ఇంటినుంచే ఓటు | Sakshi
Sakshi News home page

ఇంటినుంచే ఓటు

Published Wed, Nov 22 2023 1:38 AM

వీడియో తీస్తూ ఓటు వేయిస్తున్న అధికారులు 
 - Sakshi

ఏటూరునాగారం/వాజేడు: దివ్యాంగులు, వృద్ధులకు ఇంటి నుంచి ఓటు వేసే వెసులుబాటును ఎన్నికల కమిషన్‌ కల్పించింది. ఈ నేపథ్యంలో ఏటూరునాగారం, వాజేడు మండల పరిధిలోని పలువురు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏటూరునాగారం మండల పరిధిలోని 28 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో 18మంది వృద్ధులు, నలుగురు దివ్యాంగులు మొత్తంగా 22మంది దరఖాస్తు చేసుకున్నారు. దీంతో మంగళవారం పోలింగ్‌ అధికారులు అశ్విని, లక్ష్మినారాయణ, బీఎల్‌ఓ లలిత, అబ్జర్వర్‌, వీడియో గ్రాఫర్‌తో దరఖాస్తుదారుల ఇంటికి వెళ్లి 17 మంది నుంచి ఓటును వేయించుకున్నారు. వారి ఇంటి వద్దే బ్యాలెట్‌ బాక్స్‌ను ఏర్పాటు చేసి బ్యాలెట్‌ పేపర్‌ను ఓటరుకు ఇచ్చి ఓటును వేయించుకున్నారు. మిగిలిన వారి నుంచి నేడు(బుధవారం) ఎన్నికల నిబంధనలకు లోబడి ఓట్లు వేయించనున్నారు. వాజేడు మండల పరిధిలోని జగన్నాథపురం, కొంగాల, ఇప్పగూడెం, చెరుకూరు, ధర్మవరం, పేరూరు, గొళ్లగూడెం, చండ్రుపట్ల, ఏడ్జర్లపల్లి, మొరుమూరు కాలనీ, ఆరుగుంట పల్లి, బొల్లారం గ్రామాల నుంచి ఒక్కొక్కరి చొప్పున 12 మంది ఇంటి వద్దే ఓటు వేసే అవకాశం ఇవ్వాలని ఎన్నికల అధికారులకు దరఖాస్తులను చేసుకున్నారు. వారి అభ్యర్ధన మేరకు అధికారులు అవకాశం కల్పించారు. దీంతో ఎన్నికల ప్రత్యేక బృందం పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను వారి ఇళ్ల వద్దకు వెళ్లి వేయించారు. అందరి ఓట్లు పోలైన వెంటనే ఉన్నతాధికారులకు సమాచార ఇచ్చి భద్రాచలం పంపించారు. ఎవరి సాయం లేకుండానే దర్జాగా ఇంటి వద్దే ఓటు వేయడం పట్ల వృద్ధులు, దివ్యాంగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఏటూరునాగారంలో 17,

వాజేడులో 12 పోలైన ఓట్లు

వాజేడులో ఓట్లు వేయిస్తున్న అధికారులు
1/1

వాజేడులో ఓట్లు వేయిస్తున్న అధికారులు

Advertisement
Advertisement