ఆరోగ్యకరమైన హాస్యాన్ని అందించారు అల్లు 

2 Oct, 2022 07:21 IST|Sakshi
పుస్తకావిష్కరణలో రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌, వెంకయ్య నాయుడు, చిరంజీవి, అల్లు అరవింద్‌

‘‘ఆరోగ్యకరమైన హాస్యాన్ని చేరువ చేయ డానికి అల్లు రామలింగయ్యగారు చేసిన కృషి మరువలేనిది’’ అని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. హాస్య నటుడు అల్లు రామలింగయ్య జీవన ఛాయ చిత్ర మాలిక పుస్తకాన్ని ఆయన శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ– ‘‘హావభావాల ద్వారా తన నటనలో హాస్యాన్ని పండించిన సిద్ధహస్తుడు రామలింగయ్యగారు. సమాజంలో వ్యక్తులను అధ్యయనం చేస్తూ ఆయన సాధించిన గొప్ప కళ హాస్యం పండించడమే.

సమాజానికి దిశానిర్దేశం చేసే విధంగా కళాకారులు చొరవ చూపాలి. ప్రజలను ఆకర్షించడానికి హాస్య రసాన్ని ఉపయోగించుకుంటూనే ఆలోచింపజేసే విధంగా సమాజం పట్ల ఓ బాధ్యతను ప్రజల్లో తీసుకురావాల్సిన అవసరం ఉంది. పుస్తక సంపాదకులు మన్నెం గోపీచంద్, విషయాలను కూర్పు చేసిన వెంకట సిద్ధారెడ్డి, పరిశోధన చేసిన శ్రీకాంత్‌ కుమార్‌కు అభినందనలు’’ అన్నారు.

మరిన్ని వార్తలు