‘క్యా కెహ్నా’ షూటింగ్‌లో ప్రమాదం, సైఫ్‌ అలీఖాన్‌ గాయానికి 100 కుట్లు

19 May, 2021 21:24 IST|Sakshi

సైఫ్‌ అలీ ఖాన్‌, ప్రీతి జింటా జంటగా నటించిన తొలి చిత్రం ‘క్యా కెహ్నా’. 2000 సంవత్సరం మే 19న విడుదలైన ఈ మూవీలో సైఫ్‌ ప్లేబాయ్‌గా కనిపించగా, ప్రీతి జింటా పెళ్లి కాకుండా టీనేజీలోనే తల్లి అవుతుంది. డైరెక్టర్‌ కుందన్‌ షా తెరకెక్కించిన ఈ చిత్రం విడుదలై నేటికి 21 ఏళ్లు. ఈ సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అయితే విడుదలకు ముందే ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న ఈ మూవీ బాక్సాఫీసు వద్ద సూపర్‌ హిట్‌గా నిలిచింది. కాగా ఈ మూవీ షూటింగ్‌ సమయంలో హీరో సైఫ్‌ ప్రమాదానికి గురై కొన్ని రోజుల పాటు హాస్పిటల్‌లోనే ఉండాల్సి వచ్చిందట.

ఈ ప్రమాదంలో సైఫ్‌ తలకు గాయమవడంతో దాదాపు 100 కుట్లు పడినట్లు కాఫీ విత్‌ కరణ్‌ జోహార్‌ షోలో ప్రీతి జింటా వెల్లడించింది. 2004లోని కాఫీ విత్‌ కరణ్‌ జోహార్‌ మొదటి సీజన్‌కు సైఫ్‌, ప్రీతిలు అతిథిలుగా హాజరయ్యారు. ఈ షోలో ‘క్యా కెహ్నా’ షూటింగ్‌లో జరిగిన ప్రమాదాన్ని గుర్తు చేసుకున్నారు. 

ఈ సందర్భంగా సైఫ్‌ మాట్లాడుతూ.. ‘జూహులోని ఓ పార్కు సమీపంలో సీన్‌ రీహార్సల్‌ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పాడు .‘ ప్రీతిని ఫ్లట్‌ చేసే సన్నివేశం అది. నా మోటరు సైకిల్‌తో స్టంట్స్‌ చేస్తూ ఆమెను ఇంప్రెస్‌ చేయాలి. అలా ఫస్ట్‌ టైం బాగానే వచ్చింది. ఇక రెండవ సారి ఫుల్‌ జోష్‌లో బైక్‌ను ర్యాంప్‌ చేస్తుండగా బైక్‌ స్కిడ్‌ అయ్యింది. అయితే ఆ రోజు ఫుల్‌ వర్షం, నేలంతా బురదగా ఉండేసరికి ఈ ప్రమాదం జరిగింది. బైక్‌ స్కిడ్‌ కాగానే నేను గాల్లోకి ఎగిరి నేరుగా ఓ రాతిపై పడ్డాను. అలా బౌన్స్‌ అవుతూ పలుమార్లు కింద పడ్డాను. ఈ క్రమంలో నా తలకు పెద్ద గాయమై రక్తస్రావం అవ్వడం చూశాను. ఆ తర్వాత కళ్లు తిరిగి పడిపోయాను’ అని చెప్పుకొచ్చాడు.

ఇక తర్వాత ప్రీతి జింటా మాట్లాడుతూ.. ‘ఆ రోజు డైరెక్టర్‌కు జ్వరంగా ఉండటంతో సెట్‌కి రాలేదు. సైఫ్‌ భార్య అమృత సింగ్‌ కూడా ఆ సమయంలో ముంబైలో లేరు. ఇక ప్రమాదం జరగానే ఆయన స్నేహితుడికి ఫోన్‌ చేశాను కానీ అతడు నమ్మలేదు, మేము జోక్‌ చేశామనుకుని ఫోన్‌ పెట్టేశాడు. నేను మాత్రమే అక్కడ ఉండటంతో వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లాను. హాస్పిటల్‌లో గార్డియన్‌గా నేను సంతకం చేశాను’ అని తెలిపింది. ఆ తర్వాత ఒకవేళ సైఫ్‌ మరణిస్తే ఏంటి పరిస్థితి అని తను పిచ్చిగా ఆలోచించానంటూ ఆమె చెప్పింది. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు