ప్రజలకు న్యాయం చేసేందుకే లోక్‌ అదాలత్‌ | Sakshi
Sakshi News home page

ప్రజలకు న్యాయం చేసేందుకే లోక్‌ అదాలత్‌

Published Fri, Nov 10 2023 5:06 AM

ర్యాలీని ప్రారంభిస్తున్న జడ్జి లలిత శివజ్యోతి, ఎస్పీ గాష్‌ఆలం  - Sakshi

ములుగు: ఆర్థిక, ఇతర సమస్యలతో ఇబ్బందులు పడుతున్న అమాయకులైన ప్రజలకు అన్యాయం జరగకూడదనే లోక్‌ అదాలత్‌ నిర్వహించి కక్షిదారుల మధ్య సమన్వయం కుదిర్చి తగిన న్యాయం చేస్తున్నామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌, జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి పీవీపీ లలిత శివజ్యోతి అన్నారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎస్పీ గాష్‌ ఆలంతో కలిసి గురువారం ఆమె జిల్లా కేంద్రంలో జెండా ఊపి అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ బలహీన వర్గాలు, నిరుపేదలకు న్యాయ సేవలు అందించడానికి లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ యాక్ట్‌ 1987లో ఏర్పాటు అయ్యిందని తెలిపారు. 1995 నుంచి ప్రతి ఏటా నవంబర్‌ 9వ తేదీన ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నామన్నారు. చట్టాలు, న్యాయాలు అందరికీ తెలియాలనేది ముఖ్య ఉద్దేశమని వివరించారు. ఆయా రకాల సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారికి న్యాయం జరిగేలా చూస్తున్నామన్నారు. ఉచిత న్యాయ సేవ కోసం కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రంలో సలహాలు, సూచనలు పొందవచ్చని తెలిపారు. నల్సా స్కీం ద్వారా మండలాలు, మారుమూల గ్రామాల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. న్యాయ సేవాధికార సంస్థ తరఫున చేపడుతున్న ప్రతీ కార్యక్రమానికి అండగా నిలుస్తున్న స్వచ్ఛంద సంస్థలు, న్యాయవాదులు, పారా లీగల్‌ వలంటీర్లు, చైల్డ్‌లైన్‌ అధికారులు, ఆశ కార్యకర్తలు, అంగన్‌ వాడీ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎస్పీ గాష్‌ ఆలం మాట్లాడుతూ న్యాయ సేవాధికార సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు ఎంతో గొప్పవని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి మాధవి, న్యాయమూర్తులు రామమోహన్‌రెడ్డి, సౌఖ్య, అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌, డీఎస్పీ ఎన్‌.రవీందర్‌ , సుభాష్‌, పీ. రవీందర్‌, సీఐ రంజిత్‌కుమార్‌, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పావని, న్యాయవాదులు శ్యాం ప్రసాద్‌, మేకల మహేందర్‌, బానోత్‌ స్వామిదాస్‌, భిక్షపతి, కొండి రవీందర్‌, సునీల్‌కుమార్‌, రాజ్‌కుమార్‌, సీడీపీఓ స్వాతి, డీసీపీఓ ఓంకార్‌, కోర్టు కానిస్టేబుళ్లు తదితరులు పాల్గొన్నారు.

జడ్జి పీవీపీ లలిత శివజ్యోతి

Advertisement

తప్పక చదవండి

Advertisement