KBR Park: కేబీఆర్‌ పార్క్‌ వద్ద సినీ నటిపై దుండగుడి దాడి

16 Nov, 2021 04:36 IST|Sakshi

పార్కు వద్ద సినీ నటి షాలూ చౌరాసియాపై ఆగంతకుడి దాడి

హైదరాబాద్‌లో దారుణం

పది నిమిషాలపాటు పెనుగులాడిన నటి.. తీవ్రంగా గాయపడిన షాలూ

సెల్‌ఫోన్‌తో పరారైన దుండగుడు

ఆచూకీ కోసం పోలీసుల గాలింపు

బంజారాహిల్స్‌ (హైదరాబాద్‌): నగరంలోని కేబీఆర్‌ పార్కులో సినీ నటిపై ఒక ఆగంతకుడు దాడిచేసి అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమెను తీవ్రంగా గాయపరిచి సెల్‌ఫోన్‌ తస్కరించి పరారయ్యాడు. ఈ ఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కొండాపూర్‌లో నివసించే నటి షాలూ చౌరాసియా (24) (సైకో, కాలింగ్‌ సహస్ర ఫేమ్‌) ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు కేబీఆర్‌ పార్కుకు వాకింగ్‌కు వచ్చారు.

పార్కు చుట్టూ ఉన్న వాక్‌వేలో నడుస్తుండగా 8.45 గంటల సమయంలో వెనకాల అనుసరిస్తున్న దుండగుడు ఆమెను అడ్డగించి గట్టిగా పట్టుకొని కిందికి తోసేశాడు. ఒక్కసారిగా షాక్‌కు గురైన ఆమె తేరుకొని అరవడానికి ప్రయత్నిస్తుండగా నోట్లో గుడ్డలు కుక్కాడు. రెండు చేతులూ వెనక్కి విరిచి బండరాయి పెట్టాడు. కాళ్లు కదపకుండా దుండగుడు తన కాలును గట్టిగా ఒత్తిపెట్టాడు. మరో కాలును ఆమె మెడపై నొక్కి పెట్టి ఓ రాయితో కొట్టాడు.

పది నిమిషాలపాటు పెనుగులాడుతూ దుండగుడి నుంచి తప్పించుకునేందుకు యత్నించినా విడిచిపెట్టలేదు. అరిస్తే చంపేస్తానంటూ ఓ బండరాయిని ఎత్తి బెదిరించాడు. దాడిలో నటి కాళ్లు, చేతులు, ముఖంపైన గాయాలయ్యాయి. ఆమె సెల్‌ఫోన్‌ తీసి ఫోన్‌ చేసే క్రమంలో దాన్ని లాక్కొని జేబులో పెట్టుకున్నాడు. ఒక్కసారిగా శక్తిని కూడదీసుకున్న ఆమె ఒక్క ఉదుటన లేచి కేకలు వేస్తూ పరుగులు తీశారు. పార్కు వాక్‌వేను ఆనుకొని ఉన్న ఫెన్సింగ్‌ పైనుంచి రోడ్డువైపు ఫుట్‌పాత్‌పైకి దూకారు. నటి అరుపులు విని ఎదురుగా ఉన్న స్టార్‌బక్స్‌ హోటల్‌ వ్యాలెట్‌ పార్కింగ్‌ డ్రైవర్లు పరిగెత్తుకొచ్చారు. దీంతో దుండగుడు పరారయ్యాడు.

చౌరాసియా డ్రైవర్ల ఫోన్‌ తీసుకొని తల్లికి సమాచారం ఇచ్చింది. ఆమె వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. చౌరాసియాను చికిత్స నిమిత్తం స్టార్‌ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ఆస్పత్రిలో చికిత్స అనంతరం రాత్రి 11 గంటల ప్రాంతంలో నటి బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగలు, నగదు ఇవ్వాలని దుండగుడు అడిగాడని, మూడుసార్లు రాళ్లతో దాడి చేశాడని అందులో పేర్కొన్నారు. బండరాయితో మోది చంపేస్తానని బెదిరించాడన్నారు.

4 బృందాలతో గాలింపు
నటి షాలూ చౌరాసియాపై ఆగంతకుడి దాడి వ్యవహారంలో పోలీసు ఉన్నతాధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తక్షణం నిందితుడిని పట్టుకోవాలని గట్టిగా ఆదేశాలు జారీ అయిన నేపథ్యంలో ఒకవైపు బంజారా హిల్స్‌ లా అండ్‌ ఆర్డర్, క్రైం పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి గాలిస్తుండగా.. ఇంకోవైపు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులూ జల్లెడ పడుతున్నారు. ఆదివారం అర్ధరాత్రి నుంచే గాలింపు ముమ్మరం చేశారు. వాకింగ్‌ వచ్చిన వారి కదలికలపైనా ఆరా తీస్తున్నారు.

పార్కు చుట్టూ వాణిజ్య సంస్థలు ఏర్పాటు చేసుకున్న 73 సీసీ కెమెరాలను పరిశీలించారు. అయితే ఎక్కడా స్పష్టత లేకపోవడంతో పార్కు చుట్టూ రోడ్లపై ఎల్‌ అండ్‌ టీ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. గతంలో నేరాలకు పాల్పడ్డ వారి వివరాలను ఆరా తీస్తూ వారి కదలికలను గమనిస్తున్నారు. ఇంకోవైపు బాధిత నటి సెల్‌ఫోన్‌ కాల్‌డేటాను పరిశీలిస్తున్నారు.

నిందితుడు ఫోన్‌ చోరీ చేసిన కొద్దిసేపట్లోనే స్విచ్చాఫ్‌ చేశాడు. ఎక్కడ స్విచ్చాఫ్‌ చేశాడో ఆ ప్రాంతాన్ని గుర్తించారు. అటువైపు చుట్టుపక్కల సీసీ ఫుటేజీలు పరిశీలిస్తున్నారు. ఆ సెల్‌ఫోన్‌లో మరో సిమ్‌కార్డు వేసుకుంటే సెల్‌టవర్‌ ఆధారంగా గుర్తించేందుకు అవకాశం ఉండటంతో సాంకేతిక ఆధారాలపై దృష్టి పెట్టారు. 

మరిన్ని వార్తలు