These Tollywood Actors Are Trained In Mixed Martial Arts - Sakshi
Sakshi News home page

‘మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌’కు ప్రిపేర్‌ అవుతున్న స్టార్స్‌!

Published Sat, Jul 22 2023 4:23 AM

These Tollywood actors are Trained mixed martial arts - Sakshi

విలన్‌ ముఖం మీద హీరో పంచ్‌ ఇవ్వాలా? కాలితో ఒక్క కిక్‌ కొట్టాలా? గాల్లో ఎగిరి పల్టీలు కొట్టి మరీ విలన్‌ని కొట్టాలా? ఇవన్నీ చేయాలంటే కాస్త ట్రైనింగ్‌ కావాలి. రెగ్యులర్‌ ఫైట్స్‌కి అయితే అక్కర్లేదు. బీభత్సమైన ఫైట్స్‌కి అయితే శిక్షణ తీసుకోవాల్సిందే. అది హీరో అయినా హీరోయిన్‌ అయినా. ఈ మధ్య రిస్కీ రోల్స్‌ ఒప్పుకున్న కొందరు స్టార్స్‌ ‘మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌’ నేర్చుకోవడానికి ప్రిపేర్‌ అయ్యారు. కిక్‌ బాక్సింగ్, కరాటే, కుంగ్‌ ఫూ, జూడో, కలరి పయట్టు వంటివన్నీ మార్షల్‌ ఆర్ట్స్‌ కిందే వస్తాయి. ఫైట్‌కి సూట్‌ అయ్యే ఆర్ట్‌ నేర్చుకుని బరిలోకి దిగనున్న స్టార్స్‌ గురించి తెలుసుకుందాం.

మూడు నెలలు బ్యాంకాక్‌లో...  
 హీరో మహేశ్‌బాబు– డైరెక్టర్‌ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఆఫ్రికన్‌ అడవుల నేపథ్యంలో జరిగే ఈ కథలో భారీ యాక్షన్‌ సన్నివేశాలు ఉంటాయట. పోరాట సన్నివేశాలు సహజంగా ఉండేందుకు కెరీర్‌లో తొలిసారి ఈ సినిమా కోసం మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకోనున్నారట మహేశ్‌బాబు. ఇందుకోసం మూడు నెలల పాటు బ్యాంకాక్‌ వెళతారని టాక్‌. అక్కడ మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ ట్రైనింగ్, హైకింగ్,  ట్రెక్కింగ్‌ వంటివి నేర్చుకోనున్నారట. ఈ శిక్షణ ఇవ్వనున్న బ్యాంకాక్‌ స్టంట్‌ టీమ్‌కి ఓ హాలీవుడ్‌ ప్రముఖ స్టంట్‌ కొరియోగ్రాఫర్‌ నేతృత్వం వహిస్తారని తెలిసింది. ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తున్న ‘గుంటూరు కారం’లో నటిస్తున్నారు మహేశ్‌బాబు. ఈ చిత్రం పూర్తయ్యాక బ్యాంకాక్‌లో శిక్షణ తీసుకుని, రాజమౌళి సినిమా షూట్‌లో జాయిన్‌ అవుతారట. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్నారు రాజమౌళి. ఈ చిత్రానికి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ కథ అందిస్తున్న సంగతి తెలిసిందే.  

థాయ్‌ల్యాండ్‌లో...
తొలి చిత్రం ‘ఉప్పెన’తో (2021) బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకున్నారు వైష్ణవ్‌ తేజ్‌. ఆ తర్వాత ‘కొండపొలం, రంగరంగ వైభవంగా’ వంటి చిత్రాల్లో నటించారు. ఈ మూడు చిత్రాల్లో సాఫ్ట్‌ క్యారెక్టర్‌తో ప్రేక్షకులను అలరించిన ఆయన తొలిసారి ‘ఆదికేశవ’ చిత్రంలో ఫుల్‌ యాక్షన్‌ రోల్‌ చేశారు. శ్రీకాంత్‌ ఎన్‌. రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హై ఓల్టేజ్‌ యాక్షన్‌ సన్నివేశాల కోసం థాయ్‌ల్యాండ్‌లో మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నారు వైష్ణవ్‌ తేజ్‌. ఈ చిత్రంలో వైష్ణవ్‌కు జోడీగా శ్రీలీల నటించారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 18న రిలీజ్‌ కానుంది.

కలరి మార్షల్‌ ఆర్ట్‌లో...  
మలయాళ హీరో టొవినో థామస్‌ కలరి అనే మార్షల్‌ ఆర్ట్‌లో శిక్షణ పొందారు. టొవినో థామస్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అజయంతే రందం మోషణం’. జితిన్‌ లాల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కథ పరంగా కేరళలోని కలరి అనే మార్షల్‌ ఆర్ట్‌కు ఈ చిత్రంలో ప్రాధాన్యం ఉండటంతో టొవినో థామస్‌ ఈ విద్యలో శిక్షణ తీసుకుని నటిస్తున్నారు. ఈ చిత్రంలో కృతీ శెట్టి, ఐశ్వర్య రాజేష్, సురభి లక్ష్మి హీరోయిన్లుగా నటిస్తున్నారు.


భారతీయుడు కోసం...  
కమల్‌హాసన్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ‘భారతీయుడు 2’ కోసం కాజల్‌ అగర్వాల్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నారు. ‘భారతీయుడు’ (1996) సినిమాకి సీక్వెల్‌గా ‘భారతీయుడు 2’ (తమిళంలో ‘ఇండియన్‌ 2) రూపొందుతోంది. ఈ చిత్రంలో కమల్‌కు జోడీగా కాజల్‌ నటిస్తున్నారు. ఈ చిత్రంలో పవర్‌ఫుల్‌ ఫైట్స్‌ చేయడం కోసం అతిపురాతనమైన యుద్ధ క్రీడ కలరి పయట్టు నేర్చుకున్నారు కాజల్‌. కలరి సాధన చేస్తున్న ఓ వీడియోను ఆమె సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి, ‘షావోలిన్, కుంగ్‌ ఫూ, కరాటే, తైక్వాండో.. వంటి క్రీడలు కలరి నుంచి పుట్టుకొచ్చినవే’ అని పేర్కొన్నారామె. ఈ మూవీ కోసం గుర్రపు స్వారీ కూడా నేర్చుకున్నారు కాజల్‌ అగర్వాల్‌.

Advertisement

తప్పక చదవండి

Advertisement