షార్ట్‌కట్‌ కథలు... వైజాగ్‌ డైరెక్టర్‌ వెండితెర కలలు | Sakshi
Sakshi News home page

షార్ట్‌కట్‌ కథలు... వైజాగ్‌ డైరెక్టర్‌ వెండితెర కలలు

Published Fri, Apr 30 2021 7:02 AM

Special story On Young Director Sumanth Varma - Sakshi

సీతమ్మధార (విశాఖ ఉత్తర): ఆ యువకుడు కలలు కన్నాడు.. అవి సాధించడానికి అహర్నిశలూ కష్టపడ్డాడు. ఓ పక్క చదువు, మరో వైపు రంగుల ప్రపంచం.. చదువు పూర్తయ్యేలోపు తన కలలను తెరపై చూసుకున్నాడు. విజయవంతంగా దూసుకుపోతున్నాడు. దర్శకుడిగా సత్తా చాటాలని, మంచి అవకాశాలను ఒడిసిపట్టుకోవాలని పరితపిస్తున్నాడు విశాఖకు చెందిన భూపతిరాజు సుమంత్‌వర్మ. స్టీట్‌ హర్ట్‌.. బ్రోకెన్‌ హర్ట్‌.. స్టీట్‌ హర్ట్‌ అనే షార్ట్‌ ఫిల్మ్‌తో కెరీర్‌ ప్రారంభించిన సుమంత్‌ తరువాత వరుసగా బాటసారి, జోకర్స్,  సినిమా చూపిస్తా మావా.. బాబూ బఠానీ, కాగితం, అదోరకం, కాస్త క్రేజీగా, ఎవరిదీ ప్రేమ వంటి షార్ట్‌ ఫిల్మ్స్‌తో ఆకట్టుకున్నాడు.

తాజాగా కృష్ణామృతం సినిమాతో అలరించాడు. ఇటీవల ఓటీటీ ప్లాట్‌ఫాంపై విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా దూసుకుపోతోంది. ఈ చిత్రంలో విశాఖ కళాకారులు నటించారు. పక్కాలోకల్‌ మూవీ, యూనివర్సల్‌ సబ్జెక్ట్‌తో ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాలను అలరిస్తోంది. జోకర్‌ షార్ట్‌ఫిల్మ్‌ యూట్యూబ్‌ ప్రాబల్యం అంతగా లేనప్పుడే రెండు లక్షలకు పైగా వ్యూస్‌తో దూసుకుపోయింది. ప్రస్తుతం ‘నా మహారాణి నువ్వే’ అనే చిత్రానికి శ్రీకారం చుట్టారు. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరగుతున్నట్టు సుమంత్‌ వర్మ తెలిపారు. 

డ్యాన్స్‌ అంటే చాలా ఇష్టం 
‘చిన్నతనంలో ఎక్కువ సినిమాలు చూసేవాడ్ని.. డ్యాన్స్‌లంటే పిచ్చి. పాఠశాల, కళాశాలలో ఏ ఫంక్షన్‌ అయినా డ్యాన్స్‌ చేసేవాడ్ని...అయితే ఇంటర్‌ అయ్యాక దర్శకుడిగా మారాలని అను కున్నా.. ఈ రంగంలో బ్యాక్‌గ్రౌండ్‌ అంటూ ఏమీ లేదు. తల్లిదండ్రులు ప్రోత్సాహం తప్ప.. దీంతో డిగ్రీ వరకు చదువుపై శ్రద్ధపెడుతూనే చిన్నచిన్న కథలు రాసుకునేవాడ్ని.. డిగ్రీ కాగానే షార్ట్‌ ఫిల్మ్‌లు తీస్తూ ఆత్మ విశ్వాసం పెంపొందించుకున్నా.. అవి మంచి ఫలితాలు ఇవ్వడంతో వాటిపై పూర్తి దృష్టి పెట్టా..ప్రస్తుతం ఏయూలో ఎంఏ తెలుగు లిటరేచర్‌ చేస్తున్నాను’ అని సుమంత్‌ తెలిపారు.

కుటుంబ నేపథ్యం 
‘నాన్న బోర్డర్‌లో పనిచేసేవారు. అమ్మకు ఆరోగ్యం బాగోలేకపోతే వచ్చేశారు. లారీ డ్రైవర్‌గా పనిచేసేవారు. తరువాత విజయనగరంలోని సత్యాస్‌భారతి ఫౌండేషన్‌లో కొద్దికాలం పనిచేశారు. 2011లో ఆయన మృతి చెందారు. అమ్మ ఆరోగ్య పరిస్థితి బాగులేకపోవడంతో నేను హైదరాబాద్‌ వెళ్లలేకపోయాను. ఇక్కడ ఉంటూ నా కలలను నిజం చేసుకుంటున్నాను’ అని అన్నారు.

టాలీవుడ్‌లో స్థిరపడతా.. 
‘ఎప్పటికైనా టాలీవుడ్‌లో మంచి దర్శకుడిగా పేరు సంపాదించుకోవాలన్నదే నా డ్రీమ్‌. అందుకు ప్లాట్‌ఫారంగా షార్ట్‌ఫిల్మ్‌లను ఎంచుకున్నా.. కృష్ణామృతం సినిమాకు మంచి ఫీడ్‌బ్యాక్‌ వచ్చింది. నేను రాసుకున్న కథలతో కచ్చితంగా టాలీవుడ్‌లో మంచి దర్శకుడిగా నిరూపించుకుంటానని నమ్మకం ఉంది’ అని సుమంత్‌ ముగించారు.

చదవండి: గుడ్డి దెయ్యం కథ చూడలేదు  
హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రభాస్‌.. వైరలవుతోన్న ఫోటోలు

Advertisement
Advertisement