Sakshi News home page

Natti Kumar: ఆస్కార్‌ గ్రహీతలకు సరైన గౌరవం దక్కలేదు.. ఇంత అర్జంటుగా సన్మానం దేనికో?

Published Mon, Apr 10 2023 2:02 PM

Tollywood Producer Natti Kumar About Oscars - Sakshi

ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య లేకుండా అభినందన సభ ఏర్పాటు చేయడం సిగ్గుచేటు అని మండిపడ్డారు నిర్మాత నట్టి కుమార్‌. ఆస్కార్‌ గ్రహీతలను అంత అర్జెంటుగా ఎవరికీ తెలియకుండా ఎందుకు సన్మానించారని ప్రశ్నించారు. 95వ అకాడమీ అవార్డు వేడుకల్లో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని నాటునాటు పాటకు బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో ఆస్కార్‌ దక్కిన విషయం తెలిసిందే! ఈ సందర్భంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఆధ్వర్యంలో ఆస్కార్‌ గ్రహీతలు కీరవాణి, చంద్రబోస్‌లను ఆదివారం నాడు హైదరాబాద్‌లో ఘనంగా సత్కరించారు. ఈ అభినందన కార్యక్రమంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు నిర్మాత నట్టి కుమార్‌.

'తెలుగు సినిమాకు ఆస్కార్‌ రావడం అందరూ గర్వించదగ్గ విషయం. కానీ ఆస్కార్‌ గ్రహీతలకు సరైన గౌరవం దక్కలేదు. నిన్న జరిగిన ఈవెంట్‌కు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పెద్దలు రాలేదు. కేవలం సినిమాటోగ్రఫీ మంత్రి మాత్రమే వచ్చారు. ఈ కార్యక్రమం కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలతో ఎందుకు సంప్రదించలేదు? ఆస్కార్‌ సాధించినవాళ్లను అంత అర్జెంట్‌గా ఎవరికీ తెలియకుండా ఎందుకు సన్మానించారు? నిన్న జరిగిన ఈవెంట్‌ గురించి చాలామందికి సమాచారమే అందలేదు. సన్మానం చేయాలి. కానీ ఇది సరైన పద్ధతి కాదు. 

ఈసీ అప్రూవల్‌ లేకుండా ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ నుంచి రూ.25 లక్షలు తీసి ఎలా ఖర్చు చేస్తారు? తెలంగాణ వచ్చాక ఇండస్ట్రీకి అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. కానీ తెలంగాణలో చిన్న సినిమాలకు ఏం చేయట్లేదు. పెద్ద సినిమాలకు మాత్రమే గుర్తింపు వస్తుంది. చిన్న సినిమాలకు ఐదో షో కావాలని అడుగుతున్నాం. దీనిపై ఇంతవరకు స్పందించనేలేదు. తెలంగాణలో ఎక్కువ లాభాలు వస్తున్నాయని శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. కానీ ఇక్కడ 32%, ఆంధ్రప్రదేశ్‌లో 62% లాభాలు వస్తున్నాయి. అయినా చాలా కంపెనీలు తెలంగాణలోనే జీఎస్టీ కడుతున్నాయి. సినిమా ఇండస్ట్రీలో ఏపీ, తెలంగాణ అంటూ ఎలాంటి విభేదాలు లేవు. అందరం కలిసే ఉన్నాం' అన్నారు నట్టి కుమార్‌.

Advertisement
Advertisement