ప్రజాస్వామికవాదులంతా కలిసిరావాలి | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామికవాదులంతా కలిసిరావాలి

Published Wed, Mar 29 2023 1:16 AM

నాగర్‌కర్నూల్‌లో సంఘీభావం
ప్రకటిస్తున్న సీపీఎం నాయకులు  - Sakshi

నాగర్‌కర్నూల్‌ రూరల్‌/ కల్వకుర్తి రూరల్‌: దేశంలో బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుందని, ప్రధాని మోదీని వ్యతిరేకించే ప్రజాస్వామిక వాదులంతా కలిసిరావాలని సీపీఐఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సాగర్‌ అన్నారు. నాగర్‌కర్నూల్‌, కల్వకుర్తిలో మంగళవారం నిర్వహించిన జనచైతన్య యాత్ర సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశంలో జాతి, మత వైశమ్యాలు రెచ్చగొడుతూ బీజేపీ ప్రభుత్వం పబ్బం గడుపుతుందని ఆరోపించారు. మోదీ ప్రభుత్వాన్ని గద్దె దిచ్చేందుకు అఖిల భారత సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈ నెల 17 నుంచి 30 వరకు జనచైతన్య యాత్రలను ప్రారంభించామని చెప్పారు. 2014లో ముందు అధికారంలోకి వచ్చిన నరేంద్రమోదీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నెరవేర్చలేదని ఆరోపించారు. అదానీ, అంబానీలకు ప్రభుత్వ రంగ సంస్థలను కట్టబెట్టారని, కార్పొరేట్‌ శక్తులకు మేలు చేకూర్చేలా పనిచేస్తున్నారని విమర్శించారు. రైతుల ఆత్మహత్యలు ఆపడానికి రుణమాఫీ చేయాలని అడుగుతున్నా పట్టించుకోకుండా ఆదానీ, అంబానీ వంటి కార్పొరేట్‌ శక్తుల అప్పులను మాఫీ చేశారని దుయ్యబట్టారు. మోదీ ప్రభుత్వం కార్పొరేట్‌ శక్తుల వైపా.. ఉపాధి కూలీల వైపా స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. దేశవ్యాప్తంగా ఆకలి చావులు పెరిగాయని, పిల్లలకు రక్తహీనత ఏర్పడుతుందని, సామాజిక న్యాయం హరించుకుపోతుందని, మానవత్వం మరిచి మతం, కులం పేరుతో కలతలు పెంచి కలహాలు సృష్టిస్తున్నారన్నారు. 2006లో అటవీ హక్కుల చట్టం సాధించుకుంటే దానిని నీరుగార్చారని ఆరోపించారు. అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీపీఎం జనచైతన్య యాత్రకు సంఘీభావం తెలిపి మాట్లాడారు. సమావేశానికి సీపీఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు అధ్యక్షత వహించగా నాయకులు జ్యోతి అరుణ, భూపాల్‌, వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు.

సీపీఐఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సాగర్‌

Advertisement
Advertisement