అలీ అడిగితే కాదంటారా!

22 Jan, 2021 11:34 IST|Sakshi

వీకే నరేశ్, అలీ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అందరూ బావుండాలి, అందులో నేనుండాలి’. మలయాళంలో విజయం సాధించిన ‘వికృతి’ చిత్రానికి ఈ సినిమా రీమేక్‌. అలీవుడ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై శ్రీపురం కిరణ్‌ దర్శకత్వంలో అలీ సమర్పణలో బాబా అలీ, మోహన్‌కుమార్‌ కొణతాల నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రాణస్నేహితులు దర్శక-నిర్మాతలు కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి నటిస్తున్నారు. ఈ సందర్భంగా ఇద్దరూ మాట్లాడుతూ.. ‘‘అలీతో 27 ఏళ్ల క్రితం మేం ‘యమలీల’ చిత్రం చేసినప్పుడు ఎలా ఉన్నాడో 1100 చిత్రాల్లో నటించిన తర్వాత కూడా ఏ మాత్రం మార్పు లేకుండా అలానే ఉన్నాడు. అలీ ఫోన్‌ చేసి నేను నిర్మాతగా, హీరోగా సినిమా చేస్తున్నాను.

మీరు నా సినిమాలో చిన్న పాత్ర చేయాలని అడిగాడు. అలీ అడగటం.. మేము కాదనడమా? అందుకే ఓకే అని చక్కని సీన్లో నటించాం’’ అన్నారు. అలీ మాట్లాడుతూ.. ‘‘27 ఏళ్ల క్రితం నాకు ‘రాజేంద్రుడు-గజేంద్రుడు’ చిత్రంలో వేషమిచ్చిన ఈ ఇద్దరూ తర్వాత నన్ను ‘యమలీల’తో హీరోగా నిలబెట్టారు. అందుకే నేను ఏ పనిచేసినా వాళ్లు లేకుండా చేయను. సెంటిమెంట్‌గా ఈ సినిమాలో వాళ్లిద్దరికీ చిన్న వేషం ఇచ్చాను. ఈ చిత్రం తర్వాత ఇద్దరూ నటులుగా బిజీ అవుతారు (నవ్వుతూ)’’ అన్నారు.

మరిన్ని వార్తలు