!

12 Feb, 2022 14:39 IST|Sakshi

టాలీవుడ్‌ రేంజ్‌ పెరిగింది. పాన్‌ ఇండియా సినిమాలు తీస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. తెలుగు హీరోలకు ఇప్పుడు దేశవ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డాడు. అంతేకాదు, ఇక్కడి హీరోలతో కలిసి నటించేందుకు బాలీవుడ్‌ హీరోలే కాదు హీరోయిన్లు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవల ఆలియా భట్‌ అల్లు అర్జున్‌తో కలిసి నటించాలని ఉందన్న కోరికను బయటపెట్టిన విషయం తెలిసిందే! ఈ వార్త సెన్సేషన్‌ అవుతున్న క్రమంలో స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొణె సైతం టాలీవుడ్‌ హీరోతో నటించాలని ఉందని చెప్పుకొచ్చింది. జూనియర్‌ ఎన్టీఆర్‌ సరసన నటించే ఛాన్స్‌ వస్తే అస్సలు వదులుకోనని చెప్పింది.

ఈ కామెంట్స్‌పై ఊసరవెల్లి నటి పాయల్‌ ఘోష్‌ స్పందించింది. 'తారక్‌తో కలిసి పనిచేసేందుకు బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్‌ క్యూ కడుతున్నారు. నేను ఈపాటికే ఊసరవెల్లి సినిమాలో అతడితో కలిసి నటించినందుకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. మా సినిమా ఖ్యాతి గురించి చర్చిస్తారని నేను 2020 సంవత్సరంలోనే చెప్పాను. కానీ అప్పుడు నన్ను చాలా విమర్శించారు. ఇప్పుడు మరోసారి చెప్తున్నా.. త్వరలోనే దక్షిణాది చిత్రపరిశ్రమ బాలీవుడ్‌ను కైవసం చేసుకుంటుంది. అసభ్య పదజాలం, అభ్యంతరకర సన్నివేశాలను ఇకనైనా చూపించడం మానేయకపోతే బాలీవుడ్‌ అంతం కాక తప్పదు. అయినా బాలీవుడ్‌ కథ ఎప్పుడో ముగిసిందిలే' అని వరుస ట్వీట్లు చేసింది. ఇక మరో ట్వీట్‌లో జూనియర్‌ ఎన్టీఆర్‌పై పొగడ్తల వర్షం కురిపించింది. 'తారక్‌ గ్లోబల్‌ స్టార్‌, ఓ ఉన్నతమైన వ్యక్తి, అంతకు మించి ఆల్‌రౌండర్‌ సూపర్‌ స్టార్‌.. ఇవన్నీ చెప్తుంటే నన్ను నిందించారు. కానీ నేను అతడివైపే నిలబడి ఉన్నాను. ఈ రోజు నేను చెప్పిందే నిజమైంది' అని పేర్కొంది.

మరిన్ని వార్తలు