గుత్తా జ్వాల, విష్ణు విశాల్‌ పెళ్లి: లగ్నపత్రిక ఇదే..

13 Apr, 2021 15:46 IST|Sakshi

భారత బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ గుత్తా జ్వాల, తమిళ హీరో విష్ణు విశాల్‌కు పెళ్లి ఘడియలు దగ్గర పడ్డాయి. గతేడాది సెప్టెంబర్‌లో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట ఏప్రిల్‌ 22న పెళ్లి పీటలెక్కనున్నట్లు వెల్లడించారు. ఉగాది పండగ రోజు విష్ణు విశాల్‌ ఈ శుభవార్తను ట్విటర్‌లో తెలిపారు. ఈ మేరకు లగ్న పత్రికను సైతం షేర్‌ చేశాడు. దీంతో పలువురు అభిమానులు, సెలబ్రిటీలు ఈ ప్రేమ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే కరోనా విజృంభిస్తున్న కారణంగా అందరికీ ఆహ్వానాలు పంపడం లేదని హీరో స్పష్టం చేశాడు. కేవలం ఇరు కుటుంబాలతో పాటు అతికొద్ది మంది సమక్షంలోనే వివాహం చేసుకోనున్నట్లు వెల్లడించాడు.

విష్ణు విశాల్‌ 2010లో రజనీ నటరాజన్‌ను పెళ్లి చేసుకున్నాడు. వారికి ఆర్యన్‌ అనే కొడుకు కూడా ఉన్నాడు. కానీ మనస్పర్థల కారణంగా 2018లో వారిద్దరూ విడిపోయారు. మరోవైపు గుత్తా జ్వాల కూడా భారత బ్యాడ్మింటర్‌ ప్లేయర్‌ చేతన్‌ ఆనంద్‌ను 2005లో పెళ్లి చేసుకుంది. ఆరేళ్లకే వీరి మధ్య పొరపచ్చాలు రావడంతో 2011లో విడిపోయారు. ఇక విశాల్‌ సోదరి పెళ్లి వేడుకల్లో తొలిసారిగా వీరిద్దరూ కలిశారు. అప్పుడు వీరి మధ్య చిగురించిన స్నేహం ప్రేమగా మారగా ఇప్పుడది పెళ్లిపీటలకు దారి తీసింది. ఇదిలా వుంటే విష్ణు విశాల్‌ ఈ మధ్యే మూడు భాషల్లో విడుదలైన 'అరణ్య'లో తన నటనతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం అతడు ఎఫ్‌ఐఆర్‌, మోహన్‌దాస్‌, ఇంద్రు నేత్రు నాలై 2 సినిమాల్లో నటిస్తున్నాడు.

చదవండి: త్వరలోనే తెలుగింటి అల్లుణ్ణి కాబోతున్నాను: హీరో

మరిన్ని వార్తలు