Sakshi News home page

Singer B Ramana: వేల పాటలు పాడాను, ఏ అవార్డూ రాలేదు.. ప్రముఖ సింగర్‌

Published Thu, Apr 27 2023 12:29 PM

Singer B Ramana About SP Balasubrahmanyam - Sakshi

'నీదారి పూలదారి.. పోవోయి బాటసారి..', 'రేపటి పౌరులం..', 'ఆకతాయి చిన్నోడు..' ఇలా ఎన్నో హిట్‌ సాంగ్స్‌ పాడారు గాయని బి.రమణ. తెలుగులోనే కాదు దక్షిణాదిలోనూ పలు భాషల్లో పాటలు ఆలపించారు. తన అద్భుత గాత్రంతో ప్రేక్షకులను అలరించారు. సినీ ఇండస్ట్రీకి ఎన్నో మ్యూజికల్‌ హిట్స్‌ ఇచ్చిన ఆమె అన్నమయ్య కీర్తనలు, భక్తి పాటలు సైతం పాడేవారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 'మాది విజయవాడ. చిన్నప్పటి నుంచే పాటలు పాడేదాన్ని. ఎక్కడికి వెళ్లినా ఫస్ట్‌ ప్రైజ్‌ వచ్చేది. రెండో బహుమతికి ఒప్పుకునేదాన్ని కాదు. 

చాలా ఎంకరేజ్‌ చేసేవారు
నా గొంతు బాగుండటంతో సినిమాల్లో పాడే అవకాశాలు వచ్చాయి. ఘంటసాల గారు ఓ సారి నా పాట విని మెచ్చుకుని నాకు ఎక్కువ పారితోషికం ఇవ్వమని సూచించారు. అంతేకాక తనతోపాటు బెంగళూరులో కచేరీకి తీసుకెళ్లారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా ఎంతో ఎంకరేజ్‌ చేసేవారు. చాలా మర్యాద ఇచ్చేవారు. బాలు చనిపోయినప్పుడు నన్ను వెళ్లవద్దని సూచించారు. ఎందుకంటే అది కరోనా సమయం.. పరిస్థితులు బాలేవని బయటకు వెళ్లొద్దన్నారు. కానీ ఆయనను చూడాలని ధృడంగా నిశ్చయించుకున్నాను.

ఏ అవార్డూ రాలేదు
అక్కడికి వెళ్లేసరికి పుట్టెడుమంది జనాలున్నారు. వాళ్లంతా సినిమావాళ్లు కాదు. తమిళులు. నేను రోడ్డుపైనే ఏడ్చుకుంటూ వెళ్లాను. ఎంత నడిచినా ఇంకా దారి అర్థం కాకపోవడంతో నేను కూడా లైన్‌ కట్టి వెళ్లాను. అయ్యో పెద్దావిడ, ఏడ్చి సొమ్మసిల్లేలా ఉందని కొందరు నన్ను ముందుకు పంపించారు. బాలును చూశాక దుఃఖం ఆగలేదు. ఆయనతో కలిసి ఎన్నో డ్యూయెట్‌ సాంగ్స్‌ పాడాను. ఆ గొంతు ఇక మూగబోయిందన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోయాను. ఆ కాలంలో అందరూ నన్ను గౌరవించారు, వెన్నుతట్టి ప్రోత్సహించారు. వారి వల్లే వేల పాటలు పాడాను. కానీ ఇంతవరకు నాకు ఏ అవార్డు రాలేదని ఎప్పుడూ ఫీలవలేదు. సుశీల, జానకి, ఘంటసాల.. ఇలా ఎందరినో కళ్లారా చూస్తే చాలనుకున్నాను, అలాంటిది వారితో కలిసి పాడాను, అదే నాకు దక్కిన పెద్ద గౌరవం, తృప్తి' అని చెప్పుకొచ్చారు గాయని రమణ.

చదవండి: ధర్మవరపు సుబ్రహ్మణ్యంను కడసారి చూసేందుకు మెగా ఫ్యామిలీ నుంచి ఎవరూ రాలేదా?

Advertisement
Advertisement