వ్యాధిగ్రస్తుల వివరాలు నమోదు చేయాలి | Sakshi
Sakshi News home page

వ్యాధిగ్రస్తుల వివరాలు నమోదు చేయాలి

Published Thu, Dec 21 2023 1:08 AM

- - Sakshi

ములుగు: కుష్ఠు వ్యాధిగ్రస్తుల వివరాలను రిజిస్టర్‌లలో నమోదు చేయాలని అధికారులకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అల్లెం అప్పయ్య సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ నుంచి వచ్చిన రిజిస్టర్‌లను పీహెచ్‌సీలకు బుధవారం తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుష్ఠు వ్యాధిగ్రస్తులకు సరైన చికిత్స సేవలు అందించాలన్నారు. క్లిష్టపరిస్థితులు ఉంటే ఆస్పత్రులకు తరలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీపీఎంఓలు సాంబయ్య, సంజీవరావు, జయరాజు, సిబ్బంది పాల్గొన్నారు.

అటవీశాఖ అధికారుల తనిఖీలు

ఏటూరునాగారం: మండల కేంద్రంలోని వడ్రంగి పనులు చేస్తున్న కార్పెంటర్ల ఇళ్లలో బుధవారం అటవీశాఖ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. వడ్రంగి పనులు చేసే క్రమంలో అనుమతి లేని కలప ఉందా, అక్రమంగా తరలిస్తున్నారనే క్రమంలో సోదాలు చేశారు. వారి వద్ద ఉన్న ఫర్నీచర్‌ సైతం పరిశీలించారు. అనుమతి లేని కలప తీసుకురావద్దని అటవీశాఖ అధికారులు దయానంద్‌, జ్యోతి, రవికాంత్‌ సూచించారు.

దరఖాస్తుల ఆహ్వానం

ములుగు రూరల్‌: గురుకులాల్లోని ప్రవేశాలకు విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌ జిల్లా సమన్వయ అధికారి యాదగిరి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2024–25 విద్యా సంవత్సరానికి 5వ తరగతిలో ప్రవేశాలకు అర్హత కలిగిన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. వచ్చే ఏడాది జనవరి 6వ తేదీ వరకు రూ.100 రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. 2023–24 విద్యా సంవత్సరంలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులని తెలిపారు. గురుకుల ప్రవేశ పరీక్ష వచ్చే ఏడాది ఫిబ్రవరి 11వ తేదీన నిర్వహిస్తారని వివరించారు.

ఎంఎస్‌పీ జిల్లా కమిటీ ఎన్నిక

ములుగు రూరల్‌: మహజన సోషలిస్టు పార్టీ జిల్లా కమిటీని బుధవారం ఎన్నుకున్నారు. జిల్లా నూతన అధ్యక్షుడిగా మడిపెల్లి శ్యాంబాబు, అధికార ప్రతినిధిగా గజ్జల ప్రసాద్‌, ఉపాధ్యక్షుడిగా వావిలాల సాంబశివరావు, వాసంపెల్లి సతీష్‌, ప్రధాన కార్యదర్శిగా కల్లెపెల్లి రమేష్‌, కార్యదర్శిగా శ్రీను, కోశాధికారిగా గుగ్గిళ్ల పీరయ్యలను ఎన్నుకున్నారు.

పరిష్కారానికి

నోచుకోని సమస్యలు

భూపాలపల్లి అర్బన్‌: సింగరేణి గుర్తింపు సంఘం టీబీజీకేఎస్‌ నిర్లక్ష్యంతో పదేళ్లుగా కార్మికుల సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోరిమి రాజ్‌కుమార్‌ ఆరోపించారు. గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఏరియా వర్క్‌షాప్‌లో కార్మికులతో గేట్‌మీటింగ్‌ నిర్వహించి మాట్లాడారు. నూతన గనులు రాకపోవడంతో రాబోయే రోజుల్లో సింగరేణి సంస్థలో పనిచేస్తున్న యువ కార్మికుల భవిష్యత్‌ అంధకారమే అన్నారు. సింగరేణిలో ప్రైవేటీకరణతో పాటు బొగ్గు గనులను కార్పొరేట్‌ కంపెనీలకు ఈ ప్రభుత్వాలు కట్టబెడుతున్నాయని విమర్శించారు. దీనివల్ల కార్మికుల హక్కులన్నీ హరించబడుతాయన్నారు. సింగరేణి ఏరియాలో అనేక గనులలో మూసివేసే పరిస్థితి నెలకొందని రాబోయే రోజుల్లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నూతన గనుల కోసం పోరాటాలు చేపడుతామన్నారు.

మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ రాజీనామా ఆమోదం

భూపాలపల్లి: భూపాలపల్లి మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ కొత్త హరిబాబు రాజీనామాను ఆమోదించినట్లు కలెక్టర్‌ భవేష్‌మిశ్రా బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వ్యక్తిగత కారణాలతో ఈ నెల 13న వైస్‌ చైర్మన్‌ పదవికి రాజీనామా చేస్తూ రాజీనామా పత్రాన్ని మున్సిపల్‌ కమిషనర్‌కు అందజేశారు. కమిషనర్‌ కలెక్టర్‌కు నివేదించగా రాజీనామాను ఆమోదించినట్లు ఉత్తర్వులు జారీచేశారు.

1/3

2/3

3/3

Advertisement
Advertisement