Ravi Brahma Teja Talk About Dharmavarapu Subramanyam Death - Sakshi
Sakshi News home page

Dharmavarapu Subramanyam: నాన్న చనిపోతే వాళ్లు తప్ప ఎవరూ చూసేందుకు రాలేదు.. కమెడియన్‌ కొడుకు

Published Thu, Apr 27 2023 9:58 AM

Ravi Brahma Teja About Dharmavarapu Subramanyam Death - Sakshi

కామెడీలో కొత్త ఒరవడి సృష్టించిన వ్యక్తి ధర్మవరపు సుబ్రహ్మణ్యం. చిన్న, పెద్ద తేడా లేకుండా అన్ని సినిమాల్లోనూ నటించేవారు. తానొక స్టార్‌ కమెడియన్‌ అయినా సరే, ఎప్పుడూ పారితోషికం డిమాండ్‌ చేసేవారు కాదట, నిర్మాతలు ఎంతిస్తే అంత తీసుకునేవారట. ఆయన మంచితనాన్ని అలుసుగా తీసుకుని కొందరు నిర్మాతలు డబ్బు ఎగ్గొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయని ఆనాటి క్షణాలను గుర్తు చేసుకున్నాడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం తనయుడు రవి బ్రహ్మ తేజ.

తాజాగా రవి బ్రహ్మ తేజ మాట్లాడుతూ.. 'మా నాన్న మంచితనాన్ని అలుసుగా తీసుకుని మోసం చేసిన నిర్మాతలు ఇప్పుడు కష్టాలు అనుభవిస్తున్నారు. అప్పుడు నిజాయితీగా వ్యవహరించి ఉంటే వారి బతుకులు బాగుండేవి. వెండితెరపై అనేక పాత్రలు పోషించిన నాన్న 2013లో చనిపోయారు. ఆయన పార్థివదేహం ఇంట్లో ఉన్నప్పుడు తనను చివరి చూపు చూసేందుకు మూవీ మొఘల్‌ రామానాయుడు, హీరో గోపీచంద్‌, రాజేంద్రప్రసాద్‌, అలీ, వేణుమాధవ్‌ సహా తదితరులు వచ్చారు. కానీ మెగా ఫ్యామిలీ నుంచి ఎవరూ చూసేందుకు రాలేదు. వచ్చేందుకు ప్రయత్నించారట, కానీ వీలు కాలేదని తెలిసింది. ఇకపోతే నాన్న ముందస్తుగా మాకేమీ చెప్పలేదు కాబట్టి ఆయన పార్థివ దేహాన్ని ఫిలిం ఛాంబర్‌కు పంపించలేదు. మా ఇంటి నుంచి నాన్న పార్థివ దేహాన్ని ఊరికి తీసుకెళ్లి అక్కడే అంత్యక్రియలు నిర్వహించాం' అని చెప్పుకొచ్చాడు.

కాగా 1954లో జన్మించిన ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఎన్నో సినిమాల్లో కమెడియన్‌గా నవ్వులు పూయించారు. మరీ ముఖ్యంగా లెక్చరర్‌ పాత్రల్లో తను పండించే కామెడీకి ప్రేక్షకులు పొట్ట చెక్కలయ్యేలా నవ్వేవారు. స్టార్‌ కమెడియన్‌గా రాణించిన ఆయన కాలేయ క్యాన్సర్‌తో 2013 డిసెంబర్‌ 7న కన్నుమూశారు.

చదవండి: సాయిధరమ్‌ తేజ్‌ నాకు ఫోన్‌ నెంబర్‌ ఇవ్వలేదు, కలవలేదు: అబ్దుల్‌
ఓటీటీలోకి వచ్చేసిన దసరా

Advertisement
Advertisement