వాగు దాటి వెళ్లి.. విద్యార్థులకు పాఠాలు | Sakshi
Sakshi News home page

వాగు దాటి వెళ్లి.. విద్యార్థులకు పాఠాలు

Published Thu, Dec 7 2023 12:52 AM

ఎలిశెట్టిపల్లికి జంపన్నవాగు దాటుతు వెళ్తున్న హెచ్‌ఎం సతీష్‌ - Sakshi

ఏటూరునాగారం: ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఉధృతంగా ప్రవహిస్తున్న నడుములోతు నీటిలో నుంచి పాఠశాలకు వెళ్లి పాఠాలను బోధించారు. ఈ ఘటన ఏటూరునాగారం మండల పరిధిలోని ఎలిశెట్టిపల్లిలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..ఎలిశెట్టిపల్లి గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది. అందులో 20 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సామల సతీష్‌ పనిచేస్తుండగా మరో ఉపాధ్యాయురాలు ఉంది. అయితే వాగులో నుంచి ఉపాధ్యాయురాలు వెళ్లలేని పరిస్థితి ఉండడంతో ఆమెను మండల కేంద్రంలోనే గతంలో డిప్యూటేషన్‌పై వేశారు. కాని హెచ్‌ఎం మాత్రం 2022 నుంచి ఎలిశెట్టిపల్లిలో టీచర్‌గా పనిచేస్తున్నారు. తుపాన్‌ కారణంగా వర్షాలు కురుస్తుండడంతో ఎలిశెట్టిపల్లి–బన్నాజీబంధం గ్రామాల మధ్యలోని జంపన్నవాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పిల్లలకు పాఠాలను చెప్పాలనే కృతనిశ్చయంతో హెచ్‌ఎం సతీష్‌ వాగుదాటి వెళ్లి విద్యార్థులకు పాఠాలను బోధించాడు. ఆ తర్వాత కూడా వాగుదాటి మండల కేంద్రానికి చేరుకున్నాడు. ఈ విషయాన్ని గ్రామస్తులు వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు. గ్రామానికి టీచర్‌ రావాలన్నా.. వైద్యులు, సిబ్బంది రావాలాన్న ఈ వాగుదాటి రావాల్సి వస్తోందని గ్రామస్తులు వెల్లడించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం నాయకులను వాగుపై బ్రిడ్జి నిర్మించాలని 140 మంది ఓటర్లు ఓటు హక్కును బహిష్కరించారు. ఇప్పటికై నా వాగుపై బ్రిడ్జి నిర్మించాలని నూతన ప్రభుత్వాన్ని, అధికారులను గ్రామస్తులు వేడుకున్నారు.

Advertisement
Advertisement