Waheeda Rehman: ‘ఏరువాక సాగారో..’ వహీదా రెహమాన్‌కు దాదాసాహెబ్‌ ఫాల్కే

26 Sep, 2023 13:38 IST|Sakshi

అలనాటి అందాల తార వహీదా రెహమాన్‌ 'దాదాసాహెబ్‌ ఫాల్కే జీవిత సాఫ్యల అవార్డు'కు ఎంపికైంది. చిత్రపరిశ్రమకు అందించిన సేవలకుగానూ ఆమెకు ఈ సినీ అత్యున్నత పురస్కారం అందించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ సోషల్‌ మీడియాలో నటి సేవలను కొనియాడారు.

5 దశాబ్దాలుగా సేవల..
'భారతీయ చిత్రపరిశ్రమకు ఐదు దశాబ్దాలుగా వహీదా రెహమాన్‌గారు అందించిన అద్భుతమైన సేవలకుగానూ ఆమెకు ప్రతిష్టాత్మక దాదాసాహెబ్‌ ఫాల్కే జీవిత సాఫల్య పురస్కారం ఇవ్వనున్నాం. ఈ పురస్కారాన్ని ఆమెకు ప్రకటించినందుకుగానూ నాకెంతో సంతోషంగా ఉంది. హిందీ సినిమాల్లో అత్యధికంగా నటించిన వహీదా విమర్శలకు నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. వాటిలో ప్యాసా, కాగజ్‌ కే పూల్‌, చౌదావికా చంద్‌, సాహెబ్‌ బివి ఔర్‌ గులాం, గైడ్‌, కామోషి తదితర చెప్పుకోదగ్గ చిత్రాలున్నాయి అని ట్వీట్‌ చేశారు.

తొలి సినిమాతోనే క్రేజ్‌..
డాక్టర్‌ కాబోయి యాక్టర్‌ అయిన వారిలో వహీదా ఒకరు. 1938 ఫిబ్రవరి 3న తమిళనాడులోని చెంగల్పట్టులో జన్మించింది. ఎన్టీఆర్‌ తన సొంత సంస్థలో 'జయసింహ' కథ తీసేందుకు రెడీ అవగా ఇందులో రాజకుమారి పాత్రలో ఓ కొత్త నటిని తీసుకుకోవాలని భావించాడు. అలా ఈ పాత్ర వహీదా రెహమాన్‌ను వరించింది. కానీ అప్పటికే రోజులు మారాయి సినిమాలో ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నా పాటకు ఆమెతో డ్యాన్స్‌ చేయించడంతో ఇదే తన తొలి చిత్రంగా మారింది. 1971లో 'రేష్మా ఔర్‌ షేరా' చిత్రంతో వహీదా జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా నిలిచింది. 1972లో 'పద్మశ్రీ', 2011లో 'పద్మభూషణ్' అందుకుంది. 

చదవండి: మెగాస్టార్‌తో రొమాంటిక్‌ స్టెప్పులేసి తర్వాత చెల్లిగా, తల్లిగా నటించిన నటి ఎవరంటే?

మరిన్ని వార్తలు