ఇక చాలు దొర నీ పాలన | Sakshi
Sakshi News home page

ఇక చాలు దొర నీ పాలన

Published Tue, May 23 2023 1:20 AM

మాట్లాడుతున్న భట్టి విక్రమార్క  - Sakshi

నవాబుపేట: ఇక చాలు దొరో నీ పాలన అంటూ జనం కోరుకుంటూ తమ అసంతృప్తిని అడుగడుగున వివరించారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. తాను చేపట్టిన పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్రలో జనం తమకు జరుగుతున్న అన్యాయం, తాము కోల్పోయిన భూముల విషయమై ఎక్కువగా ఆవేదన వ్యక్తపరిచారన్నారు. పీపుల్స్‌ మార్చ్‌ యాత్రకు విరామం ప్రకటించి నవాబుపేట మండలం రుక్కంపల్లిలో విశ్రాంతి తీసుకుంటున్న ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్‌ నియంత పాలనలో ప్రజలు విసిగి పోయారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ గతంలో చేపట్టిన ప్రాజెక్టుల విషయాన్ని కేసీఆర్‌ ఒకసారి గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. కేసీఆర్‌ పైపులు, పంపుల కొనుగోలు కోసం ప్రాజెక్టులు చేపట్టి వాటిని మధ్యలో వదిలేస్తూ కాంగ్రెస్‌ పార్టీపై ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. పాలమూరు ప్రాజెక్టుకు కాంగ్రెస్‌ మొదట్లో రూ.10కోట్లు కేటాయించి అడ్మినిస్ట్రేటివ్‌ మంజూరు ఆర్డర్‌ ఇచ్చిందని గుర్తుచేశారు. కేసీఆర్‌ మాత్రం పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ప్రధానమైన లక్ష్మీదేవిపల్లి ఊసే లేకుండా చేయడం భావ్యం కాదన్నారు. కేవలం డబ్బలు దండుకునేందుకే డిజైన్లు మారుస్తూ ప్రజలకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ విజయం సాధించడంతో ఇక్కడ కేసీఆర్‌కు నిద్రపట్టడం లేదన్నారు. వాగ్ధానాలు చేయడం, మాట తప్పడం కేసీఆర్‌ నైజం అని, అందుకే దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడెకరాల భూమి పంపిణీ హామీలపై నోరుమెదపడు అని దుయ్యబట్టారు. నిరుద్యోగ భృతి, డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల మంజూరు, ఇంటికో ఉద్యోగం ఆ కోవకే చెందుతాయని ఎద్దేవా చేశారు. 2023లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలిచి పాలమూరు బీడు భూములకు నీరు పారించే బాధ్యత తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌ పార్టీకి 90 నుంచి 100 సీట్లు తక్కువ కాకుండా వస్తాయని.. మిగతా 10– 15 సీట్లను బీఆర్‌ఎస్‌ మిగతా పార్టీలు పంచుకుంటాయని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి జోస్యం చెప్పారు. సమావేశంలో పీసీసీ నాయకులు మదన్‌మోహన్‌రావు, మల్లురవి, అనిరుధ్‌రెడ్డి, బంగ్ల రవి, ఖాజా, జహీర్‌, రామచంద్రయ్య పాల్గొన్నారు.

నేడు పాదయాత్ర ప్రారంభం

ఐదు రోజుల విరామం అనంతరం మంగళవారం భట్టి విక్రమార్క పాదయాత్ర రుక్కంపల్లి నుంచి ప్రారంభంకానుంది. కాగా భట్టి ఈ నెల 16న మండలానికి చేరుకుని 17 వరకు పాదయాత్ర కొనసాగించారు. 18న అస్వస్థతకు గురైన ఆయన వైద్యుల సూచన మేరకు రుక్కంపల్లిలోనే విశ్రాంతి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుట పడటంతో మంగళవారం ఉదయం రుక్కంపల్లి నుంచి చెన్నారెడ్డిపల్లి, మల్లారెడ్డిపల్లి, కూచూర్‌, దొడ్డిపల్లి, కిష్టారం వరకు పాదయాత్ర కొనసాగనుంది. కిష్టారంలో రాత్రి బస చేయనున్నారు.

బీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజాధనం లూటీ

సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క విమర్శ

Advertisement
Advertisement