Vijay Antony Hitler: అదిరిపోయే కాంబినేషన్లో 'హిట్లర్‌'గా వస్తున్న విజయ్‌ ఆంటోనీ

30 Sep, 2023 08:02 IST|Sakshi

విజయ్‌ ఆంటోనీ.. విభిన్నమైన కథలతో పాటు తన సూపర్‌ టాలెంట్‌తో సినీ ప్రేక్షకులను కట్టిపడేస్తాడు. బిచ్చగాడు2తో మంచి విజయాన్ని అందుకున్న విజయ్‌ ఆంటోని ఆ తర్వాత 'హత్య' అంటూ పలకరించినా అది పెద్దగా మెప్పించలేదు. తాజాగా  మరో సినిమాతో వస్తున్నాడు విజయ్‌. దానికి  హిట్లర్‌ అనే పవర్‌ఫుల్‌ టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. ఈ పేరుతో ఇప్పటికే చిరంజీవి బ్లాక్‌బస్టర్‌ కొట్టాడు. దీంతో సులభంగా హిట్లర్‌ పేరు తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతుందనే ఈ టైటిల్‌ పెట్టినట్లు టాక్‌. ఇది పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతుండటం విశేషం. చెందూర్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ సంస్థ తమ 7వ ప్రాజెక్ట్‌గా హిట్లర్ సినిమాను నిర్మిస్తోంది.

(ఇదీ చదవండి; నటి హరితేజ విడాకులు.. వైరల్‌గా మారిన పోస్ట్‌)

విజయ్ ఆంటోనీతో గతంలో ‘విజయ్ రాఘవన్’ మూవీని నిర్మించిన వారు ఆయనతో మరో సినిమా చేస్తుండటం విశేషం. డీటీ రాజా, డీఆర్ సంజయ్ కుమార్ నిర్మాతలుగా ఈ సినిమాను యాక్షన్ థ్రిల్లర్‌గా దర్శకుడు ధన రూపొందిస్తున్నారు. ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను తాజాగా విడుదల చేశారు. అయితే దీనిని అన్ని భాషల్లో లాంచ్ చేశారు.  'హిట్లర్' సినిమా గురించి చిత్ర యూనిట్ మాట్లాడుతూ.. 'ప్రజాస్వామ్యం పేరుతో కొందరు పాలకులు నియంతల్లా వ్యవహరిస్తున్నారు. అలాంటి ఒక నియంతను ఎదుర్కొనే సాధారణ పౌరుడి కథే హిట్లర్.' అని చెప్పారు.

మోషన్ పోస్టర్ విషయానికి వస్తే.. ట్రైన్ జర్నీలో ఉన్న విజయ్ ఆంటోనీ ఒక క్రైమ్ ఇన్సిడెంట్‌ను ఎదుర్కొన్నట్లు చూపించారు. ఇదే ట్రైన్‌లో హీరోయిన్ రియా సుమన్‌ను హీరో కలుసుకుంటాడు. గన్ పేలుస్తూ గౌతమ్ మీనన్ కొత్త లుక్‌లో కనిపించారు. త్రీడీ యానిమేషన్, కంప్యూటర్ గ్రాఫిక్స్‌తో రూపొందించిన ఈ మోషన్ పోస్టర్‌లో చివరగా విజయ్ ఆంటోని జోకర్ గెటప్‌లో దర్శనమిచ్చాడు. ఇప్పుడు ఇదీ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో దూసుకుపోతుంది. 

మరిన్ని వార్తలు