జైలర్‌తో మిల్కీ బ్యూటీ  

26 Feb, 2023 08:36 IST|Sakshi

తమిళ సినిమా: జైలర్‌. ఈ పేరే ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారింది. దీనికి ప్రధాన కారణం సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌. ఆయన నటిస్తున్న 169వ చిత్రం ఇది. సన్‌ పిక్చర్‌ పతాకంపై కళానిధి మారన్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు బీస్ట్‌ ఫేమ్‌ నెల్సన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రజనీకాంత్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ చిత్రానికి మరో విశేషం స్టార్‌ డమ్‌. రజనీకాంత్‌తో పాటు కన్నడ స్టార్‌ శివరాజ్‌ కుమార్, బాలీవుడ్‌ స్టార్స్‌ సంజయ్‌ దత్, జాకీ ష్రాఫ్, మాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మోహన్‌ లాల్, టాలీవుడ్‌ నటుడు సునీల్, వసంత రవి, యోగి బాబు, నటి రమ్యకృష్ణ, తమన్నా తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్‌ సంగీతాన్ని, విజయ్‌ కార్తీక్‌ కన్నన్‌ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.

కాగా చిత్ర షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పటికే 70 శాతం పూర్తి అయినట్లు సమాచారం. ఇక అసలు విషయం ఏమిటంటే నటి తమన్నా భాటియా తొలిసారిగా ఈ చిత్రంలో రజనీకాంత్‌ సరసన నటించనున్నట్లు యూనిట్‌ వర్గాలు వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడీ చిత్రం షూటింగ్‌లో ఈమె  పాల్గొన్నారు. ఈ విషయాన్ని ఆమె శుక్రవారం తన ఇన్‌ స్ట్రాగామ్‌లో విడుదల చేసిన చిన్న వీడియో ద్వారా తెలిపారు. నెల్సన్‌ దర్శకత్వంలో జైలర్‌ చిత్రం టాకీ పార్ట్‌ జరుగుతోందని, ఇందులో నటించడం హ్యాపీగా ఉందని పేర్కొన్నారు.

జైలర్‌ చిత్ర షూటింగ్‌ ప్రస్తుతం బెంగళూరులో జరుగుతోంది. కాగా చిత్రాన్ని దీపావళి సందర్భంగా ఆగస్ట్‌లో విడుదల చేయడానికి సన్‌ పిక్చర్స్‌ సంస్థ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. చిత్రంలో అనేక మంది పెద్ద నటులు ఉండడంతో జైలర్‌ చిత్రంపై అంచనాలు అంబరాన్ని తాకుతున్నాయనే చెప్పాలి.   

మరిన్ని వార్తలు