ఆయనకి జాతీయ అవార్డు రావాలి

8 Mar, 2021 01:59 IST|Sakshi
హరీష్, సాహు, అనిల్‌ రావిపూడి, రాజేంద్రప్రసాద్, రామ్, శ్రీవిష్ణు, లవ్‌లీ, అనీష్‌

– రామ్‌

‘‘మా స్రవంతి మూవీస్‌ బ్యానర్‌ స్టార్ట్‌ అయిందే రాజేంద్రప్రసాద్‌గారి ‘లేడీస్‌ టైలర్‌’ సినిమాతో.  ఆయన పేరు ముందు ఏ బిరుదు పెట్టినా అది చిన్నదే అవుతుంది. ‘గాలి సంపత్‌’ సినిమాతో ఆయనకు జాతీయ అవార్డు రావాలి.. వస్తుందనుకుంటున్నా’’ అని హీరో రామ్‌ అన్నారు. శ్రీ విష్ణు, లవ్‌లీ సింగ్‌ జంటగా రాజేంద్ర ప్రసాద్‌ టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘గాలి సంపత్‌’. అనీష్‌ దర్శకత్వం వహించారు. డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి సమర్పణలో ఎస్‌.కృష్ణ, హరీశ్‌ పెద్ది, సాహు గారపాటి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్‌ వేడుకలో రామ్‌ మాట్లాడుతూ–‘‘గాలి సంపత్‌’ ట్రైలర్‌ చూశాక రాజ్‌కుమార్‌ హిరాణీ చిత్రంలా అనిపించింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో బెస్ట్‌ కమర్షియల్‌ డైరెక్టర్‌ అనిల్‌’’ అన్నారు.

రాజేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ– ‘‘జీవితంలో నన్ను నటుడిగా నిలబెట్టిన మొదటి సినిమా ‘లేడీస్‌ టైలర్‌’ స్రవంతి మూవీస్‌దే.. ఆ సినిమా లేకుంటే ఇవాళ నేను ఇక్కడ లేను. ‘గాలి సంపత్‌’ నా జీవితంలో ఒక ఆణిముత్యం’’ అన్నారు. ‘‘ఈ సినిమా కథ ఆసక్తిగా అనిపించింది’’ అన్నారు నిర్మాత ‘దిల్‌’ రాజు.  ‘‘తండ్రీ కొడుకుల మధ్య సాగే ఫన్‌ అండ్‌ ఎమోషన్‌ జర్నీ ‘గాలి సంపత్‌’’ అన్నారు అనీష్‌. ‘‘మా ‘గాలి సంపత్‌’ చూస్తున్నప్పుడు  కన్నీళ్లు పెట్టుకుంటారు’’ అన్నారు నిర్మాతల్లో ఒకరైన రామ్‌. ‘‘హీరో రామ్‌గారితో పాటు సాహు, హరీష్‌గార్లతో ఓ సినిమా చేయాలనుకుంటున్నాను’’ అన్నారు అనిల్‌ రావిపూడి. ‘‘నేనెప్పుడూ నా క్యారెక్టర్‌ చూసి సినిమాలు చేయను.. కథ చూసి చేస్తా’’ అన్నారు శ్రీవిష్ణు. ఈ కార్యక్రమంలో లవ్‌లీ సింగ్, కెమెరామెన్‌ సాయి శ్రీరామ్, సంగీత దర్శకుడు అచ్చురాజమణి, దర్శకులు గోపీచంద్‌ మలినేని, బీవీఎస్‌ రవి, శివ నిర్వాణ పాల్గొన్నారు.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు