స్పై థ్రిల్లర్‌ జానర్‌ వెబ్‌సిరీస్‌లో టబు

17 Sep, 2021 07:45 IST|Sakshi

‘‘మళ్లీ వీబీ (విశాల్‌ భరద్వాజ్‌) కాంబినేషన్‌లో ఓ ప్రాజెక్ట్‌ చేయనున్నాను. చాలా ఎగై్జటింగ్‌గా ఉంది. నా మనసుకి బాగా దగ్గరైన అద్భుతమైన స్పై థ్రిల్లర్‌ ఇది. మిమ్మల్ని (ప్రేక్షకులు) ఫుల్‌గా థ్రిల్‌ చేయడానికి రెడీ అవుతున్నాం’’ అని సోషల్‌ మీడియా వేదికగా టబు పేర్కొన్నారు. విశాల్‌ భరద్వాజ్‌ దర్శకత్వంలో రూపొందిన ‘మక్బూల్‌’, హైదర్‌’ వంటి చిత్రాల్లో టబు నటించారు. ఈ చిత్రాలు నటిగా ఆమెకు మరింత మంచి పేరు తెచ్చాయి. అయితే ఈసారి విశాల్‌తో కలిసి టబు చేయనున్నది సినిమా కాదు.. వెబ్‌ సిరీస్‌.

‘ఖుఫియా’ టైటిల్‌తో రూపొందనున్న ఈ సిరీస్‌లో అలీ ఫజల్, ఆశిష్‌ విద్యార్థి, వామికా గబ్బీ ఇతర ప్రధాన పాత్రధారులు. ఢిల్లీలో జరిగిన వాస్తవ ఘటన నేపథ్యంలో ఈ సిరీస్‌ రూపొందనుంది. అమర్‌ భూషణ్‌ రాసిన ‘ఎస్కేప్‌ టు నౌహియర్‌’ నవల ఆధారంగా తెరకెక్కించనున్నారు. భారతీయ గూఢచారి సంస్థ ‘రా’ (రీసెర్చ్‌ అండ్‌ అనాలిసిస్‌ వింగ్‌)లో పని చేసే కృష్ణ మెహ్రా చుట్టూ ముఖ్యంగా ఈ కథ సాగుతుంది. భారతదేశ రక్షణ రహస్యాలను విక్రయించే ఓ ముఠాను పట్టుకునే పనిని కృష్ణకి అప్పగిస్తారు. ఒకవైపు ఈ బాధ్యత, మరోవైపు ప్రియురాలిగా కృష్ణ పాత్ర సాగుతుంది. ఈ పాత్రనే టబు చేయనున్నారు.

మరిన్ని వార్తలు