గిరిజన యూనివర్సిటీకి మోక్షం | Sakshi
Sakshi News home page

గిరిజన యూనివర్సిటీకి మోక్షం

Published Thu, Dec 7 2023 12:52 AM

గట్టమ్మ ఆలయం సమీపంలో కేటాయించిన భూమి  - Sakshi

ములుగు: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ కేటాయింపునకు సంబంధించిన ఆధారాలు అందించలేదని కేంద్రం, భూమి అప్పగించినా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చెప్పుకుంటూ కాలం వెళ్లదీస్తూ వచ్చాయి. ఈ విషయాన్ని పలుమార్లు ఒకరిపై ఒకరు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోపణలు, ప్రతి ఆరోపణలు చేసుకుంటు వచ్చాయి. ఈ క్రమంలో ఎట్టకేలకు గిరిజన యూనివర్సిటీకి మోక్షం కలిగింది. 2014 ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా తెలంగాణకు గిరిజన యూనివర్సిటీ కేటాయిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అయితే తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యమో, కేంద్ర ప్రభుత్వ పట్టింపు లేని వైఖరో గానీ ఇప్పటి వరకు తరగతులు ప్రారంభం కాలేదు. ఆంధ్ర ప్రదేశ్‌లో మాత్రం తరగతులు ప్రారంభం అయ్యాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం గిరిజన యూనివర్సిటీకి సంబంధించిన గెజిట్‌ విడుదల చేయడంతో వచ్చే ఏడాది నుంచి తరగతులు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీకి(హెచ్‌సీయూ) ఆదేశాలు అందినట్లుగా తెలుస్తోంది.

లోక్‌ సభలో బిల్లు

ములుగు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయనున్న సమ్మక్క–సారలమ్మ సెంట్రల్‌ గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ విడుదల చేసింది. అంతకు ముందు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టారు. దీంతో పదేళ్లుగా ఎదురుచూస్తున్న యూనివర్సిటీ విషయం ట్రాక్‌ ఎక్కినట్లుగా కనిపిస్తుంది. యూనివర్సిటీ కోసం 498 ఎకరాలు అవసరం ఉంటుందని కేంద్రం ప్రతిపాదనలు పంపగా జిల్లా తరఫున ములుగు రెవెన్యూ శాఖ గట్టమ్మ ఆలయం సమీపంలోని సుమారు 337 ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఇందులో ప్రేమ్‌నగర్‌ గ్రామాన్ని సైతం సర్వే చేసి ప్రభుత్వ భూమిగా తేలడంతో ఇక్కడి నివాసులకు నోటీసులు జారీ చేసింది. ఇళ్లు కోల్పోయిన వారిని భూ నిర్వాసితులుగా గుర్తించి ఇప్పటికే ఎకరానికి రూ. 15లక్షల చొప్పున నిధులు మంజూరు చేశారు. భూమి కోల్పోయిన వారికి చెక్కుల రూపేణ కోటి 5లక్షల పరిహారాన్ని అందించారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి భవన నిర్మాణ పనులు, భూమి చదును పనులు కానీ చేపట్టలేదు. ఈ విషయంలో కొంత మేర సందేహాలు వ్యక్తం అవుతున్న తరుణంలో కేంద్రం గెజిట్‌ విడుదల చేయడంతో ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉండగా పూర్తి స్థాయి నిర్మాణ పనులు పూర్తయ్యేంత వరకు తొలి ఏడాది తరగతులను ములుగు మండలం జాకారం సమీపంలో యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌(వైటీసీ)లో తాత్కాలికంగా తరగతులు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.

పరిశోధకులకు ప్రోత్సాహంగా..

ట్రైబల్‌ యూనివర్సిటీ తరగతుల్లో గిరిజన కళలకు ప్రాముఖ్యత ఇచ్చే విధంగా గెజిట్‌లో పేర్కొన్నట్లుగా సమాచారం. అదే రీతిలో గిరిజన కళలు, సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలకు సంబంధించి పరిశోధనలకు అద్దం పట్టేలా ఔత్సాహికులను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోనున్నారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల విద్యార్థులకు ఇక్కడ చదువుకునే అవకాశం లభించనుంది.

గెజిట్‌ విడుదల చేసిన కేంద్రం

తొలి ఏడాది వైటీసీలో తాత్కాలికంగా తరగతులు ప్రారంభం?

గిరిజన కళలకు ప్రాముఖ్యత

అదే రీతిలో కోర్సులు

Advertisement
Advertisement